iDreamPost
android-app
ios-app

లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీల మధ్య మనస్పర్ధలు

లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీల మధ్య మనస్పర్ధలు

హిందీ చలనచిత్ర పరిశ్రమలో మూడున్నర దశాబ్దాల పాటు తిరుగులేని గాయకులుగా వెలిగిన వారు మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్. మహమ్మద్ రఫీ మరణం తరువాత కూడా లతా మంగేష్కర్ హవా చాలా కాలం కొనసాగింది. వివాదరహితుడుగా పేరు ఉన్న రఫీకి, లతా మంగేష్కర్ కీ మధ్య మనస్పర్ధలు వచ్చి మూడు సంవత్సరాలు ఇద్దరూ కలిసి ఒక్క పాట కూడా పాడలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

1960 దశకంలో గ్రామఫోన్ కంపెనీ గాయకులకు కూడా పారితోషికం చెల్లించాలన్న లతా మంగేష్కర్ డిమాండు ఈ వివాదానికి కారణం. అప్పట్లో అన్ని సినిమాల పాటలూ హెచ్ ఎం వీ కంపెనీ వారు గ్రామఫోన్ రికార్డుల రూపంలో విడుదల చేసేవారు. అందుగ్గానూ సినిమా నిర్మాతకి కొంత మొత్తం చెల్లించేవారు. ఇందులో గాయకులకు కానీ, సంగీత దర్శకుడికి కానీ ఏమీ ముట్టేది కాదు. ఇది మారాలని, పాడినందుకు తమకు కూడా పారితోషికం అందాలని లతా మంగేష్కర్ పట్టుబట్టారు.

అగ్రస్థానంలో ఉన్న గాయకుడు రఫీ కూడా తనకు మద్దతు ఇస్తే తన డిమాండుకు బలం చేకూరుతుందని లతా భావించారు. అయితే రఫీ డబ్బులు విషయం పెద్దగా పట్టించుకునేవారు కాదు. “ప్లీజ్ రఫీ సాబ్” అని తెలిసిన వారు మొహమాటం పెడితే పాటకు ఒక రూపాయి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. విడుదల తర్వాత ఇస్తామని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాట పాడి, దానికి రావలసిన పారితోషికం తీసుకున్నాక తనకూ, పాటకూ సంబంధం లేదని వారి భావన.

తనకు మద్దతు ఇవ్వలేదని రఫీతో కలిసి పాడటం మానేశారు లత. తనకోసం వచ్చిన నిర్మాతలకు ముందుగానే ఆ విషయం చెప్పేవారు. దీంతో ఎన్నో అజరామరమైన గీతాలు అందించిన ఆ జంట 1960-63 మధ్య కలిసి ఒక్క పాట కూడా పాడలేదు.

లత గొంతు కావలనుకున్న సంగీత దర్శకులు ఆమెకి జంటగా మహేంద్ర కపూర్ తో, రఫీ కావాలనుకుంటే సుమన్ కళ్యాణ్ పూర్ తో పాడించారు. చివరకు 1963లో రాజ్ కపూర్ ఆస్థాన సంగీత దర్శకుల జంటలో ఒకరైన జైకిషన్ పట్టుబట్టి ఇద్దరినీ కలిపి తమ సినిమాలో పాడించడంతో ఈ ఇద్దరి స్వర్ణయుగం జులై 31,1980న రఫీ మరణం వరకూ అప్రతిహతంగా కొనసాగింది.

(జులై 31 మహమ్మద్ రఫీ వర్ధంతి)