iDreamPost
android-app
ios-app

రేపటి నుంచి స్కూల్‌ అడ్మిషన్లు

రేపటి నుంచి స్కూల్‌ అడ్మిషన్లు

కరోనా కారణంగా మూగబోయిన బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ సర్కారు 2020–21 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేసింది. దాంతో సోమవారం నుంచే పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని భావిస్తుండగా, ప్రవేశాలకు సెప్టెంబరు 4 వరకు అవకాశం కల్పించారు.

పాఠశాల విద్యా కమిషనర్‌ విడుదల చేసిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ ప్రకారం అడ్మిషన్ల కోసం కేవలం తల్లిదండ్రులు మాత్రమే స్కూల్స్‌ వెళ్తే సరిపోతుంది. ప్రతి ఉపాధ్యాయుడు వారానికోసారి పాఠశాలకు రావాల్సి ఉంటుంది.

కీ పాయింట్స్‌

ఉపాధ్యాయుడు తరగతి గదికి సంబంధించి విద్యార్థి కేంద్రంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. అలాగే పాఠ్యాంశాల బోధన ఆన్‌లైన్‌లోనూ చేపట్టవచ్చు. కానీ సదరు బోధన ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌లో సూచించిన పాఠ్యప్రణాళికకు పరిమితమై ఉండాలి. ఆన్‌లైన్‌ టీచింగ్‌కు సంబంధించి ఉపాధ్యాయులు విద్యార్థులను ఆన్‌లైన్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారు(హైటెక్‌), రేడియో లేదా దూరదర్శన్‌ అందుబాటులో ఉన్న వారు(లోటెక్‌), కంప్యూటర్‌ గానీ మొబైల్‌ గానీ, రేడియో గానీ అందుబాటులో లేని వారు(నోటెక్‌)గా విభజించుకోవాలి. ఎలాంటి సమాచార, ప్రసార, కంప్యూటర్‌ సాధనాలు అందుబాటులో లేని విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి.

సమయ ప్రణాళిక

1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా 12 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లోని కృత్యాలు చేయించాలి. 6 నుంచి 8వ తరగతుల వారు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా 4 వారాల క్యాలెండర్‌లోని ప్రాజెక్టులను చేయించాలి. 9, 10 తరగతులకు విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఆన్‌లైన్, రేడియోల ద్వారా టీచింగ్‌ కొనసాగించవచ్చు. ఈ దిశగా స్థానికంగా విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవచ్చు.

రావాల్సిన అవసరం లేదు…

దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో నివసిస్తున్న, శారీరక వైకల్యం కలిగిన, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో పాఠశాలలు ఉన్న ఉపాధ్యాయులు స్కూల్స్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదు. కానీ తరగతి, విద్యార్థి వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు చేస్తూ ప్రణాళికలు రచించుకోవాలి. కనీసం రోజుకు 15 మంది పిల్లల తల్లిదండ్రు’లతో మాట్లాడాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతిని కనుక్కోవాలి. టీచర్లు రోజు వారీ పనిని డైరీలో నమోదు చేసి ప్రతి శనివారం ఫొటో రూపంలో గూగుల్‌ ఫారంలో అప్‌లోడ్‌ చేయాలి. ఆ వివరాలను సంబంధిత ఎమ్మార్వో, డిప్యూటీ ఈవో ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు.