iDreamPost
iDreamPost
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికి వచ్చే అవకాశం ఒక్క శాతం కూడా లేదని తేలిపోయింది. నిర్మాత దానయ్య కెమెరా మెన్ సెంథిల్ గతంలో 70 శాతం పూర్తయ్యిందని చెప్పినా కూడా బాలన్స్ ఉన్న భాగం కూడా చాలా కీలకమే. హీరొయిన్ల ఎంట్రీ ఈ షెడ్యూల్ లోనే ఉంటుంది. తనకు కరోనా పాజిటివ్ తేలాక రాజమౌళి ఇప్పుడప్పుడే అనవసరమైన రిస్క్ వద్దని నిర్ణయించుకున్నారట. దసరా తర్వాత పరిస్థితిని చూసి నవంబర్ నుంచి షూటింగ్ తిరిగి మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే అనుకున్న దాని కన్నా ఇంకొంత లేట్ అవ్వడం మాత్రం తప్పేలా లేదు. ఎందుకంటే అలియా భట్ ప్రాధాన్యత క్రమంలో ఆర్ఆర్ఆర్ కన్నా ముందు బ్రహ్మాస్త్ర ఉంది.
అది పూర్తి చేస్తే కాని ఆర్ఆర్ఆర్ కు రాకూడదని డిసైడ్ అయినట్టుగా ముంబై టాక్. వాస్తవానికి లాక్ డౌన్ త్వరగా ముగిసిపోతే బ్రహ్మాస్త్రను త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ముంబైలో కేసులు కొనసాగుతుండటంతో పాటు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ఫుల్ రెస్ట్ లో ఉన్నారు. సో కొంత బ్రేకులు తప్పవు. ఈ లెక్కన చూస్తే బ్రహ్మాస్త్రను పూర్తి చేసి ఆర్ఆర్ఆర్ సెట్లో అడుగు పెట్టడానికి అలియకు 2021 వచ్చేస్తుంది. ఇందులో తన పాత్ర పేరు సీత. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామరాజుకు జంటగా కనిపిస్తుంది. కేవలం 20 నిమిషాల పాటే ఉంటుందని అయినప్పటికీ పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఇచ్చే విధంగా చాలా ఎమోషనల్ గా సాగుతుందట. దీని కోసమే ప్రత్యేకంగా తెలుగు కూడా నేర్చుకుంటున్న అలియా భట్ రాజమౌళితో పని చేసేందుకు చాలా ఆసక్తి చూపుతోంది.
ఈ సమీకరణలన్నీ చూస్తుంటే ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది వేసవి టార్గెట్ ని అందుకోవడం కూడా కష్టమే. అదే జరిగితే ఆగస్ట్ 15 లేదా దసరాకు ఫిక్స్ కావాల్సి ఉంటుంది. తారక్ అభిమానులు మూడేళ్లు, చరణ్ ఫ్యాన్స్ రెండున్నర సంవత్సరాలు గ్యాప్ భరించక తప్పదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్ఆర్ఆర్ కు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. స్వతంత్రం రాకమునుపు నేపధ్యాన్ని తీసుకుని రూపొందిస్తున్న ఈ మూవీలో పాటలు కూడా కుదించినట్టు సమాచారం. ఇద్దరు హీరోల డాన్సులు గట్రా ఏమి ఉండవట. కాకపోతే కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ గ్రాఫిక్స్ నెవర్ బిఫోర్ తరహాలో ఉంటాయని త ఇన్ సైడ్ టాక్. ఈ సంవత్సరం దసరా పండక్కు జూనియర్ చేసిన కొమరం పాత్ర పరిచయం తాలూకు టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి