iDreamPost
android-app
ios-app

రండ్రండి…

రండ్రండి…

బండెక్కడ లేటైపోద్దోనని తెక్కంగారడిపోయాను. రోజూలా కాకండా టయానికే తీసుకొచ్సేడులెండి.. మీరంతా పెద్దపండక్కి ఖచ్చితంగా మాఊరికి రావాల్సిందేనని మావోడికెప్పుడో జెప్పి రిజరేషన్ జేయించడం మంచిదయింది. లేపోతే బస్సు టికెట్టు రెండేలంట ఈ నాల్రోజులూనీ…

మరి పండగ టయింలో గోదారిజిల్లాల వైపొచ్చే బళ్ళకి, బస్సులకి క్రేజలాంటిది కదండీ మరి… అసలు ఆ లెవలు క్రేజెందుకో నింపాదిగా జెప్తాను గానండీ ముందు ఇంటికెళ్ళిపోదాం బండెక్కండి!!

అదిగో అటేపు చూసేరా.. పచ్చని పొలాల మీద పొగమంచు జూత్తంటే ఏ పనికిరాదనిపిస్తంది కదండీ ఆ అందం ముందు.. సినిమావోళ్ళు పత్యేకించి ఈ సీజన్లో పాటలు కూడా తీత్తారు ఇక్కడకొచ్చి తెలుసా?? పచ్చని పొలాలకి పొగ స్ప్రే చేసినట్టుండే అందం అంతా ఇంతా కాదు కదండి మరి.. సగం కడుపు అక్కడే నిండిపోద్ది..

మొకాలయ్యీ కడిగేసుకోండి.. పొద్దున్న తీయించిన గేదిపాల్లో బెల్లం కలిపిన టీ తో మొదలెడదారి మన పండగ పప్పల్ని…

ముందసలు మనకీ పండగెలా వచ్చిందో చెప్పాల కదా అంటారా?? స్సరే అలాక్కానీయండి..

సంక్రాంత్రంటే సూరీడూ, మకరం, సంక్రమణం, ధనుర్మాసం, సొర్గ దోరాలు.. ఇవన్నీ అంటారు కానీండి.. అసలివన్నీ కాకుండా.. ఇంకోటుందండీ అసలు రీజను.. అదేంటంటే మన పంట చేతికి రావడమన్నమాట! ఆరుగాలం ఒళ్ళదీ నలక్కొట్టేసుక్కుని ఏడాదంతా పడ్డ కష్టానికి పంటంతా చేతికొచ్చి, వరి రూపంలో ఇంటికి లచ్మీ దేవిలా నడిచొస్తాదన్న మాట మనం పడ్డ కష్టం..

ఏడాది పడ్డ కాయకష్టమంతా మన కళ్ళ ముందే మనకన్నా ఎత్తుగా పంటగా మారి మనింటికొస్తే అది పండగ్గాక ఇంకేంటండే??!

ఇయ్యాల్టికి జార్తగా.. రాయిమండ్రెళ్ళి రెడీమేడు బట్టలు కొనేసుకోండి. ఇప్పుడుకిప్పుడు గుడ్డ తీసి ఆది కి కొల్తలిచ్చినా కుట్టడానికి ఏ టైలరూ కాలీగా ఉండడు, ఇప్పుడాళ్ళు గవర్నరు కన్నా బిజీ కదా? పండక్కొచ్చే కొత్త బొమ్మలేఁవైనా జూత్తారేటి? మా అబ్బుగారి హాల్లో టికెట్లు జెప్పేద్దాం. కొత్త బొమ్మంటే గేపకమొచ్చింది… అల్లుడి గారికి, ఆడపిల్లలకి, మనవళ్ళూ మనవరాలకి కొత్తబట్టలెట్టాలి కదా.. నేనాపని ఎవరికైనా అప్పజెప్పొత్తానుండండి. రేప్పొద్దున్నుంచీ మాత్రం.. మూడ్రోజులూ మొత్తం ఊళ్ళన్నీ తిప్పేసే పూచీ నాదీ.. సరేనా?? రాత్రికి మట్టుకి ఓసారి బయటకెళ్ళొద్దాఁవండీ.. అంటే యేంలేదు, రేపు భోగి కదండీ.. పొద్దున్నే బోగిమంటెయ్యడానికి పుల్లల అడితీలు దగ్గిరకెళ్ళి కొన్ని దుంగలని మోపు చేయాలి. కొంటే బానే ఉంటాదనుకోండి. కానీ యిలా సీకటి దెబ్బేసి ఎత్తుకొచ్చేత్తేనే కదా పండగ కిక్కు మనకి.. దుంగలు మాత్రం బా ఆరిపోయుండాలండోయ్. పచ్చియ్యైతే ఎలుగుతాయేంటీ.. ఆటినెలిగించడానికే సరిపోద్ది టయివంతా..

