iDreamPost
android-app
ios-app

గబ్బర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

గబ్బర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచులో ఢిల్లీ జట్టు ఓడిపోయినప్పటికి ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో వరుస మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా గబ్బర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో 5000 పరుగులను సాధించి 5000 పరుగుల క్లబ్ లో అడుగుపెట్టిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా ధావన్ నిలిచాడు.

169 మ్యాచుల్లో 168 ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్ 34.78 సగటుతో 5043 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా రెండు సెంచరీలను ఐపీఎల్‌-13లోనే గబ్బర్ సాధించడం విశేషం. గతంలో సురేశ్ రైనా 5000 పరుగుల క్లబ్‌లో చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రైనా 189 ఇన్నింగ్స్‌ల్లో 5149 రన్స్ చేయగా రైనా తర్వాత 5000 పరుగుల క్లబ్ లో అడుగుపెట్టిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. 178 ఇన్నింగ్స్‌ల్లో 5759 రన్స్‌ చేసిన కోహ్లి ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో 191 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ కూడా ఈ సీజన్లోలే 5000 పరుగులు పూర్తి చేయడం గమనార్హం. ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకూ 5149 రన్స్ సాధించాడు.