iDreamPost
android-app
ios-app

AP Contract Employees – ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక భరోసా..

  • Published Nov 02, 2021 | 8:00 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
AP Contract Employees – ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు  ఆర్థిక భరోసా..

 ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 18,060 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు 18 నుంచి 82 శాతం వరకు వేతనాలు పెరిగాయి.


వీరి వెతలు పట్టించుకోని బాబు ప్రభుత్వం..

గత చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో వేతనాలు పెంచాలని, మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వాలని పలుమార్లు కాంట్రాక్టు ఉద్యోగులు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఆందోళన బాట పట్టిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో 20 రోజుల్లో వస్తుందనగా జీవో నెంబర్ 12, 24 లను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. కానీ వాటిని అమలు చేయకుండా కాంట్రాక్టు
ఉద్యోగులను మోసగించింది. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో జీవోలు విడుదల చేసి చేతులు దులుపుకొంది.


ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..

ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప యాత్ర చేసిన జగన్మోహనరెడ్డి కాంట్రాక్టు ఉద్యోగుల వెతలను విన్నారు. వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం అధికారంలోకి రాగానే దాదాపు అన్ని విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ వర్తించేలా జీవో నెెంబర్ 40 అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగినులతో సమంగా కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా మెటర్నిటీ లీవ్, ఇతర సదుపాయాలు కల్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ. 2 లక్షలు పరిహారం అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు.


వేతనాల పెంపు..

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి సగటున రూ.15,000 వేతనం అందేది. అప్పటిలో వీరి వేతనాల కోసం ఏటా రూ. 330.54 కోట్లు వెచ్చించేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సగటున ఒక్కో ఉద్యోగికి రూ.26,758 వేతనం లభిస్తోంది. దీంతో ఏటా వీరి వేతనాలకు వెచ్చించే మొత్తం రూ. 579.89 కోట్లకు చేరింది.


విద్యాశాఖ ఉద్యోగులకు భారీగా లబ్ధి..

ఉన్నత విద్యాశాఖ కాలేజీ ఎడ్యుకేషన్ లోని జూనియర్ లెక్చరర్లు, లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ప్రొఫెసర్, ఇతర ఫ్యాకల్టీలకు మొత్తం 691 మందికి మినిమమ్ టైమ్ స్కేల్ వర్తిస్తోంది. ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్, ల్యాబ్ అసిస్టెంట్, లెక్చరర్లు 3,728 మందికి లబ్ధి చేకూరింది. సాంకేతిక విద్యాశాఖలో 432 మందికి మేలు చేకూరుతోంది. గురుకుల విద్యాలయాలు, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఏపీ విభాగాల్లొని 6,026 మందికి వేతనాలు పెరిగాయి.


అవుట్ సోర్సింగ్ సిబ్బందికి తొలగిన ఇబ్బందులు..

టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబునాయుడు తనకు సన్నిహితులైన వారికి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కట్టబెట్టారు. ఈ ఏజెన్సీలు లక్షలు వసూలు చేసి పోస్టులు అమ్ముకునేవి. జీతాల్లో కోతలు పెట్టేవారు. అదీ ఆలస్యంగా ఇచ్చేవారు. ఉద్యోగ భద్రత ఉండేది కాదు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు ఉండేవి కాదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఏజెన్సీలను రద్దు చేశారు. కొత్తగా ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్ డ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి 1.20 లక్షలకు పైగా ఉద్యోగులను దాని పరిధిలోకి తెచ్చారు. ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ చేస్తున్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు కల్పించారు.


ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

తమకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాక ఇతర ప్రయోజనాలు అందిస్తున్న ప్రభుత్వానికి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కృతజ్ఞతలు చెబుతున్నారు. వేతనాలను గణనీయంగా పెంచి ఆర్థిక భరోసా ఇచ్చి ఉద్యోగ పక్షపాత ప్రభుత్వంగా నిలిచిందని అంటున్నారు.

Also Read : CM YS Jagan Simplicity – దటీజ్ జగన్.. అందుకేగా నిన్ను జనం గుండెల్లో పెట్టుకుంది