iDreamPost
iDreamPost
ఇవాళ ఏకంగా పదకొండు కొత్త సినిమాల హడావిడిలో ఏ1 ఎక్స్ ప్రెస్ తర్వాత చూసుకుంటే కేవలం దిల్ రాజు బ్యానర్ లో రూపొందిందన్న కారణంగా కొంత హైప్ తెచ్చుకున్న చిత్రంగా షాదీ ముబారక్ థియేటర్లలో అడుగు పెట్టింది. ఎప్పుడు తీశారో ఎప్పుడు పూర్తి చేశారో అని డౌట్ వచ్చేలా హఠాత్తుగా ఓ నెల రోజుల క్రితం ప్రమోషన్లు మొదలుపెట్టిన టీమ్ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీవీ సీరియల్స్ ద్వారా ఇమేజ్ తెచ్చుకున్న నటుడు సాగర్ అలియాస్ ఆర్కె నాయుడు హీరోగా మలయాళీ భామా దృశ్య రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ షాదీ ముబారక్ కు పద్మశ్రీ దర్శకత్వం వహించారు. మరి ఇదెలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూసేద్దాం.
పెళ్లి కోసం విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన సున్నిపెంట మాధవ్(సాగర్)అమ్మాయిల వెతుకులాటలో తనకు సంబంధాలు చూస్తున్న మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురి(దృశ్య)తోనే కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగే పరిణామాలు మిగిలిన కథను అల్లుకుంటూ వెళ్లాయి. సాగర్ లో ఉన్న మంచి నటుడు టీవీకి సింక్ అయినట్టుగా స్క్రీన్ కు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. తనవరకు బాగానే చేసేందుకు కష్టపడ్డాడు కానీ డెప్త్ ఉన్న సీన్స్ లో ఎందుకో తడబడినట్టు కనిపిస్తుంది. దృశ్య లుక్స్ పరంగా బాగున్నా తనదీ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పలేం. ఉన్నంతలో రాహుల్ రామకృష్ణ కామెడీ పర్లేదు. ఆర్జె హేమంత్, హేమ, ఝాన్సీ, భద్రం, అజయ్ ఘోష్ తదితరులవి రొటీన్ పాత్రలే.
దర్శకుడు పద్మశ్రీ తీసుకున్న లైన్ చిన్నదే అయినప్పటికీ ఎంటర్ టైనింగ్ గా చెప్పాలనుకున్న ప్రయత్నం ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదు అనిపించినా రెండో సగంలో తడబడింది. బలమైన క్యాస్టింగ్ లేదా ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్లు చేసుంటే కొంచెం బెటర్ గా అనిపించేదేమో కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం పద్మశ్రీ టేకింగ్ ప్లస్ రైటింగ్ యావరేజ్ గా అనిపిస్తాయి. అక్కడక్కడ ఫన్ ఉన్నప్పటికీ మిగిలిన మైనస్సులను కవర్ చేయడానికి అది సరిపోలేదు. సునీల్ కశ్యప్ సంగీతం పర్లేదు. శ్రీకాంత్ నరోజ్ ఛాయాగ్రహణం జస్ట్ ఓకే. ఫైనల్ గా చెప్పాలంటే కూసింత వినోదం ఉంటే చాలు అనుకుంటే తప్ప షాదీ ముబారక్ తన మీద అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది.