Idream media
Idream media
అయోధ్య తీర్పును స్వాగతిస్తున్నామని, సవాలు చేయబోమని సున్నీ వక్ఫ్ బోర్డు సహా పలు ముస్లిం సంస్థలు స్పష్టం చేయగా… తీర్పుపై సమీక్ష కోరే విషయాన్ని పరిశీలిస్తున్నామని అఖిల భారత ముస్లిం లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తెలిపింది. క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసే యోచన లేదని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ ప్రకటించారు. ప్రముఖ ముస్లిం సంస్థ జమీయత్ ఉలేమా-ఏ-హింద్ కూడా సమీక్ష కోరబోమని తేల్చిచెప్పింది. సుప్రీం తీర్పు తమ అంచనాలకు విరుద్ధంగా ఉన్నా ఈ వ్యవహారానికి ఇంతటితో ముగింపు పలకాలని భావిస్తున్నట్లు తెలిపింది.
ఈ తీర్పుతో ముస్లింలు నిరుత్సాహానికి గురి కావొద్దని జమీయత్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ పిలుపునిచ్చారు. కోర్టు తీర్పును గెలుపు ఓటముల కింద తీసుకోవద్దని కోరారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అంతిమమని పేర్నొన్నారు. ‘‘సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్న వివాదం ఎట్టకేలకు పరిష్కారం కావడం సంతోషంగా ఉంది. కోర్టు తీర్పును సవాలు చేయబోం’’ అని పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్ అన్సారీ చెప్పారు. కోర్టు ఏది చెబితే అదే సరైనదన్నది తన నమ్మకమని అన్నారు. మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని ఎక్కడ కేటాయించాలన్నది ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఇది ముస్లింలు సాధించిన విజయమని ఆయన అభివర్ణించారు.
ఉత్తరప్రదేశ్ షియా బోర్డ్ కూడా కోర్టు తీర్పును స్వాగతించింది. అయోధ్య అంశం ముగింపునకు వచ్చిందని, మరింత సాగదీయకూడదని జామా మసీద్ షాహి ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ అన్నారు. దేశంలో ముస్లింలు శాంతిని కోరుకుంటున్నారని, సుప్రీం తీర్పు ఏదైనా తాము కట్టుబడి ఉంటామని ముందునుంచే చెబుతున్నామని అన్నారు.
తమ 67 ఎకరాలు భూమి తీసుకుని 5 ఎకరాలు ఇస్తున్నారని, ఇదేం న్యాయమని ఏఐఎంపీఎల్‌బీ సభ్యుడు కమల్ ఫరూఖీ ప్రశ్నించారు. 100 ఎకరాలు ఇచ్చినా ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. తీర్పులోని కొన్ని అంశాలు అసంతృప్తికి గురిచేశాయని, గౌరవప్రదంగానే వాటిని విభేదిస్తామని ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ తెలిపారు. చారిత్రక ఆధారాలు తమ పక్షాన ఉన్నా తీర్పు వ్యతిరేకంగా రావడం నిరుత్సాహం కలిగించిందని సుప్రీం కోర్టు న్యాయవాది షకీల్ అహ్మద్ సయ్యద్ వ్యాఖ్యానించారు.