iDreamPost
iDreamPost
నిన్న చిన్న ప్లస్ మీడియం బడ్జెట్ సినిమాల మధ్య జరిగిన మినీ యుద్ధంలో అంచనాల పరంగా చావు కబురు చల్లగా కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకున్నప్పటికీ ఒక్క పాటతో యూట్యూబ్ లో వైరల్ పాపులారిటీ తెచ్చుకున్న శశి మీద కూడా యూత్ లో ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. కెరీర్ మొత్తం మీద ఒకటి రెండు తప్ప అసలు హిట్టే లేని ఆది సాయికుమార్ హీరో అయినప్పటికీ ఆ సాంగ్ పుణ్యమాని శశి మీద ఆసక్తి చూపించిన వాళ్ళు లేకపోలేదు. ఓపెనింగ్స్ నిరాశ పరిచే విధంగా ఉన్నాయి కానీ మౌత్ టాక్ ఏదైనా పాజిటివ్ గా వస్తే కలెక్షన్లు వస్తాయనే నమ్మకం టీమ్ లో ఉంది. మరి ఇదెలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూద్దాం.
ఒకే కాలేజీలో చదివే ఇద్దరు ప్రాణస్నేహితుల్లో ఒకడు ఓ యాక్సిడెంట్ లో చనిపోతే బ్రతికిన ఆ రెండో వాడే మన హీరో రాజు(ఆది). ఇతనికి దీనికన్నా ముందే శశి(సురభి)తో లవ్ స్టోరీ ఉంటుంది. అయితే ప్రమాదం జరగ్గానే మాయమైపోయిన రాజుకి తిరిగి వచ్చాక శశి ఊరు వదిలి వెళ్ళిపోయిన నిజం తెలుస్తుంది. ఆమె కోసం పిచ్చివాడై ఎదురు చూస్తున్న తరుణంలో మళ్ళీ వచ్చిన శశి తీరా రాజుని చూసి గుర్తుపట్టన్నట్టు ప్రవర్తిస్తుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, శశిని రాజు చివరికి గెలుచుకున్నాడా లేదా అనేది తెరమీదే చూడాలి. లవ్ కం ఫ్రెండ్ షిప్ ని రెండు మిక్స్ చేసి రాసుకున్న కథ ఇది.
దర్శకుడు శ్రీనివాస్ నాయుడు తీసుకున్న పాయింట్ లో ఎలాంటి కొత్తదనం లేదు. పోనీ దాన్ని పక్కనపెడితే ట్రీట్మెంట్ పరంగా అయినా ఏదైనా ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారా అంటే అదీ లేదు. అర్జున్ రెడ్డి తరహా క్యారెక్టరైజేషన్ ని ఆది మీద రుద్దాలనుకున్నారు కానీ అది కాస్తా కథనంలోని లోపం వల్ల పూర్తిగా తేలిపోయింది. కామెడీ, నెరేషన్ ఒకటా రెండా అన్ని విభాగాలు శశిని ఓ బోరింగ్ ప్రోడక్ట్ గా మార్చేందుకు శాయశక్తులా కృషి చేశాయి. ఒక్క సంగీతం మాత్రమే కొంత ఊరటనిచ్చింది కానీ దాని బలం కొండంత బలహీనతలను కాపాడలేకపోయింది. ఫలితంగా శశి ప్రేక్షకుల మీద కసి తీర్చుకోవడం తప్ప ఏమీ జరగలేదు