iDreamPost
android-app
ios-app

బుర్ర ఉందా? బీజేపీ టికెట్ నాకెందుకు ఇచ్చారంటున్న బెంగాల్ నేత

బుర్ర ఉందా? బీజేపీ టికెట్ నాకెందుకు ఇచ్చారంటున్న బెంగాల్ నేత

బీజేపీకి ఊహించని ఇబ్బంది ఎదురైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీకి అనుకోని అవాంతరం ఎదురైంది. బిజెపి టికెట్ల కోసం భారీగా ఆశావహులు ఉన్నారన్న ప్రచారం సాగుతున్న ఈ సమయంలో బిజెపి కేటాయించిన టిక్కెట్ తనకు వద్దని, తనను సంప్రదించకుండా బిజెపి ఎలా టికెట్ కేటాయిస్తారంటూ ఓ మహిళ నేత ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా బెంగాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

294 అసెంబ్లీ సీట్ల పశ్చిమబెంగాల్లో బిజెపి మార్చి 6వ తేదీన 57 సీట్లకు సంబంధించి మొదటి లిస్టును విడుదల చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీలో ఈ లిస్టును విడుదల చేయగా గురువారం తుది జాబితాను బీజేపీ విడుదల చేసింది. 57 మంది పేర్లతో ఐదవ జాబితాగా బయటికి వచ్చిన ఈ లిస్టులో ఉన్న ఒక పేరు ఇప్పుడు వివాదం సృష్టించింది.

Also Read:పనబాక లక్ష్మి నామినేషన్ వేస్తున్నారంటా…!

దివంగత కాంగ్రెస్ నాయకుడు సోమన్ మిత్ర భార్య శిఖ మిత్ర పేరును చౌరింఘీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం పట్ల ఆమె మండిపడుతున్నారు. తాను బీజేపీలో చేరకుండానే, టికెట్ కోరకుండానే తనకు ఎలా టికెట్ కేటాయిస్తారు అంటూ ఆమె ఎదురు ప్రశ్న వేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బిజెపి పార్టీలో చేరకుండానే తనను సంప్రదించకుండానే తుది జాబితాలో తన పేరును ప్రకటించారని ఆమె మీడియా ముఖంగా అసహనం వ్యక్తం చేశారు.

సొమెన్ మిత్ర ఆషామాషీ నాయకుడు కాదు.. 1972 నుంచి 2006 వరకు ఎమ్మెల్యే గా గెలిచారు.అందులో 1982 -2006 మధ్య వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009 లో ఎంపీ గా గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసాడు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న 1998లోనే మమతా బెనర్జీ కాంగ్రెస్ కు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది.

Also Read:చంద్రబాబుకు మరో “స్టే” – అమరావతి భూముల కుంభకోణం

మమత కాంగ్రెస్ ను వీడిన దశాబ్దం తరువాత 2008లో ప్రగతిశీల ఇందిరా కాంగ్రెస్ ను స్థాపించాడు. ఆ పార్టీ ఎక్కువ కాలం కొనసాగలేదు. 2009 లోక్ సభ ఎన్నికల సందర్భంలో తన పార్టీని మమతా తృణమూల్ లో విలీనం చేసి టీఎంసీ తరుపున లోక్ సభకు ఎన్నికయ్యాడు.కానీ మమతతో ఎక్కువ కాలం కలిసి పనిచేయలేక పోయిన సొమెన్ మిత్ర 2014 జనవరిలో తిరిగి కాంగ్రెస్లో చేరాడు.2016లో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు కుదరటంలో సొమెన్ మిత్రాది కీలకపాత్ర. 2018లో మరోసారి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన సొమెన్ మిత్ర 2020 జూలై లో కరోనా తో మరణించాడు

సొమెన్ మిత్ర భార్య శిఖా మిత్ర 2009లో షేల్దా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ తరుపున ఎమ్మెల్యే గా గెలిచారు.మిత్ర దంపతులు టీఎంసీ లో ఉన్నా వారి మనసు కాంగ్రెస్ లోనే ఉండేది. సొంత పార్టీ మంత్రుల మీద,ప్రభుత్వం మీద పలుసార్లు విమర్శలు చేసేవారు. శిఖా మిత్ర చివరికి ఒక మంత్రి మీద పరువు నష్టం దావా కూడా వేశారు.2012లో ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ అయిన శిఖాను 2014 లో పార్టీ నుంచి బహిష్కరించారు. 2014 నుంచి సొమెన్ మరియు శిఖా మిత్రాలు కాంగ్రెసులోనే కొనసాగారు.

Also Read:ఇదీ.. విశాఖ ‘విశ్వ’రూపం

ఎంతో సీనియర్ నాయకుడు అయిన సోమన్ మిత్ర పరిచయాలు తమకు పనికివస్తాయి అనే కోణంలో కొద్ది రోజుల క్రితం బీజేపీ నాయకుడు సువెందు అధికారి సొమెన్ మిత్ర భార్య శిఖ మిత్రతో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లోనే ఆమె బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది.

ఇలాంటిదే మరో సంఘటన బీజేపీని ఇబ్బంది పెట్టింది. మాలా సాహా అనే టీఎంసీ ఎమ్మెల్యే భర్త తరుణ్ సాహాకు టికెట్ కేటాయించింది. తన కుటుంబం టీఎంసీలోనే ఉందని,తానూ బీజేపీ తరుపున పోటీచేయటం లేదని తరుణ్ ప్రకటించాడు.

తమపార్టీలో లేని వారికి బీజేపీ టికెట్ ఎలా ప్రకటిస్తుందని తృణముల్ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. బిజెపి కు అభ్యర్థులు దొరకకపోవడంతో ఇలాంటి చర్యలు చేస్తోందంటూ వారు రాజకీయంగానూ ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 294 సీట్లకు ఐదుసార్లు అభ్యర్థులను ప్రకటించిన బిజెపికి ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు తప్పటం లేదంటూ కొంతమంది తృణముల్ కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేయటంతో బిజెపి ఆగమేఘాలమీద దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.