iDreamPost
iDreamPost
తాతయ్య అంటే నాన్న కంటే ఎక్కువ ప్రేమించేవాడా ?
నానమ్మ ప్రేమకు కొలమానాలు ఉంటాయా ?
ఈ సినిమా చూసేనాటికి ఇంత లోతైన ప్రశ్నలకు సమాధానం వెతికే వయసు కాదు నాది. వీడియో క్యాసెట్ ప్లేయర్ లో మొదటిసారి మా ఇంట్లో ఇది వేసిన రోజు అంత తెలిసీతెలియనితనంలోనూ తిట్టుకుంటూ చూడటం మొదలుపెట్టా. ఈ ఏజ్ బార్ పెద్దాయన సినిమా తప్ప ఇంకేది దొరకలేదా అని నాన్నకు ఎన్నిసార్లు శాపం పెట్టానో…..
ఆవును మరి. రాష్ట్రమంతా జగదేకవీరుడు అతిలోకసుందరి, శివ, బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్ లాంటి యూత్ హీరోల మాస్ ఫీవర్ తో ఊగిపోతుండగా బట్టతలతో, పల్లెటూరి పంచె కట్టులో వయసు మళ్ళిన నాగేశ్వర్ రావు గారిని బలవంతంగా చూడమనడం అంటే ముళ్ల కుర్చీ మీద కూర్చోబెట్టి వట్టిపోయిన అన్నంలోకి గొడ్డు కారం వేసుకుని తిన్న ఫీలింగ్…
కానీ అలా అనుకోవడం ఎంత పెద్ద తప్పో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అర్థం చేసుకునేంత పరిణితి లేకపోయినా నేనే స్వయంగా సీతారామయ్య గారి ఇంటికి వెళ్లిన ఫీలింగ్. అక్కడున్న వాళ్లంతా నా వాళ్లే అన్న భావన. సీత చిన్నప్పుడు పొరపాటున తప్పిపోయిన నా అక్కయ్యేమో అనే సందేహం. అంతగా పాత్రలు పసి మనసుల్లోకి సైతం చొచ్చుకుపోయేలా తీశారంటే క్రాంతి కుమార్ గారికి పరిశ్రమలో ఎందుకు అంత గౌరవం ఇస్తారో కొన్నేళ్ల తర్వాత తెలిసింది…..
సినిమా విజయం కమర్షియల్ సూత్రాలకు లోబడే ఉండాలన్న సిద్ధాంతాన్ని బాక్స్ ఆఫీస్ నడిరోడ్డు మీద నిలదీసి తప్పని నిరూపించిన సినిమా సీతారామయ్య గారి మనవరాలు. ప్రేమ పెళ్లి చేసుకుని వచ్చిన కొడుకును తండ్రి గెంటేస్తే అతను అమెరికా వెళ్లి స్థిరపడతాడు. కూతురు చేతికి వచ్చాక జరిగిన యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతూ తాతయ్య దగ్గరికి వెళ్ళమని సీతకు చివరి కోరిక చెప్పి అక్కడికి పంపిస్తాడు.కానీ బలహీనమైన ఆ ముసలి ప్రాణాలకు ఆ చేదు నిజం చెప్పలేక సీత అనుభవించే మానసిక క్షోభ ఎంతగా కలవరపెడుతుందంటే ఆఖరి అరగంట ఎంత బండరాతి హృదయమున్న ప్రేక్షకుడికైనా వెచ్చని తడి కనురెప్పను తడుముతుంది….
పంతానికి పోయి చేతికి వచ్చిన కొడుకును చేజేతులా దూరం చేసుకున్న తండ్రి..
భర్తకు ఎదురు చెప్పలేక కడుపు తీపిని చేదుగా మార్చుకుని దిగమింగుకున్న ఇల్లాలు….
కాటికి కాళ్ళు చాపుకున్న అవ్వాతాతలకు కఠిన నిజాన్ని చెప్పలేక వాళ్ళ ఆప్యాయతను వదులుకోలేక వయసుకు మించిన సంఘర్షణ ఎదురుకుంటున్న మనవరాలు….
ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే రెండున్నర గంటల ఎమోషన్ గురించి చాలా చెప్పాలనుంది. కానీ టైప్ చేస్తుండగానే మనసు మరోసారి సీతారామయ్య గారి ఊరికి వెళ్ళమని పురమాయిస్తోంది. అంటే మరోసారి సినిమా చూడమని. అందుకే ఆపేయ్యక తప్పడం లేదు….
అదేదో కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో రెండు వందలకు టోకెన్ తీసుకుని క్యూలో నిలబడితే కడుపు పగిలిపోయే వంటకాలతో మర్యాదలతో అదరగొడతారటగా. నాకింకా రుచి చూసే అవకాశం దక్కలేదు కానీ వెండితెరపై ఇలాంటి సుబ్బయ్యలకు బాబాయ్ లాంటి సీతారామయ్య గారిని చిన్నప్పుడే చూశా. ఇప్పటికీ అదే రాజసం అదే గర్వం ….
కీరవాణి స్వరాల్లోని గొప్పదనం కమ్మదనం
తేనెలో ముంచిన కలకండ లాంటి గణేష్ పాత్రో సంభాషణల ప్రవాహం
తెలుగువాడి సినిమా గుండె తడితే ఎలా ఉంటుందో చెప్పే ప్రతిరూపం
తెరమీద అనుబంధాలు మనసు తెరలను కమ్ముకుని ఇంటి దాకా వస్తాయని రుజువు చేసిన సజీవ సాక్ష్యం
అన్నీ ఈ సీతారామయ్య గారి మనవరాలే….
ఏఎన్ఆర్, మీనా, రోహిణి హట్టంగడి, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, సుధాకర్, మురళీమోహన్ ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రంతా జాగారం చేయాల్సి ఉంటుంది….
ఇప్పటికే ఓవరైంది…..ఉంటా మరి…అవతల రెండో ఆటకు టైం అయ్యింది…. సీతారామయ్య గారితో చెపక్ అంటూ చెస్ ఆడుకోవాలి….