ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై విచారణ జరిగింది. కాగా ఈ పిటిషన్లపై విచారణ జరపాల్సిన జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ విచారణ ధర్మాసనం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఒకప్పుడు న్యాయవాదిగా ఓ కేసులో జగన్మోహన్ రెడ్డి తరఫున తాను వాదించానని కాబట్టి, ఇప్పుడీ కేసును తాను విచారించడం సముచితం కాదని ఆయన విచారణ నుండి తప్పుకొన్నారు. విచారణను మరో ధర్మాసనానికి సీజే బదిలీ చేస్తారని యు.యు.లలిత్ తెలిపారు.
కాగా జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా పలు ఆధారాలను చూపిస్తూ సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డేకు లేఖ రాసి దాన్ని మీడియాలో బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ యాదవ్, సునీల్ కుమార్ సింగ్‌లు తగిన ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రజల ముందు, మీడియా ముందు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్ వీ రణమపై ఆరోపణలు చేశారని వ్యాజ్యం దాఖలు చేశారు.
జగన్మోహన్ రెడ్డిపై మనీలాండరింగ్, అవినీతి కేసులు సహా వివిధ కేసులు విచారణలో ఉన్నాయని, ఆయనపై తగిన చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా విచారణ ధర్మాసనం నుండి జస్టిస్ యూ.యు. లలిత్ తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.