Idream media
Idream media
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలనాలకు మారుపేరు. పోరాటాల కంటే కూడా ఏదో ఒక సంచలన వ్యాఖ్య ద్వారా ఆయన పాపులారిటీ సంపాదించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణ ఆ జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్నారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెనుద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రైవేట్ బస్సులు తిప్పితే తగలబెడుతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంతేకాదు…తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆ పేరుతో పిలవాలన్నా మనసు రావడం లేదన్నారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడైన పువ్వాడ వంశంలో అజయ్ చెడపుట్టాడని తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.కానీ పువ్వాడ అజయ్ మంత్రిగా తొలిసారి ఖమ్మం వెళ్ళినప్పుడు సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు పెట్టారు.
నోటికొచ్చినట్టు మాట్లాడటం నారాయణ నైజమనే ప్రచారం ఉంది. గతంలో ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి పరిశీలిద్దాం. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై నోరు పారేసుకున్నారు. శ్రీలక్ష్మి ఎంతో అందంగా ఉంటుందని, కాని ఆమె అవినీతి ఎంతో వికారంగా ఉంటుందని వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీనిపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడంతో తప్పైందని, అందంగా అనే మాటలను వెనక్కి తీసుకున్నారు.
2014లో సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి నారాయణ పోటీకి దిగారు. అయితే వామపక్షాల మధ్య పొత్తు పొసగలేదు. దీంతో నారాయణకు కోపం పతాకస్థాయికి చేరింది. తమ్మినేని వీరభద్రం వామపక్ష సూత్రాలను రూ.15 కోట్లకు అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంటే తమ్మినేని వీరభద్రం రేటు పెరిగిందని వ్యంగస్త్రాలు విసిరారు. దీనిపై సీపీఎం ఘాటుగా స్పందించడంతో వివాదం పెద్దదైంది. చివరికి నారాయణ తన విమర్శలను వెనక్కి తీసుకోవడంతో వామపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగిపోయింది.
రెండేళ్ల క్రితం నాటి మాట. ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను ఉద్దేశించి బపూన్ అని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోశారు. నారాయణ మాటలపై దుమారం రేగడంతో గవర్నర్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయన మనసు నొప్పించి ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో నారాయణపై …ఇంతకూ బపూన్ మీరా? గవర్నరా అంటూ పెద్దస్థాయిలో ట్రోలింగ్స్ నడిచాయి.
కేసీఆర్ గెలిస్తే చెవు, ముక్కు కోసుకుంటానని నారాయణ అన్నమాటలు ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటాయి. ఆ తర్వాత కేసీఆర్ గెలవడం, ఒక సభలో ఆయన మాట్లాడుతూ నారాయణ తన మిత్రుడే అని, చెవి. ముక్కు కోసుకోవద్దని హితవు పలికారు.
ఇలా మాటల్లో పొదుపు పాటించకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్న నారాయణ వైఖరి సీపీఐకి తలవంపులు తెస్తోందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చండ్రా రాజశ్వరరావు, ఇటీవల మృతి చెందిన ప్రముఖ సంపాదకుడు సి.రాఘవాచారి లాంటి ఉద్దండులు సేవలందించిన పార్టీ కనమరుగయ్యేందుకు నారాయణ లాంటి వారు ఒక్కరుంటే చాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇటీవల తెలంగాణలోని హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో మొదట టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం, కేసీఆర్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరించడంతో సీపీఐపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ ఎన్నికలో తమ మద్దతును టీఆర్ఎస్‌కు ఉపసంహరించుకొంది.
వాస్తవాలు కళ్లకు కనిపిస్తుంటే తెలంగాణలో బస్సులను కాలుస్తాం, పువ్వాడ వంశంలో అజయ్ చెడపుట్టాడనే నేలబారు మాటలు మాట్లాడటం ఎంత వరకు సబబో ఆయన ఆలోచించాలి. పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి వచ్చినప్పుడు సొంత పార్టీ కార్యకర్తల కంటే సీపీఐ శ్రేణులే భారీగా ఫ్లెక్సీలు కట్టారనే సంగతి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి బాగా తెలుసు. తెలంగాణలో బస్సులను కాల్చడం సంగతేమోగాని తన మాటల మంటతో పార్టీకి ఏనాడో నిప్పు పెట్టారనే విమర్శ బలంగా వినిపిస్తోంది.