iDreamPost
android-app
ios-app

“మణి” కాంగ్రెస్ వ్యవస్థాపక నేత మృతి

“మణి” కాంగ్రెస్ వ్యవస్థాపక నేత మృతి

కేరళ కాంగ్రెస్ (మణి) ప్రాంతీయ పార్టీ వ్యవస్థాపక నాయకులలో ఒక్కరైన చంగనస్సేరి ఎమ్మెల్యే సీఎఫ్ థామస్ మరణించారు. తిరువళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రులో కాన్సర్స్‌కు చికిత్స పొందుతున్న 81 ఏళ్ల థామస్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన చాలా నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

కొట్టాయం జిల్లాలోని చంగనాస్సేరి నుండి సీఎఫ్ థామస్ తొలిసారి 1980 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు.అదే సీటు నుండి 2016 అసెంబ్లీ ఎన్నికల వరకు వరుసగా తొమ్మిది సార్లు రికార్డ్ స్థాయిలో విజయం సాధించారు. ఆయన ఒకే స్థానం నుండి 40 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగడం విశేషం. ఇక 2001-2006 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వంలో థామస్ గ్రామీణాభివృద్ధి, రిజిస్ట్రేషన్, ఖాదీ మంత్రిగా పనిచేశారు.

జాతీయ కాంగ్రెస్ విద్యార్థి సంఘమైన కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కెఎస్‌యు) ద్వారా సీఎఫ్ థామస్ రాజకీయాలలోకి ప్రవేశించారు.అనంతరం ఆయన 1979లో కాంగ్రెస్‌ పార్టీని వీడి కె.ఎం.మణి మరియు ఇతరులతో చేతులు కలిసి కేరళ కాంగ్రెస్ (మణి) అనే ప్రాంతీయ పార్టీని ఏర్పాటులో కీలక పాత్ర వహించాడు. కేరళ కాంగ్రెస్ (ఎం) పార్టీకి ప్రధానంగా కేంద్ర కేరళలోని రైతులు మరియు క్రైస్తవ ఓటర్ల మద్దతు ఉంటుంది. 2019లో కెసి (ఎం) చీఫ్ కేఎం మణికి మరణించే వరకు థామస్ అత్యంత సన్నిహితుడు. పార్టీ అధ్యక్షుడు కేఎం మణి మరణానంతరం పార్టీలో ఏర్పడిన నిట్టనిలువు చీలికతో పీజే జోసెఫ్ వర్గంలో థామస్ చేశారు. కేరళ కాంగ్రెస్ జోసెఫ్ వర్గానికి డిప్యూటీ చైర్మన్‌గా కూడా ఆయన సేవలందించారు.

గత ఏడాది కాలంగా కేరళ కాంగ్రెస్‌ అంతర్గత వర్గ పోరుతో సతమతమవుతోంది. స్థానిక సంస్థ మరియు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యంగా జోసఫ్ వర్గం థామస్ వంటి అనుభవజ్ఞుడైన నేతను కోల్పోవడం ఆ పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఇక సీఎఫ్ థామస్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్,విపక్ష నేత రమేష్ చెన్నితాల సంతాపం తెలిపారు.