iDreamPost
iDreamPost
తెలుగు సినిమాకు సంబంధించి కొందరు నట దిగ్గజాల గురించి వర్ణించాలంటే మాములు పదసంపద సరిపోదు. అలాంటి వారిలో ముందువరసలో చెప్పుకోవాల్సిన పేరు ఎస్వి రంగారావు. విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈయన ధరించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. మాయాబజార్, పాతాళభైరవి, పాండవ వనవాసం, భక్త ప్రహ్లాద, నర్తనశాల, తాతమనవడు, పండంటి కాపురం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. అయితే రంగారావు గారి జీవితాన్ని మలుపు తిప్పిన ఓ సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉద్యోగం చేస్తూ ఒకవైపు నాటకాలు వేస్తున్న రోజుల్లో ఎస్విఆర్ మనసు సినిమాల మీదే ఉండేది.
1946లో వరూధిని సినిమా ప్లాన్ చేసిన ఈయన దూరపు బంధువు బివి రామానందం గారు టైటిల్ రోల్ అయిన ప్రవరాఖ్యుడి కోసం కబురు పంపారు. చాలా కష్టపడి మనసు పెట్టి చేసిన ఆ చిత్రం విజయం సాధించలేదు. దాంతో అవకాశాలు రాలేదు. లాభం లేదని జెంషెడ్ పూర్లో టాటా కంపెనీలో జాబ్ లో చేరిపోయారు. కాని అక్కడ స్థానిక నాటక అసోసియేషన్ పుణ్యమాని తనలో కళాకారుడికి పని చెప్పేవారు. అదే సమయంలో 1950లో పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ వేషం కోసం ఈయనకు ఉత్తరం అందింది. సరిగ్గా అదే సమయంలో ఎస్విఆర్ తండ్రి కోటేశ్వర్ నాయుడు గారు కాలం చేశారు.
అలా ఆ అవకాశం ఏవి సుబ్బారావుకు వెళ్లిపోయింది. అయితే అందులోనే మరో చిన్న వేషం దక్కించుకున్నారు. తర్వాత ఎల్వి ప్రసాద్ గారు తీసిన ఎన్టీఆర్ మొదటి సినిమా మన దేశంలో పెద్దగా ఉపయోగం లేని మరో మినీ రోల్ అంతగా పేరు తీసుకురాలేకపోయింది. చేతిదాకా వచ్చి నిర్దోషి మిస్ అయ్యింది. చిన్న చిన్న పాత్రలతో బ్రేక్ దొరకడం లేదు. ఆ సమయంలో విజయ వారి షావుకారులో సున్నపు రంగడు పాత్రను రంగారావు గారు అద్భుతంగా పోషించారు. సినిమా గొప్ప విజయం సాధించకపోయినా ఎస్విఆర్ కు పేరు వచ్చింది.
కెవి రెడ్డి-చక్రపాణిలో అప్పుడు కలిగిన నమ్మకమే తర్వాత 1951 పాతాళభైరవిలో మాంత్రికుడు వేషం దక్కేలా చేసింది. అంతే అక్కడి నుంచి ఎస్వి రంగారావు గారు వెనక్కు తిరిగి చూసుకునే అవసరం పడలేదు. సున్నపు రంగడు లేకపోతే మాంత్రికుడు దొరికేవాడు కాదు. అందుకే తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగినా షావుకారులో చేసిన ఆ పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనంత గొప్ప మలుపుగా నిలిచిపోయింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇలాంటి జ్ఞాపకాల్లో ఓలలాడుతున్నారు.