ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఏపీ సీయం వైఎస్ జగన్ ప్రభుత్వం మధ్యనున్న అగాధం సామాన్యజనానికి కూడా అర్ధమైపోయింది. ఇందులో ఎవరి ప్రయోజనాలను వారు సమర్ధించుకుంటున్నప్పటికీ మెజార్టీ ప్రజలు నిమ్మగడ్డవైపే తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారన్నది పలువురి అభిప్రాయం. మెట్లు ఎక్కడంతో పాటు, ప్రతిపక్ష పార్టీల నాయకులతో హోటళ్ళలో సమావేశాలు నిర్వహించడం వరకు ప్రతి దశలోనూ నిమ్మగడ్డపై అనుమానాలు పెంచే విధంగానే వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం.
సాధారణంగా బ్యూరో క్రాట్లు తాము పనిచేసే ప్రభుత్వం తమపై ఏ మాత్రం అంసతృప్తిగా ఉన్నా వేరే చోట పనిచేయడానికి వెళ్ళిపోవడం సహజంగా జరుగుతుంటుంది. ఇక్కడ వారి హక్కులకు భంగం అన్న ప్రశ్నే విన్పించదు. తమనితాము కాపాడుకోవడంతో పాటు, ఆయా ప్రభుత్వాలకు దొరక్కుండా ఉన్నతస్థాయి ఉద్యోగులు సహజంగానే ఈ పద్దతిని అనుసరించడానికి మొగ్గు చూపుతుంటారు.
అయితే నిమ్మగడ్డ మాత్రం జగన్ ప్రభుత్వం తమపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేదన్నది తెలిసినప్పటికీ ఏపీ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఇందుకోసం కోర్టుల ద్వారా కూడా తీవ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు తాను అనుకున్నట్లుగా పదవిలోకొచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రతి దశను గురించి అధికార పక్షం నిమ్మగడ్డపై అనేకానేక ఆరోపణలు చేస్తూనే ఉంది. అందుకు తగ్గ సాక్ష్యాలను ప్రజలముందుకు తెచ్చే ప్రయత్నాలు కూడా చేసింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడైన ప్రతిపక్ష నేత అండదండలతోనే నిమ్మగడ్డ ఈ వ్యవహారం అంతా నడిపారన్నది అధికార పక్షం చేస్తున్న ప్రధాన ఆరోపణ.
వీటిని గురించి ఏనాడూ ప్రత్యక్షంగా సదరు ప్రతిపక్ష నేతగానీ, నిమ్మగడ్డ గానీ తన వివరణను ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలొ జనం కూడా తమ అభిప్రాయానికి తాము వచ్చేసారు. అయితే ఇప్పుడు కుర్చీలో కొచ్చాక మరోమారు కోర్టుకెక్కడం ద్వారా నిమ్మగడ్డ చర్చనీయాంశంగా మారారు. తన పరిధులకు లోబడి విధులు నిర్వర్తించుకుంటే రాజ్యాంగ బద్దంగా తనకు లభించిన హక్కులను, బాధ్యతలను పూర్తిస్థాయిలో అనుసరిస్తూ తనపని తాను చేసుకోవచ్చు. కానీ అందుకు విరుద్దంగా కోర్టు ద్వారానే తన పనులు చక్కబెట్టుకుందామన్న ధోరణిని ప్రదర్శించడం ప్రజల్లో పలు సందేహాలకు కారణమవుతోంది.
తన హక్కులకు సంబంధించి ఏ విధమైన భంగం వాటిల్లినప్పటికీ న్యాయపరంగా పోరాడడాన్ని ఎవ్వరూ కాదనరు. అయితే ప్రభుత్వం వద్దంటున్నప్పటికీ ఇక్కడే ఉంటానంటూ వచ్చిన నేపథ్యంలో చేసే ప్రతి పనిని అధికార పక్షంతో పాటు, ప్రజలు కూడా నిశితంగా గమనిస్తుంటారు. ఇక్కడ ఏ మాత్రం అటూ ఇటూ అయినా నిందలు మోయాల్సి రావొచ్చు. ప్రస్తుతం ఆయన కోర్టుకెక్కింది కూడా.. తాను రాసినట్లుగా చెబుతున్న లేఖపై అధికార పక్షం పలు అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో దానిపై దర్యాప్తులో భాగంగా కార్యాలయంలోని పలు వస్తువులను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని అప్పగించాలంటూ కోర్టుకు నిమ్మగడ్డ అభ్యర్ధించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య భవిష్యత్తులో ఎన్ని వివాదాలు తలెత్తునున్నాయో? వాటిలో ఎవరిది న్యాయం? ఎవరిది పక్షపాతగా తేలుతుందో వేచి చూడాల్సిందే.