iDreamPost
android-app
ios-app

దాయాదుల క్రికెట్ పోరుకు సిద్ధంకండి!

దాయాదుల క్రికెట్ పోరుకు సిద్ధంకండి!

అక్టోబర్ 24… ఈ తేదీని కచ్చితంగా క్రికెట్ ప్రేమికులు గుర్తించుకోవాలి. దాయాది దేశాల గా పేరున్న ఇండియా పాకిస్తాన్ మధ్య రెండు సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్ కు ముహూర్తం అదే. రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు ఓ పండగే. పాకిస్తాన్ పై గెలిస్తే వరల్డ్ కప్ గెలిచినంత ఆనందం భారత్ క్రికెట్ అభిమానులది.

2021 సంవత్సరం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. 2020 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ ప్రభావం వల్ల ఐసీసీ అప్పట్లో వరల్డ్ కప్ ను వాయిదా వేసింది. 2021 లో ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. 2022 వరల్డ్ కప్ అవకాశాన్ని ఆస్ట్రేలియాకి ఇచ్చింది. అయితే కోవిడ్ ప్రభావం ఏ మాత్రం తగ్గకపోవడంతో ఈ ఏడాది జూలైలో భారతదేశంలో టీ20 వరల్డ్ కప్ జరపడం సాధ్యం కాదు అని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో వేదికను మార్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వరల్డ్ కప్ ను తీసుకు వెళ్ళింది.

అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న ప్రపంచ కప్ లో మొత్తం 16 దేశాలు పాల్గొంటాయి. 45 మ్యాచ్లు జరగనున్నాయి. స్కాట్లాండ్, నెదర్లాండ్, అరబ్ ఎమిరేట్స్ తోపాటు చిన్న చిన్న దేశాలన్నీ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో తోనే సరిపెట్టుకుంటాయి. చిన్న దేశాలకు 12 మ్యాచ్ నిర్వహించే మొదటి రౌండ్ లో ఈసారి శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. అనంతరం సూపర్ ట్వల్వ్ విభాగంలో రసవత్తర పోటీ కు తెరలేవనుంది. గ్రూప్ బిలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నాయి.

గ్రూప్ బి మొదటి మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ తో తలపడనుంది. గ్రూప్స్ లో మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు నాకౌట్ పోటీలకు వెళ్తాయి. దీంతో ప్రతీ మ్యాచ్ విజయం కీలకం కానుంది. అరబ్ ఎమిరేట్స్ పిచ్ లు భిన్నంగా స్పందిస్తాయి. దీంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉండబోతోంది ఫలితం ఎలా ఉంటుంది అన్న విశ్లేషణ కష్టతరమే కావచ్చు. ప్రస్తుతం జట్టు బలాలుగా చూస్తే ఇండియాకు మంచి బలమైన జట్టు ఉండటం కలిసి వచ్చే అంశం. ఒకవేళ ఒక క్రికెటర్ గాయపడిన బలమైన స్టాండ్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతోపాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు ఐపీఎల్ వుంటుంది. ఐపీఎల్ సైతం యూఏఈ పిచ్ ల మీదనే ఉంటుంది. ఇది భారత్ కు కలిసి వచ్చే అంశం. అందులోనూ ఐపీఎల్ ఫామ్ లో ఉండే ఆటగాళ్లు వెంటనే ఆ మూడ్ నుంచి బయటకు రాకుండా అదే ఊపు తో ప్రపంచ కప్ బరిలోకి దిగడం వల్ల ఖచ్చితంగా ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు అంత బలంగా ఏమీ లేదు. కొత్త కుర్రాళ్ళు బాబర్, బట్, అలీ వంటి కొత్త కుర్రాళ్ళు మీదనే మొత్తం భారం నడుస్తోంది. ఇక బౌలింగ్ పరంగానూ అద్భుతమైన ప్రదర్శన చేసే ఫాస్ట్ బౌలర్లు పాకిస్తానుకు కరువవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పాకిస్తాన్ చేసిన కొన్ని చెత్త ప్రదర్శనలు కూడా ఆ జట్టు బలహీనతలను బయటపెట్టాయి.

అక్టోబర్ 24న జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో కచ్చితంగా ఇండియా ఫేవరెట్గా బరిలోకి ఉంటుంది. అయితే టీ20 మ్యాచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది చెప్పడం సాధ్యం కాదు. మ్యాచ్ ఫలితం అప్పటికప్పుడే మారిపోవచ్చు. ఐతే వరల్డ్ కప్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద మంచి రికార్డు ఉన్న భారత దేశం ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లోనే భారత అభిమానులకు గొప్ప బహుమతి ఇస్తుందని క్రీడా ప్రేమికులు ఆశిస్తున్నారు.