iDreamPost
android-app
ios-app

సచిన్‌కు భారీ ఊరట.. తదుపరి ఎత్తు వేస్తున్న అశోక్‌ గెహ్లాత్‌..

సచిన్‌కు భారీ ఊరట.. తదుపరి ఎత్తు వేస్తున్న అశోక్‌ గెహ్లాత్‌..

కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ నేత సచిన్‌ పైలెట్‌ వర్గానికి భారీ ఊరట దక్కింది. సచిన్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, యథాతథస్థితినే కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పార్టీ విప్‌ ధిక్కరించారనే కారణంతో వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్‌ అనర్హత వేటు నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులపై సచిన్‌వర్గం హైకోర్టులో సవాల్‌ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లోనే విప్‌ వర్తిస్తుందని, పార్టీ కార్యక్రమాలకు వర్తించదని తన పిటిషన్‌లో పేర్కొంది. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది.

హైకోర్టు తీర్పు వెలువరించకుండా ఆదేశాలుజారీ చేయాలంటూ స్పీకర్‌ సుప్రింను ఆశ్రయించారు. అయితే సుప్రిం అందుకు నిరాకరిస్తూ హైకోర్టును ఇలా ఆదేశించలేమంటూ నిన్న తీర్పు చెప్పింది. ఫలితంగా సచిన్‌ వర్గానికి లైన్‌ క్లియర్‌ అయింది. తాజాగా తీర్పుతో రాజస్థాన్‌ రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయి. ఎత్తులు, పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలల్లో అశోక్‌ గెహ్లోత్, సచిన్‌పైలెట్‌ వర్గాలు మునిగిపోయాయి. తీర్పు వచ్చిన వెంటనే అశోక్‌ తన ఎత్తు వేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీని సమావేశపరచాలంటూ విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయాలనే వ్యూహంతో అశోక్‌‌ ఉన్నారు. సచిన్‌ వర్గ ఎమ్మెల్యేలు ఎలాగూ పార్టీ విప్‌ ఉల్లంఘిస్తారు కాబట్టి వారిపై అనర్హత వేటు వేయచ్చనే ప్లాన్‌తో ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేసిన తర్వాత తన ప్రభుత్వంపై విశ్వాసతీర్మానం కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో అశోక్‌ ఉన్నారు. ఫలితంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న మాదిరిగా ఒకే సారి రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత.. తన ప్రభుత్వ బలం నిరూపించుకునే దిశగా అశోక్‌ గెహ్లాత్‌ పావులు కదుపుతున్నారు.

ఈ ప్రయత్నాలు చేస్తూ అశోక్‌ గవర్నర్‌పై విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తాము కోరిన గవర్నర్‌ స్పందించడంలేదని ఆరోపిస్తున్నారు. ఎవరో ఆయన్ను నిలువరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ గవర్నర్‌ అందుకు తగినట్లుగా పనిచేయడంలేదన్నారు. ఇలా అయితే తన వర్గ ఎమ్మెల్యేలు అందరితో వెళ్లి మరోమారు గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. గవర్నర్‌ తీరు ఇలానే ఉంటే ప్రజలు రాజ్‌భవన్‌ను గెరావ్‌ చేసే పరిస్థితి వస్తుందని ఘాటుగా స్పందించారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి సమావేశం జరుపుతున్న సమయంలో రాజ్‌భవన్ ముందు బైటాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘అశోక్ గెహ్లాట్ జిందాబాద్’, ‘అసెంబ్లీని తక్షణం గవర్నర్ సమావేశ పరచాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడం గమనార్హం. అసెంబ్లీని సమావేశపరచాలనే సీఎం అశోక్‌ గెహ్లాత్‌ వినతిపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? సచిన్‌ వర్గం తర్వాత స్టెప్‌ ఎలా ఉండబోతోంది..? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.