iDreamPost
iDreamPost
చంద్రబాబునాయుడుకు సంబంధించి తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత సబ్బం హరి కొత్త విషయాలు బయటపెట్టాడు. అదేమిటయ్యా అంటే రాష్ట్ర విభజనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, చంద్రబాబు పూర్తి వ్యతిరేకమని. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రం విడిపోతేనే బాగుంటుందని భావించాడట. వైఎస్సార్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ఇపుడు సబ్బ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విషయం తెలుగు రాష్ట్రాల్లోని జనాలందరికీ తెలుసు. అసలు రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదని అప్పట్లో జనాలు చాలామంది నిశ్చింతగా ఉన్నారంటే వైఎస్సార్ ను చూసుకునే.
వైఎస్ ఉన్నంత కాలం ప్రత్యేక తెలంగాణా గురించి గట్టిగా మాట్లాడాలంటే కేసీయారే ఆలోచించేవాడు. కేసీయార్ పరిస్ధితి ఇలాగుంటే ఇక ప్రత్యేక తెలంగాణా కావాలని గట్టిగా డిమాండ్ చేసే వాళ్ళే కనబడే వారు కాదు. ఇక కాంగ్రెస్ నేతల పరిస్ధితి అయితే చెప్పనే అక్కర్లేదు. రాష్ట్రం విడిపోయే ప్రసక్తే లేదని వైఎస్సార్ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎన్నోసార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వైఎస్ మరణించాడో అప్పుడే కేసీయార్ అయినా మరోకరైనా గట్టిగా డిమాండ్లు వినిపించటం మొదలుపెట్టారు.
సరే వైఎస్ విషయాన్ని పక్కనపెట్టేస్తే పూర్తి విరుద్ధమైన వైఖరి అవలంభించిన వ్యక్తి చంద్రబాబునాయుడు. ముందు రెండుకళ్ళ సిద్ధాంతమన్నాడు. తర్వాత ప్రత్యేక తెలంగాణా ఇస్తే అభ్యంతరం లేదని కేంద్రంలో అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో తన నేతలతో చెప్పించాడు. తర్వాత ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటికి కూడా ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు లేఖలు పంపించాడన్న విషయం అందరికీ తెలిసిందే.
చివరకు పార్లమెంటులో రాష్ట్ర విభజనపై జరిగిన ఓటింగ్ లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఓట్లు వేయించాడు. ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా వేసిన మొదటి ఓటు తమదే అంటూ వరంగల్, మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రకటించిన విషయం అందరికీ గుర్తుంది. తెలంగాణా ఏర్పాటులో ఇంత కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు గురించి సబ్బం విరుద్ధంగా ఇన్ని అబద్ధాలు ఎందుకు చెబుతున్నాడో అర్ధం కావటం లేదు.
ఇదే విషయమై జగన్మోహన్ రెడ్ది కూడా కేంద్రానికి లేఖ ఇచ్చాడు. రాష్ట్ర విభజనలో ఏపికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని లేఖలో స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే అప్పటికే రాష్ట్ర విభజన చేయాలని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ణయంతో పాటు కేంద్రమంత్రివర్గం కూడా నిర్ణయించేసింది కాబట్టి. వాస్తవాలు ఇలాగుంటే ఇపుడు సబ్బం తన అబద్ధాలతో చరిత్రను వక్రీకరించాలని ప్రయత్నిస్తే నవ్వుల పాలవట్టం ఖాయమని గ్రహిస్తే మంచింది.