‘మేము తగ్గించాం… మీరు తగ్గించండి’.. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గించినప్పుటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇదే. ‘లీటరు ధర రూ.వంద దాటించి.. ఇప్పుడు ఐదో, పదో తగ్గించామంటూ.. పెంచినవారే రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా?’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు తెలంగాణా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నా బీజేపీ నేతలు వెనక్కు తగ్గడంలేదు. కేంద్రం తగ్గించింది.. మీరు కూడా తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు. బీజేపీకి ఏపీలో టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా తోడయ్యాయి. బీజేపీ నాయకులు ఒక అడుగు ముందుకువేసి చమురు మీద వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇస్తున్నామని చెబుతూ ధరల పెంపు పాపంలో రాష్ట్రాలకు పరోక్షంగా భాగస్వామ్యం ఉందనే అర్ధమొచ్చేలా కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ వాదనలలో పస లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి పూసగుచ్చినట్టు వివరించారు. చమురు ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం కపటనాటకాన్ని బయట పెట్టడమే కాకుండా.. చమురు ధరల విషయంలో ఇటు కేంద్రానికి, అటు రాష్ట్రానికి మేలు జరిగే ప్రతిపాధనను ఆయన ముందుంచారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద నాలుగు రకాలుగా పన్నులు, చార్జీలు వసూలు చేస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (సర్ చార్జీ), అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (రోడ్లు, మౌళిక సదుపాయాల సెస్), ఇతర పన్నులు (సెస్‌లు, సర్ చార్జీలు) వసూలు చేస్తారు. దీనిలో కేవలం ఎక్సైజ్ డ్యూటీ మీద వచ్చే ఆదాయంలో 41శాతం రాష్ట్రాలకు వాటాగా ఇస్తారు. మిగిలిన వాటి మీద వచ్చే ఆదాయం కేంద్రం తన వద్దనే ఉంచుకుంటుంది. మొత్తం కేంద్రం పొందే ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీ మీద వచ్చే ఆదాయం కేవలం 14 శాతం మాత్రమే కావడం ఇక్కడ గమనార్హం. ఆ 14 శాతం ఆదాయంలోనే రాష్ట్రానికి వాటా ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాల మీద కేంద్రానికి రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. దీనిలో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.47 వేల500 కోట్లు, సర్ చార్జీల రూపంలో రూ.74 వేల 350 కోట్లు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.1.98 లక్షల కోట్లు, ఇతర పన్నుల రూపంలో రూ.15 వేల150 కోట్ల ఆదాయం వస్తుంది. దీనిలో రాష్ట్రాలకు ఇచ్చేది కేవలం రూ.19 వేల475 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3లక్షల 15 వేల 525 కోట్లు కేంద్రం వద్దనే ఉంచుకుంటుంది. ఇదే విషయాన్ని ఏపీలో జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశిస్తోంది. కేవలం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రమే వాటా ఇస్తూ ధరల పెరుగుదలలో మమ్మల్ని కూడా ఎందుకు భాగస్వామ్యులను చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల కేంద్రం ముందు మంచి ప్రతిపాదన ఉంచారు.
ఎక్సైజ్ డ్యూటీ మీద వచ్చే ఆదాయంతోపాటు మిగిలిన ఆదాయాలలో కూడా రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాలని సూచించారు. ఇలా ఇవ్వాల్సి వస్తే కేంద్రం తనకు వచ్చే ఆదాయంలో రూ.1.34 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు కేంద్రంతోపాటు రాష్ట్రం కూడా చమురు ధరలు పెరగకుండా చర్యలు తీసుకునే బాధ్యత ఉంటుందని తేల్చిచెప్పారు. సెస్‌ల రూపంలో దోస్తున్న సొమ్ములకు కేంద్రం లెక్క చెప్పాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సెస్‌లు తగ్గిస్తే లీటరు పెట్రోల్, డీజిల్ రూ.60 నుంచి రూ.70కు ఇచ్చే అవకాశముందన్నారు. చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్న ప్రతిపక్షాలు మాత్రం దీని మీద స్పందించడం లేదు. ముఖ్యంగా బీజేపీ నేతలు ఇప్పటి వరకు నోరుమెదపడం లేదు. దీనిని పక్కనబెట్టి మద్యం ధరలు తగ్గించాలని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు వింత వాదనకు దిగి ప్రజలలో చులకన అవుతున్నారు.
Also Read : BJP, Petrol Prices – కొనక్కొచ్చుకున్న బీజేపీ..!