శశికళ తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్. సుమారు నాలుగేళ్ల పాటు జైల్లో ఉండి… 10 కోట్ల జరిమానా కోర్టుకు చెల్లించి ఏడాది ముందే జైలు నుంచి విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఎటువైపు వెళ్తారు? ఆమె పయనం? ఆమె వ్యూహం? మీద అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మే నెలలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. దీంతో ఇటు అధికార అన్నాడీఎంకే తో పాటు ప్రతిపక్ష డిఎంకె సైతం శశికళ నిర్ణయం మీద ఆమె అడుగుల మీద నిశితంగా పరిశీలిస్తోంది. అయితే జైలులో ఉన్న సమయంలోనే అనారోగ్యం పాలై… వెంటిలేటర్ చికిత్స వరకు వెళ్లిన శశికళ ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. అయితే శశికళ తీసుకోబోయే నిర్ణయాలు చాలా రహస్యంగా ఉంటాయని అవి బయటకు వచ్చిన సమయానికి కాగల కార్యం పూర్తవుతుందని, రాజకీయంగా ఆమె వేసే అడుగులు చాలా కీలకం అవుతాయని రాజకీయ విశ్లేషకుల మాట.
ఎం చేయబోతున్నారు?
అన్నాడీఎంకే శశికళ సొంత పార్టీ గా భావించాలి. జయలలిత మృతి తర్వాత ఆమె ముఖ్యమంత్రి పీఠానికి ఆమె పోటీ పడిన సమయంలో అన్నాడీఎంకే కీలక నేతలైన పన్నీర్ సెల్వం దానిని పూర్తిగా వ్యతిరేకించారు. శశికళ ఎలా పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారు అని… తిరుగుబావుటా ఎగురవేశారు. అప్పటికే అన్నాడీఎంకే లెజిస్లేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన శశికళ… ఆ తర్వాత ఆ కేసులో ఇరుక్కోవడం జైలుకు వెళ్లడం వెంట వెంటనే జరిగిపోయాయి. పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కరు. ఆ తర్వాత కేంద్రంలోని కొందరు బిజెపి పెద్దలు వ్యూహం ప్రకారం పన్నీర్ సెల్వం గద్దె దిగి… పలని స్వామి కి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పార్టీలో పన్నీర్ సెల్వం పళనిస్వామి కీలకామయ్యారు. పార్టీ వ్యవహారాలు అన్నీ పన్నీర్ సెల్వం కనుసన్నల్లో జరిగితే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పళని స్వామి చూసుకునేవారు. దీంతో అన్నాడీఎంకే మొత్తం పన్నీర్ పళ్లని వర్గాలుగా ఉంది. అన్నాడీఎంకే లెజిస్లేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన తర్వాత పార్టీ నుంచి అవమానకర స్థితిలో జైలుపాలైన శశికళ మళ్లీ అన్నాడీఎంకే వైపు చూస్తారు అనడం సహెతూకం కాదు. ఆమె మళ్లీ పన్నీర్, పళని స్వామి తో జట్టు కట్టడం అసంభవం. అయితే బీజేపీ పెద్దలు శశికళ తో మాట్లాడి అన్నాడిఎంకెకు అనుబంధంగా పని చేయించి ఎన్నికల వరకు శశికళను ఉపయోగించుకునే సంధి చేయవచ్చు.
దినకరన్ పార్టీ బలోపేతం!
శశికళకు మొదటి నుంచి పూర్తి గా మద్దతు ఇస్తున్న వ్యక్తి దినకరన్. శశికళ నమ్ముకొని పార్టీని సైతం ఆయన ప్రారంభించారు. ఏఎంఎంకే ప్రెసిడెంట్గా శశికళ కొనసాగుతుంటే దినకరన్ మొత్తం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శశికళ జైలులో ఉన్నప్పుడు దినకరన్ బయట ఉండి ఎన్నో ఇబ్బందులను సైతం ఎదుర్కొన్నా పార్టీ మాత్రం వీడలేదు. దాన్ని బలోపేతం కోసం అన్నాడీఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో సైతం బేరసారాలు సాగించాన అవి ఫలవంతం కాలేదు. ఇప్పుడు శశికళ బయటకు రావడంతో పార్టీని పూర్తిగా బలోపేతం చేసి అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి శశికళ పార్టీలో చేరితే… పార్టీని బలోపేతం చేసే దిశగా శశికళ తీసుకునే చర్యలు అన్నది రెండోసారి.
పొత్తు పెట్టుకుంటారా?
ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేని శశికళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి ఎలా ముందుండి నడిపిస్తున్నారు అన్నది ప్రధాన ప్రశ్న. జయలలిత అత్యంత ఆప్తురాలిగా శశికళకు తమిళనాడులో పేరుంది. దీంతోపాటు కావాలనే ఆమెను జైలుకు పంపారని సానుభూతి ఇప్పుడు ఎన్నికల్లో పనికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే తప్పనిసరిగా ప్రచారం లో పాల్గొనాలి. అయితే మొత్తం అన్ని స్థానాల్లో శశికళ పార్టీ నిలబడే పరిస్థితి లేదు. అందులోనూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమయం తక్కువ ఉన్న సమయంలో తాను ప్రాతినిధ్యం గతంలో వహించిన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నారా లేదా అన్నది తేలాలి. దీనికి బిజెపి మధ్యవర్తిత్వం వహిస్తుందా లేక ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది కీలకం. ఏది ఏమైనా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. మరి దీనిని ఏ పార్టీ ఏ విధంగా ఎలా ఉపయోగించుకుంటుంది ఎలా ఓట్లను రాబడుతుంది అన్నది త్వరలోనే తెలుస్తుంది.