Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు పంపారు. చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు సంబంధించి ఈ నోటీసులు సెర్వ్ చేశారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ సూసైడ్ కు పాల్పడ్డాడని.. ఓం ప్రతాప్ ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఆయన డీజీపీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు పంపారు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ తన నోటీసులో కోరారు.
ఇలాఉండగా, పుంగనూరు నియోజక వర్గం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన ఓం ప్రతాప్ గతనెల 24న రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కొద్దిరోజుల క్రితం మద్యం విధానంపై అసభ్య పదజాలంతో సీఎంను విమర్శిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా తర్వాత ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అనుమానాలు లేవు…
సోమల మండలం పెద్దకాడ హరిజనవాడలో మృతి చెందిన ఓంప్రతాప్ (28) మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ఆయనది సహజ మరణమేనని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఇప్పటికే ప్రకటించారు. మృతుడి కుటుంబ సభ్యులు సైతం ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఓంప్రతాప్ మృతిపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టింగ్‌లు, చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేశ్, టీడీపీ నాయకుడు వర్ల రామయ్యల ఆరోపణల్లోనూ వాస్తవం లేదని పోలీసులు ధృవీకరించారు. ఓం ప్రతాప్ మృతిపై ప్రతిపక్ష నాయకుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు ఉన్నా అందజేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబుకు నోటీసులు కూడా పంపారు. ఓంప్రతాప్ మాటలను కొంతమంది రికార్డు చేసి, దురుద్దేశంతోనే సోషల్ మీడియాలో పెట్టారని, ఆయన స్వయంగా ఎలాంటి పోస్టులు పెట్టలేదని పోలీసులు వివరించారు.