iDreamPost
android-app
ios-app

ఈ ఏడాది శశికళ జైలు విడుదల లేనట్లే..

ఈ ఏడాది శశికళ జైలు విడుదల లేనట్లే..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత మూడున్నర ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈ ఏడాది విడుదల కానున్నారన్న వార్తలు తమిళనాట షికారు చేసాయి. కాగా ఈ ఏడాది శశికళ విడుదలయ్యే అవకాశం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలు రుజువు కావడంతో నాలుగేళ్ళ జైలుశిక్షతో పాటు 10 కోట్ల జరిమానాతో విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ ఎప్పుడు విడుదలవ్వబోతున్నారు అన్న చర్చ తమిళనాట ఊపందుకుంది. దీంతో సమాచార హక్కు చట్టం కింద బెంగళూరుకు చెందిన టీ నరశింహమూర్తి అనే సామాజిక కార్యకర్త శశికళ విడుదల విషయంపై కర్ణాటక జైళ్లశాఖకు ఉత్తరం రాశారు. జైళ్ల శాఖ అధికారులు స్పందిస్తూ వచ్చే ఏడాది జనవరి 27వ తేదీన శశికళ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉందని బదులిచ్చారు.

కాగా సత్ప్రవర్తన మరియు సెలవు దినాలు పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది చివరలో శశికళ జైలు నుండి విడుదల కానున్నారన్న వాదన మరోసారి ఊపందుకుంది. దీంతో మరోసారి టీ నరశింహమూర్తి జైళ్ల శాఖ అధికారులకు శశికళ విడుదల గురించి ఉత్తరం రాసారు. ఈ ఏడాది శశికళ విడుదల అవ్వడానికి అవకాశం లేదని సెలవు దినాలు జీవితఖైదు పడిన ఖైదీలకు మాత్రమే వర్తిస్తాయని వచ్చే ఏడాది జనవరి 27 న శశికళ విడుదల అవుతుందని జైలుశాఖ అధికారులు స్పష్టం చేయడంతో శశికళ ఈ ఏడాది విడుదల అవుతున్నారన్న వార్తలన్నీ అసత్యాలే అని తేలిపోయింది. కాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో శశికళ విడుదల ప్రాధాన్యత సంతరించుకునే విషయంగా మారిపోయింది.