iDreamPost
iDreamPost
కరోనా వైరస్ విస్తృతి కమ్యూనిటీ స్ప్రెడ్ (సామూహిక వ్యాప్తి) దశకు చేరుకుందా? అన్న ప్రశ్నకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. మొదటి దశలో విదేశాల నుంచి ఇక్కడికి రావడం, తరువాత దశలో వారి నుంచి దేశంలోని వారికి వ్యాపించడం, ఆ తరువాత దేశంలోని వారి నుంచే స్థానికంగా వ్యాపించడంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలోనే ఒకరి నుంచి మరొకిరి వ్యాపించే దశనే అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఇలా సామూహిక వ్యాప్తి దశకు చేరితే దానిని కంట్రోల్ చేయడం అత్యంత కష్టమైన పనిగా వివరిస్తున్నారు. ప్రతి రోజూ 30వేలకు పైగా కేసులు వరుసగా దేశంలో నమోదవుతుండడంతో ఈ అంచనాకు వస్తున్నారు. అయితే అధికారికంగా ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ నిపుణులు చెబుతున్న ఈ వ్యాఖ్యలను కూడా కొట్టిపారేసేందుకు వీల్లేదు.
ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలోని దాదాపు 1500లకుపైగా టెస్ట్ సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు దేశంలో 1.40 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటి ద్వారా 11 లక్షలకుపైగా పాజిటివ్ కేసులను యంత్రాంగం ధృవీకరించింది. ఈ వైరస్ భారిన పడి ఇప్పటి వరకు 26వేల మందికి పైగా మృతి చెందారు. భారత దేశంలో తొలి లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యేందుకు (జనవరి 30 నుంచి మే 19 నాటికి) దాదాపు 110 రోజులు సమయం పట్టింది. కానీ 9లక్షల పాజిటివ్‌లు రావడానికి కేవలం 59 రోజులు మాత్రమే పట్టింది. దీనిని బట్టే ఈ వైరస్ దేశంలో ఎంత వేగంగా విస్తృతమవుతుందో అర్ధం చేసుకోవచ్చు.
ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఈ వైరస్ ఛైన్‌ను తెంపేందుకు మాస్క్‌లు, భౌతిక దూరం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలను వైద్య నిపుణులు సూచించారు. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించే చోట ఈ వైరస్ వ్యాప్తి లేకపోవడం/అతి తక్కువగా ఉండడం గానీ గుర్తించొచ్చు. అయితే జనం ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో? అక్కడే ఈ వైరస్ ఉధృతి విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్కరు చేసే నిర్లక్ష్యం కారణంగా వందల్లోనే కరోనా పాజిటివ్ బాధితులు ఏర్పడుతున్నారు. ఇందులో ప్రత్యక్షంగా బాధితుల ప్రమేయం లేకపోయినప్పటికీ పలువురు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది.
ఒక పక్క వ్యాధి భారిన పడ్డవారు తీవ్ర ఆందోళనకు గురవుతుండగా, సోకని వారిలో మాత్రం ‘మనకు రాదులే’ అన్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఈ నిర్లక్ష్యంతోనే ఇష్టమొచ్చినట్లు తిరిగేట్టు పురిగొల్పుతోంది. ఇప్పుడు పెరుగుతున్న కేసులకు దాదాపు నెల క్రితం జనం వహించిన నిర్లక్ష్యమే కారణమని చెప్పక తప్పదు. విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు సంఖ్యను చూస్తే.. ఆయా ప్రాంతాల్లో గత నెలరోజులుగా పాటించిన నిబంధనల నాణ్యతను ప్రశ్నిస్తున్నాయి. కరోనా విషయంలో జనం నిర్లక్ష్యమే ముంచుతోందన్న విషయాన్ని గుర్తించకపోతే యంత్రాంగం సైతం చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సిన పరిస్థితులు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.