iDreamPost
iDreamPost
మజిలీ, ఓ బేబీ రూపంలో గత ఏడాది రెండు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న అక్కినేని సమంతాకు ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న జాను తీవ్రంగా నిరాశపరిచింది. తమిళ్ వెర్షన్ ని మించి ఆడుతుందనుకుంటే కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేక డిజాస్టర్ ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత సామ్ ఇంకే కొత్త సినిమా ఒప్పుకోలేదు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం పెర్ఫార్మన్స్ బేస్డ్ రోల్స్ కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. త్వరలో ఫ్యామిలి మ్యాన్ 2తో వెబ్ సిరీస్ డెబ్యూ చేయబోతున్న సమంతా అందులో మొదటిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సామ్ ఒక హిస్టారికల్ బయోపిక్ లో నటించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. భారతదేశానికి స్వాతంత్రం రాక ముందే ఉద్యమాల్లో పాల్గొని ఒక దేవదాసిగా ఆ వ్యవస్థ ప్రక్షాళనకు పూనుకున్న గొప్ప మహిళగా పేరున్న బెంగళూరు నాగరత్నమ్మ జీవిత కథ ఆధారంగా ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ ప్లానింగ్ జరుగుతోందట. స్టోరీని లాక్ చేశాక అప్పుడు సామ్ కి వినిపించబోతున్నట్టు తెలిసింది. 1878లో జన్మించిన నాగరత్నమ్మ 1952లో కన్నుమూశారు. త్యాగరాజ ఆరాధోత్సవాల్లో స్త్రీలకు ప్రాధాన్యం కలిగించాలని గళమెత్తిన చరిత్ర ఆవిడది. సంఘ సంస్కర్తగా ఎన్నో విప్లవాత్మక మార్పులకు ఆవిడ శ్రీకారం చుట్టారు.ఇది కార్యరూపం దాలిస్తే సమంతాకు ఇది లైఫ్ టైం ఛాలెంజింగ్ రోల్ గా నిలిచిపోతుంది. నిర్మాత దర్శకుడు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఒకవేళ నిజమైతే పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తారు. భారం మొత్తం సమంతా భుజాల మీదే ఉంటుంది కాబట్టి అభిమానులు కూడా దీని పట్ల ఎగ్జైట్ అవ్వడం ఖాయం. అయితే ఇదంతా ప్రతిపాదన దశలోనే ఉన్నట్టు తెలిసింది. లాక్ డౌన్ ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. షూటింగ్ కు అనుగుణంగా వాతావరణం లేకపోవడంతో ఇది ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాలి. బెంగళూరు నాగరత్నమ్మ కథను సినిమాగా ప్లాన్ చేశారా లేక వెబ్ సిరీస్ గా మారుస్తారా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. తమిళ్ లో నయనతార కాబోయే భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్న సమంతా అది కాకుండా ఇంకే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన వార్త నిజమైతే ఫ్యాన్స్ కు అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది.