iDreamPost
iDreamPost
సినిమా పరిశ్రమే అంత. కొన్ని క్యాలికులేషన్లు మన అంచనాలకు భిన్నంగా పూర్తిగా వ్యతిరేక దిశలో సాగుతాయి. కాంబినేషన్లు ఎంత పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నా కథాకథనాల విషయంలో ఏ మాత్రం లెక్క తప్పినా ఫలితం ఊహించనంత దారుణంగా వస్తుంది. దానికో ఉదాహరణ చూద్దాం. 1993వ సంవత్సరం. తమిళ దర్శకుడు ఆర్కె సెల్వమణి మంచి ఫామ్ లో ఉన్న టైం. వరసగా పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్, చామంతి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మంచి ఊపుమీదున్నారు. వాటిని డీల్ చేసిన విధానం ఆయన్ను హాట్ కేక్ గా మార్చేసింది. హీరోయిన్ గా రోజా కూడా పీక్స్ లో ఉన్నారు. చిరంజీవితో మొదలుకుని అందరు స్టార్ హీరోలతో వరసగా ఆఫర్లు హిట్లు దక్కుతున్నాయి.
ఆ టైంలో స్వంతంగా ఓ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు రోజా. తనను పరిచయం చేసి కెరీర్ బ్రేక్ ఇచ్చిన ఆర్కె సెల్వమణితో తమ్ముడు కుమారస్వామిరెడ్డిని నిర్మాతగా చేసి రెండు భాషల్లో భారీ బడ్జెట్ బై లింగ్వల్ అనౌన్స్ చేశారు. తెలుగులో సమరం, తమిళంలో అతిరది పాదై టైటిల్స్ తో క్యాస్టింగ్ లో కొద్దిమార్పులతో ప్రకటించారు. నిర్మాణం కూడా చాలా రిచ్ గా కొనసాగింది. ఆ సమయంలో ఐఏఎస్ అధికారిణి చంద్రలేఖ మీద జరిగిన యాసిడ్ దాడిని స్ఫూర్తిగా తీసుకుని సెల్వమణి ఈ కథను రాసుకున్నారు. సీనియర్ నటి లక్ష్మి ఆ పాత్ర చేయగా ఆవిడ కూతురిగా ప్రతీకారం తీర్చుకునే రోల్ లో రోజా కనిపిస్తారు. సుమన్, రెహమాన్ హీరోలుగా ఇళయరాజా సంగీతం పునీత్ ఇస్సార్ విలనీ తదితర ఆకర్షణలు నిండుగా కూర్చారు.
అయితే వయొలెన్స్ ఎక్కువగా ఉండటంతో పాటు మెలో డ్రామా కాస్త శృతి మించి సమరం అంచనాలు అందుకోలేక పోవడంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు. సమరం దెబ్బకు ఆర్థికంగా రోజా చాలా నష్టపోవాల్సి వచ్చింది. సబ్జెక్టును నమ్మి పోసిన కోట్లాది రూపాయలు మంచి నీళ్లలా ఖర్చయిపోయాయి. అయినప్పటికీ దిగులుపడకుండా హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగించి నిరాశపడకుండా సెల్వమణి డైరెక్షన్ లో 7 సినిమాల్లో నటించడం విశేషం. వీటిలో చాలా మటుకు కమర్షియల్ హిట్లే ఉన్నాయి. 2001లో సూపర్ హిట్ మూవీ దుర్గ చేశాక రోజా సెల్వమణి ఆపై సంవత్సరం నిజ జీవితంలో భార్యభర్తలయ్యారు. సినిమా సమరం ఓడించినా పట్టుదలతో రియల్ లైఫ్ లో మాత్రం గెలిచి చూపించారు సెల్వమణి జంట