iDreamPost
iDreamPost
మాస్ మహారాజా కొత్త సినిమా అధికారికంగా లాంచ్ అయ్యింది. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే మూవీకి ఖిలాడీ పేరుని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. నోట్లు గాల్లో తేలుతుండగా రవితేజ స్టైలిష్ గా ఓ ఫోజిచ్చిన స్టిల్ ని ఇందులో పొందుపరిచారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయట. విక్రమార్కుడు తరహాలో ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. అయితే ఆ రెండు పాత్రల స్వభావాలు ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు.
మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించనున్నారు. కొంత గ్యాప్ తర్వాత రవితేజకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించే ఖిలాడీకి బడ్జెట్ కూడా భారీగానే కేటాయించినట్టు తెలిసింది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం క్రాక్ చివరి దశ పనులు జరుగుతున్న క్రమంలో రవితేజ అందులో బిజీగా ఉన్నాడు. అది కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. త్వరగానే షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే వేసవిలోనే రిలీజ్ చేసే ఛాన్స్ లేకపోలేదు
రవితేజకు సాలిడ్ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు చాలా అవసరం. వరసగా వచ్చిన డిజాస్టర్లు ఇమేజ్ పరంగా ఎలాంటి ఇబ్బంది సృష్టించనప్పటికీ మార్కెట్ విషయంలో మాత్రం డ్యామేజ్ జరిగింది. కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా తగిన మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. అందుకే క్రాక్ మీద మాములు నమ్మకం పెట్టుకోలేదు అభిమానులు. అది హిట్ అయ్యి ఖిలాడీ కూడా అదే ఫలితాన్ని అందుకుంటే మాస్ మహారాజా మునుపటి ఫామ్ ఈజీగా వచ్చేస్తుంది. మరి డబుల్ ఎంటర్ టైమెంట్ తో రాబోతున్న ఖిలాడీ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో వేచి చూడాలి