తెల్లారగట్ట నాలుక్కి బానే లేసారందరూనూ.. ఇప్పుడేసేద్దారి మంట.. కింద, కింద సూసుకోండి. మామూల్రోజుల్లో ఉత్తి ముగ్గులే ఉంటయ్యిగానీ ఇప్పుడాటి మీద గొబ్బెమ్మలుంటాయి.. సూస్కోకుండా అడుగేసేమనుకోండి.. కాళ్లకంటుంకుందైతే కడుక్కొచ్చేమో గానీ ఈ ఆడ లేడీసుకొచ్చే కోపాన్ని ఎల్లగొట్టలేం కదండీ ఆయ్..

సందలడ్డమే లేటు, పేడ కలిపిన నీళ్ళతో కళ్ళాపేసి మరీ పోటీగా పెట్టుకుంటారు ముగ్గుల్ని.. అంచేతాటితో చాలా జాగర్తతో ఉండాలి మనం..

అబ్బే.. ఆగండాగండి అలా ఎలా పడితే అలా బోగి మంట అంటించేకూడందండీ బాబా.. దీనకంటూ ఓ యిదానం ఉంది. కుర్రోళ్ళంటే.. ఓ… అని ప్యాసనుకొద్దీ ఇష్టఁవొచ్చినట్టు చేసేత్తన్నారు కానీ, ముందా దుంగలకి పసుపు కుంకుం రాయండి. కొబ్బరికాయి కొట్టి మొదలెట్టాలి. భోగిమంటెయ్యడానికి పెట్రోలు కిరసనాయిలు వాడకూడదసలు.. మనం జేసేది పూజ కదా.. అందుకే ముద్దాత్కపురంతో మంటెలిగించాలి. ఆ తర్వాత చిత్రీ పొట్టు తెప్పించేసుంచేను గాబట్టి కొద్ది కొద్దిగా మంటమీదెయ్యండి.. కాసేపయ్యాక.. అయ్యే అంటుకుపోతాయి…

బా తెల్లారాక పిల్లలందరూ భోగిపిడక దండలతో వత్తారు కానీ.. ఈ లోపు మీరు మంట చుట్టూ కుర్చుని చలి కాచుకోండి.. సీవండి తెపాలాతో నీళ్ళు కూడా కాగబెట్టుకోండి.. స్నానాలయ్యీ చెయ్యినోళ్ళకి పనికొస్తాయి..

ఇంకాసేపు ఇక్కడే కుర్చోండి. హరిదాసొత్తాడు.. తలా కొంత బియ్యం ఆయనకేద్దురుగానీ. ఏడాదంతా ఎక్కడుంటారో తెల్దుగానీ.. సంక్రాంతి రోజుల్లోనే పొద్దున్నే కనపడతారు “హరిలో రంగ హరి” అని. మాటలు అయ్యీ కలిపేరు కనక, ఆళ్ళెవరితోటి మాట్లాడకూడదు. అదిగో.. బోగిమంటలో బాగా వెలిగి ఆరిపోయిన ఒక పిడకని చిదిమి ఇబూతి బొట్టెట్టుకోండి. పండగంటే సంప్రదాయం కదా మరిక్కడా!

పొలం గట్లమ్మెట నుంచుని గాలిపటాలెగరేత్తేరేటి పోనీ? బొడ్డు సూత్రం సరిగా పొడిసి గాలిపటాలు తయారుచేయడంలో మా బుజ్జిగాడంత మొనగాడు ఈ చుట్టుపక్కల ఊరిలోనే లేడు. ఇక్కడొదిలితే అంతరిక్సంలోకెళ్ళి ఆగాల.. ఇంట్లో కావలసినంత దారం కండి కూడా ఉంది. పండగపూట గాలిపటాలు ఎగరెయ్యాపోతే ఎలాగ?

