iDreamPost
android-app
ios-app

శివపుత్రుడి నట విశ్వరూపం – Nostalgia

  • Published Feb 07, 2021 | 12:16 PM Updated Updated Feb 07, 2021 | 12:16 PM
శివపుత్రుడి నట విశ్వరూపం – Nostalgia

సాధారణంగా మన సినిమాల్లో హీరో అంటే ఎలా ఉండాలి. అయితే జులాయిగానో లేదా మల్టీ మిలియనీర్ గానో లేదా కాలేజీ స్టూడెంట్ గానో ఏదో రకంగా మన మధ్య ఉండే పాత్రల తరహాలోనే చూడటం సౌత్ ప్రేక్షకులకు అలవాటు. అలా కాకుండా ఓ స్మశానంలో పుట్టి పెరిగి శవాలను దహనం చేసేవాడిని కథానాయకుడిగా కనీసం ఊహించుకోగలమా. ఏ నిర్మాతైనా పెట్టుబడి పెడతాడా. అంతెందుకు ఈ విషయం తెలిసి ఆడియన్స్ థియేటర్ దాకా వస్తారా. ఇలా ఆలోచిస్తే బాలా అనే గొప్ప దర్శకుడు మనకు దొరికే వాడు కాదు. అడుగంటిన జీవితాల లోతులను మన ఊహించలేనంత పచ్చిగా స్పృశించే ఆయన శైలి ఎవరికీ లేని గొప్ప విలక్షణతను తెచ్చి పెట్టింది.

1999లో సేతుతో కోలీవుడ్ కు పరిచయమైన బాలా అందులో ఓ స్వచ్ఛమైన ప్రేమికుడి ప్రయాణం ఉన్నత స్థాయి నుంచి పిచ్చాసుపత్రి దాకా ఎలా తీసుకొచ్చిందనే క్రమాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరుకి ప్రేక్షకులు అప్రతిభులయ్యారు. విక్రమ్ లోని అసలైన నటుడు బయటికి వచ్చింది ఇందులోనే. దీన్నే తెలుగులో రాజశేఖర్ శేషు పేరుతో రీమేక్ చేసి దెబ్బతినడం ఎవరూ మర్చిపోలేరు. తర్వాత 2001లో సూర్యతో నందా తీసిన బాలా అందులో తండ్రినే హత్య చేసిన ఓ అనాథ ప్రస్థానాన్ని అద్భుతంగా చూపించారు. ఈ ఇద్దరినీ కలిపి మరో దృశ్య కావ్యాన్ని తీయాలన్న ఆలోచనే బాలాను జయకంఠన్ ఇచ్చిన కథతో 2003లో పితామగన్ తీసేందుకు ప్రేరేపించింది.

అదే తెలుగులో శివపుత్రుడుగా వచ్చింది. స్మశానంలో శవాలకాపరిగా కనీసం మాటలు కూడా సరిగారాని ఎలాంటి భావోద్వేగాలను లేని పాత్రలో విక్రమ్ నట విశ్వరూపానికి చలించని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. కరుడు గట్టిన బండరాయి లాంటి క్యారెక్టర్ కోసం చియాన్ విక్రమ్ తనను తాను మలుచుకున్న తీరు నిజంగా రాబోయే యాక్టర్స్ కు ఒక గ్రామర్ బుక్ లాంటిది. చిల్లర మోసాలు చేసే సూర్యతో కలిగే స్నేహం, విలన్ వల్ల తన స్నేహితుడు చనిపోతే క్లైమాక్స్ లో చూపించే విక్రమ్ అల్టిమేట్ పెర్ఫార్మన్స్ శివపుత్రుడుకి ఇక్కడా ఘనవిజయం దక్కేలా చేసింది. ఇళయరాజా సంగీతం ఈ సినిమా స్థాయిని పదింతలు పెంచేసింది. విక్రమ్ కు జాతీయ అవార్డుల విభాగంలో సిల్వర్ లోటస్ తో ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కింది.