iDreamPost
iDreamPost
తెలుగు సినిమా సంగీతాన్ని, సాహిత్యాన్ని గొప్ప మలుపు తిప్పిన దిగ్గజాల్లో దివంగత వేటూరి సుందరరామ్మూర్తి, ఎస్పి బాలసుబ్రమణ్యం గార్లకు ఉన్న విశిష్ట స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటలు చిరస్ధాయిగా నిలిచిపోతాయి. శంకరాభరణంలో చాలా క్లిష్టమైన వేటూరి సాహిత్యం పండిత పామర జనం కూడా సులువుగా పాడుకునేలా చేయడం బాలు వల్లే సాధ్యమయ్యింది. ఎన్నో వేల పాటలు ఈ కలయికలో ప్రాణం పోసుకున్నాయి. ఇద్దరి మధ్య ఎంతటి ఆత్మీయ అనుబంధం ఉందో చాలా సందర్భాల్లో ప్రత్యక్షంగానూ చూసాం. సోదరుల మధ్య ఉండే అన్యోన్యత వీళ్ళలో కనిపించేది. గుణగణాల్లోనూ లక్షణాల్లోనూ ప్రతిభలనూ ఎన్నో సారూప్యతలు కనబరిచే ఈ దిగ్గజాలు భూమి మీద జీవించిన కాలం కూడా ఒకటే అంటే విస్మయం కలగక మానదు.
అదెలాగో మీరే చూడండి. వేటూరి గారి జన్మదినం 1936 సంవత్సరం జనవరి 29. ఆయన 2010 మే 22న పరమపదించారు. అంటే ఆయన జీవిత కాలం లెక్క వేసుకుంటే 74 సంవత్సరాల 114 రోజులు. ఇక బాలసుబ్రమణ్యం గారి పుట్టిన రోజు 1946 సంవత్సరం జూన్ 04వ తేదీ. ఈ నెల 25న మనందరినీ శోకంలో ముంచుతూ స్వర్గానికేగారు. ఇప్పుడు ఈయన జీవితం కాలం లెక్క వేసుకుని చూస్తే అక్షరాలా 74 సంవత్సరాల 114 రోజులే. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే కావొచ్చు. కొందరికి కాకతాళీయం కూడా అనిపించవచ్చు. అయితే రోజులతో సహా ఇద్దరూ భూమి మీద బ్రతికిన రోజులు ఒకటే కావడం మాత్రం ముమ్మాటికీ అరుదైన విషయమే. సరస్వతి పుత్రులుగా తెలుగు సినీ పరిశ్రమ పూజించే ఈ ఇద్దరి నేల నడయాడిన కాలం లెక్కవేసినట్టు మరీ ఒకటే కావడం విచిత్రమే.
దీన్ని భగవత్ సంకల్పం అని కూడా అనొచ్చని ఈ విషయం విన్న వారు అంటున్నారు. దశాబ్దాల తరబడి తమ విద్వత్తుతో కోట్లాది అభిమానులను అలరించి వాళ్ళ గుండెల్లో చీర స్థానం సంపాదించుకున్న వేటూరి-బాలులు ఇప్పుడు ఒకేచోట తమ ఏకాంతాన్ని సంగీత సాహిత్య సౌరభాలతో ఎంతగా ఆస్వాదించుకుంటున్నారో. వీళ్ళు లేని లోటు ఎవరూ పూడ్చలేనిదే అయినప్పటికీ నిత్యం మనం చూసే వినే పాటల్లో ఎప్పుడూ అమరులుగానే ఉంటారు. వీరికి భౌతిక మరణమే కానీ సంగీత సాహిత్యాలు మనిషి మనుగడలో ఉన్నంత వరకు వారి కళా ఊపిరి ఎందరో ఔత్సాహికులకు ప్రోత్సాహం అందిస్తూనే ఉంటుంది. విధి ఇద్దరికీ ఒకే జీవిత కాలాన్ని ప్రసాదించినప్పటికీ వాళ్ళు చేసిన కళామసేవకు మాత్రం ఎలాంటి పరిమితి ఉండదు. ఉండబోదు.