మీరా సిటీ బట్టలు ఇక్కడేసుకుని తిరక్కండి నా మాటినండి..!! పుసుక్కున పెద్దోళ్ళెవరైనా చూస్తే సంక్రాంతి పగటేసగాల్లు అనుకుంటారు. మళ్ళీ మాటొచ్చేద్ది మీ దగ్గిర.

“అనబత్తులోరీ సునీతమ్మా..
బాగా బాగా సదవాలండీ..
సదువుల్లోనూ ప్యాసవ్వాల..
వో బుజ్జా కత్తుల సునీతమ్మా..
ఈవిడ బాగా సదుంకునీ బాగా పాసయ్యీ..
డాట్రమ్మగారి ఉద్యోగం రావాల.. బాగా సదివి సంపారిచ్చి..
అత్తోరింటికెలినపుడు డైవండు నెక్లీసు, మెళ్ళో బంగారపు సైన్లు సెవులకి మ్యాటీలు..ఏసుకుని బెంజికార్లో అత్తోరింటికెళ్ళాల..” అని దీవిత్తున్నారే.. ఆళ్ళే గంగిరెద్దోళ్ళు.. పది రూపాయలిత్తే అంతేనండీ.. ఎంతో ఆనందంగా దీవించెళ్లే వీళ్ళు ఈ పండగ నెల్లాళ్ళు మటుకే కనపడతారు.. కనుమరోజొచ్చి మాత్రం పాత బట్టలు, బియ్యం, పండగ పప్పలు పట్టుకెళ్తారు..

పదండి పదండి. రేగుపళ్ళు, చెరుకు ముక్కలు కొట్టించాల. మా చంటోడికీ భోగిపళ్ళెయ్యాలి కదా మరి. అదయ్యాక కొన్ని సున్నుండలూ జంతికలు తినేసి పెతూరి గవర్మెంటు స్కూళ్ళోనో ఇంకోచోటో పండగ సంబరాలు చేత్తన్నారీ మద్య అయి చూసేసొద్దాం.

రెండ్రోజులైనా ఏఁవీ సరిగా తింటాలేదు మీరు, ఇంకొన్ని అరిసెలు, పాకుండలు తింటారేటీ? అబ్బే.. ఈ మాత్రం నాలుగు సల్ల గుత్తులు‌, గోరుమిటీలకే కడుపు నిండిపోతే ఎలాగా? సంక్రాంతి కదా.. పదండి అలా బయటకెళ్ళి బుట్ట బొమ్మల్లా ముస్తాబైన మా గోదారి ఆడోళ్ళని చూద్దాం. పట్టు పరికిణీలు, వోనీలు, జడ కుచ్చులు ఇలాంటయ్యన్నీ చూడొచ్చు ఇంకా మా దగ్గర. ఇయ్యాల మాత్రం అన్నాలు తినే దాకా బయటకెళ్ళొద్దులే. పెద్దోళ్ళని మూలకి తెచ్చుకుని దన్నఁవెట్టుకుని ఆళ్ళకి బట్టలెట్టాకా.. మన కొత్త బట్టలకి పసుపు రాసుకునేసుకుందాం. ఈ రోజు మాత్రం కలగూరా పొంగడాలు తినాలి మరి. అయ్యే నైవేద్యం కదా.

ఈ ఏడు పందేలేత్తారంటారా?? అని సీపు కొసెన్లెయ్యకండీ బాబా. ఇంకాసేపట్లో జూత్తారు కదా. అబ్బే.. ఇయ్యేటియ్యి. ఇయ్యన్నీ బుడ్డి బుడ్డి బర్లు, పిల్ల పందేలూని. అసలు సిసలు పందేలు బర్లు చూడాలంటే చించినాడ దగ్గర కలగంపూడన్నా ఎల్లాలి లేదంటే అయిబీఁవారంవన్నా ఎల్లాలి. అక్కడ రాజుగారి తోటల్లో సేసే ఏర్పాట్లు జూత్తే మీకే అండర్స్టాండింగైపోతాది. మావోళ్ళ హడావుడి జూత్తే… ఐపీయల్లులో ఆడెవడాడు.. ఇజయిమాల్యా కూడా చేసుండడు, ఆ రేంజిలో. ఏఁవనుకున్నారో!!

