iDreamPost
android-app
ios-app

శర్వా ‘శ్రీకారం’ వాళ్ళ దారిలోనే ?

  • Published Sep 21, 2020 | 1:59 PM Updated Updated Sep 21, 2020 | 1:59 PM
శర్వా  ‘శ్రీకారం’ వాళ్ళ దారిలోనే ?

హ్యాట్రిక్ డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరి అయిన శర్వానంద్ తనదైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నో అంచనాలతో చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను మూడూ టాలెంటెడ్ డైరెక్టర్లు హ్యాండిల్ చేసినప్పటికీ ఫలితం ఒకేలా రావడం మాత్రం అభిమానులకు బాధ కలిగించింది. అందుకే రాబోయే శ్రీకారం మీద వాళ్ళ అంచనాలు మాములుగా లేవు. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డితో 14 రీల్స్ సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకొంచెం మాత్రమే బాలన్స్ ఉంది. సరిగ్గా లాక్ డౌన్ కు ముందు శర్వా ఏదో కారణాల వల్ల హఠాత్తుగా విదేశాలకు వెళ్లాల్సి రావడం ఆగిపోయింది కానీ లేదంటే అప్పుడే ఫస్ట్ కాపీ చేతుల్లో ఉండేది.

సరే జరిగిందేదో జరిగిందని ఇప్పుడు దాన్ని పూర్తి చేయడం మీద ఫోకస్ పెడుతున్నారు. తాజా అప్డేట్ ప్రకారం శ్రీకారం ప్రస్తుతం ఓటిటి చర్చల్లో ఉందట. ఖరారుగా తెలియదు కానీ డిజిటల్ సంస్థల నుంచి డీల్స్ వస్తున్నాయని తెలిసింది. శర్వా రేంజ్ హీరోకు 30 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉండటంతో అది ఆఫర్ చేసినవాళ్లు కు ఇచ్చే అవకాశం లేకపోలేదని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ తెరిచినా సంక్రాంతి సీజన్ కోసం ఇప్పటి నుంచే విపరీతమైన పోటీకి రెడీ అవుతున్నారు ఇతర నిర్మాతలు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో మొదలుకుని అఖిల్ బ్యాచిలర్ దాకా అందరూ జనవరి మీద కన్నేశారు.

అంత రద్దీలో శ్రీకారం లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ విలేజ్ డ్రామా నెగ్గుకురావడం ఈజీ కాదు. కంటెంట్ లో ఎంత దమ్మున్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. అన్నేసి సినిమాలు వస్తే ప్రేక్షకులు ప్రతిదీ థియేటర్లో చూసే మూడ్ లో లేరు. వ్యాక్సిన్ వచ్చే దాకా ఇంచుమించు ఇదే ధోరణి కొనసాగేలా ఉంది కాబట్టే వి, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో, ఆకాశం నీ హద్దురా ఓటిటి బాట పట్టక తప్పలేదు. మరికొన్ని డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. మరి శ్రీకారం కూడా వీటితో జట్టు కడుతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.