“డేగ మాది డేగ మాది.. అయిదీచ్చయిదీచ్చు..” అనక్కడరత్తుంది ఎవరో కాదండీ.. సాచ్చాత్తూ మాఊరి ఎమ్మెల్లే.. పండగొచ్చిందంటే.. సిన్నా పెద్దా ఒకటే యిక్కడ. అలాగెళ్లాపక్కన సూడండి.. “మూళ్ళు కాలీ.. మూళ్ళు కాలీ….. లేపేత్నాన్లేపేత్నాను..” అనరిసేవోడు మనూరోడే.. బరులు పక్కనే ఇలా గుండాటేత్తాడు. ఎల్లాడి సూడండి. యే కాసినోలోనూ ఇంత కిక్కు రాదు. యేటా కోట్లు చేతులు మారతాయ్ తెల్సా యిక్కడ. యేంటీ.. అదా?? ఆడలాగే పందెం కోడి పకోడీ అన్జెప్పమ్మేత్తాడు గానీ.. అది పారం కోడండే బాబూ. మీకు అదిరిపోయే కోడి పకోడి నర్సాపురఁవో మార్టేరు నుంచో పురమాయిత్తాను కదా. వచ్చేయండొచ్చేయండి. ఇంకా చూడాల్సినియ్యి చాలా ఉన్నాయి. అజ్జిబాబోయి.. ఇందాక మా పక్కింటోళ్ళ మఁనవరాలు గొబ్బెమ్మలెట్టుకుంటుంది రమ్మన్నారు. మర్చేపోయాను. పదండి పదండి.

“మొక్కా మొక్కా మొలిసిందంట..
ఏమి మొక్క మొలిసిందంట..
రాజా వారి తోటలో జామ మొక్క మొలిసిందంట..
ఆనాటి అక్కల్లారా.. చంద్రగిరి భామల్లారా..
భామసిరి గొబ్బిళ్ళో…
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో..” ఇలా బాగుంది పాటనుకుంట్నారా.. కాసేపాగండి.. “మొగలిపువ్వంటి మొగున్నియ్యవే…” అని సిగ్గు పడిపోతా పాడతారీ ఆడపిల్లలంతా. ఇదయ్యాక టిపినీలు ఏర్పాటు జేసేరండే.. తినేసెళ్ళాలి మనం. లేదంటే ఫీలింగొచ్చేద్దాళ్ళకి. అదిగో ఆ పిట్టలదొరొచ్చాడు చూడండి. ఆడి కబుర్లింటే.. యే రాజకీయనాయకుడు చెప్పే కబుర్లూ పనికిరావసలు. కోతలు కొయ్యడంలో యేక్లాసు ఆడిది.

ఆల్మోస్టన్నూర్లోనూ.. ఈ టయింలో గ్రామ దేవతల తీర్థాలు జరుగుతాయి. ముత్యాలమ్మ, గోగులమ్మ, మావుళ్ళమ్మ… అన్నట్టు మావుళ్ళమ్మంటే గుర్తొచ్చింది. అర్జెంటుగా బీఁవారవెళ్ళి అమ్మకి దన్నవెట్టుకుని జాతర చూసి రండి. పనిలోపని చంద్రికాలో ఓ బిర్యానీ కూడా లాగేయించేండి. చూస్కు తినండి, మసాలాకి గూబదిరిపోద్ది. లాస్టు బస్సట్టుకుని జార్తగా ఇంటికొచ్చేయండి. తెల్లారాక చాలా పనులున్నాయి.

అన్ని రోజులూ ఎంజాయ్మెంటేనేటండీ.. ఈ రోజు కనుమ కదా.. మనం కోనసీమ ప్రభల తీర్థం చూద్దాం. పదండి అంబాజీపేటెల్దాం. అక్కడ జగ్గన్నతోటలో జరుగుతాదీ రోజు. పదకొండు ఊళ్ళ శివుళ్ళు అక్కడ జేరి సమావేశమవుతారంట. అంచేత అన్నూళ్ళ నుంచి పెభలు మోసుకొత్తారు ఇక్కడకి. అసలు పొలాల్లోంచి బురదలోంచి, గోతులూ కుప్పలూ తొక్కుతా.. ఆళ్ళు “హర హరా” అనంటా ఆ దేవుడి పెభల్ని మోసుకొత్తా ఉంటే మనకి ఎంత ఊపొచ్చేద్దో తెల్సా.. అంతెందుకు.. మాహిష్మతిలో పడిపోతున్న విగ్రహాన్ని బాహుబలి పట్టుకోవడం మాకేం గొప్పనిపించదు కానీ.. గంగలకుర్రు ప్రభల్ని పీకల్లోతు కాలవలోకి దిగడిపోయినా కూడా, ఏ మాత్రం తొట్రూ తొందరా కంగారు లేకుండా.. అసలు బుజాల మీదున్న బరువు కదలకుండా.. ఆళ్ళు కాలవ దాటతా ఉంటే.. నా సామిరంగా.. ఉంటాదసలు… మీ బాసలో చెప్పాలంటే గూస్ బంప్స్ అన్న మాట. కాబట్టి చూసి దన్నఁవెట్టుకోండి. ఈ తోటలో ఏమీ దేవుడి బొమ్ముండదు. ఈ ఊళ్ళ నుంచొచ్చిన ప్రభలే దేవుళ్ళు. పదండింక.. ఈ రోజు ఇంట్లో వండే కక్కా ముక్కా తినాలి కదా. పన్లో పని బంగారుతీగ చేప తెప్పించేను. సగం ముక్కలు పులుసెట్టి మిగతా సగం ఏపుడు చేసుకు తింటే.. రుసి మరిచిపోయిన నాలిక లేచి డాన్సులేబేత్తాది. రాత్రికి గారెలు నాటుకోడీ పట్టు పడదాం. అయ్యాక కుర్చుని పేకాడదాం లేదంటే నరసాపురంలో టాప్ క్లాసు కబడ్డీ పోటీలు వాలీబాల్ పోటీలు జరుగుతాయ్ ఆడోళ్ళని కూడా తీసుకెళ్తే ఆళ్ళక్కూడా కాసేపు బయటంతా చూసినట్టుంటాది.

ఏంటో నాల్రోజులూ నాలుగు నివషాల్లా అయిపోయాయి కదా! చూసారుగా మరి గోదారి జిల్లాల్లో చూడాల్సినియ్యెన్నున్నాయో. ఇంకా చాలా ఉన్నాయి. టయానికి అందుకోలేం అని సూపెట్లేదు. అందుకే మరి గోదారూళ్ళు రావాలనేది. పోన్లెండి. ఇంక సివర్రోజు మా ఊళ్ళళ్ళో అన్ని బస్టాండుల్లో అత్తారింటికి తిరిగెళ్ళిపోతున్న ఆడ పిల్లలే కనపడతారండీ. వచ్చినపుడు తెచ్చుకున్న సామాను మాత్రమే కాకుండా.. పుట్టింటోళ్ళు పెట్టిన బట్టలు, వండి ఇచ్చిన సున్నుండలు, అరిసెలు, పూతరేకులు, జంతికలు.. ఇంకా పిల్లలకి కొన్న కొత్త బొమ్మలు పట్టుకుని బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారండీ బరువైన బ్యాగులతో అంత కన్నా బరువైన మనసులతో. పర్లేదులెండి ఉజ్జోగాలు సేవోళ్ళు మీరు తప్పదు కదా ఎల్లడం!! అయినా మీరు మళ్ళీ వేసవి కాలం శలవులకి పిల్లల్ని పంపిస్తే ఆ భాధంతా తీరిపోతుంది. మీరెళ్ళాక, మా పిల్లలు పట్నంలో పెద్ద ఉద్యోగం అని మేం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటామండి. మీరంతా జాగ్రత్తగా ప్రయాణం చేసి చేరుకున్నాక, సుఖంగా వచ్చేసాం అని మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి చాలు. భాధ పడుతున్న మనసులకి కొంచెం ఊరడింపుగా ఉంటుంది. ఇంక మీరు సిటీలకెల్తే పగలంతా పనితోటీ రాత్రంతా ఫోనుతోటీ బిజీ ఐపోతారనుకోండెలాగో. పోన్లే.. యేం బెంగెట్టుకోకండి. ఇయ్యన్నీ గుండెల్లో జ్ఞాపకాలుగా పెట్టుకుని..

మళ్ళీ వచ్చే యేడు కూడా రండి. ఇంకెందుకాలస్యం? ఇప్పట్నంచే ఆ ప్లానింగు మీదుండండి.