బెంగుళూరుపై ముంబై గెలవాలంటే సాధించాల్సిన లక్ష్యం 202 పరుగులు.. దుబాయ్ లాంటి పెద్ద స్టేడియంలో ఈ లక్ష్యాన్ని సాధించడం దాదాపు అసాధ్యమే.. కానీ రోహిత్,డికాక్,సూర్యకుమార్,హార్దిక్ పాండ్య, పొలార్డ్ లాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబయి లక్ష్యాన్ని ఛేదిస్తుందని సగటు క్రికెట్ అభిమాని ఆశ.. కానీ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పరాజయం దిశగా సాగిపోయింది ముంబయ్.. ఈ దశలో పెద్దగా అంచనాలు లేని ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) బ్యాటింగ్ కి వచ్చాడు.ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. అయినా ముంబయ్ గెలుపుపై ఏ ఒకరికి నమ్మకం లేదు. నెమ్మదిగా ఆడుతూ అప్పుడప్పుడూ బంతిని బౌండరీని దాటిస్తూ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. హార్దిక్ పాండ్య కూడా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన పొలార్డ్(24 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) నెమ్మదిగా ఆడుతుండడంతో విజయానికి దూరంగా ముంబయ్ ఇన్నింగ్స్ సాగిపోయింది.
ఇషాన్ కిషన్ మాత్రం గేరు మార్చి సిక్సర్లు కొడుతున్నా గెలుపుపై ఎవ్వరికీ నమ్మకం లేదు..17 వ ఓవర్ వరకూ నెమ్మదిగా ఆడిన పొలార్డ్ తనలో దాగిన విధ్వంసక వీరుడిని బయటకు తీసాడు. జంపా వేసిన 17 వ ఓవర్లో 27 పరుగులు పిండుకున్నాడు. దానికి తోడు పొలార్డ్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను నేలపాలు చేయడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. చహల్ 18వ ఓవర్లో కూడా మూడు భారీ సిక్సర్ల సాయంతో 22 పరుగులు సాధించడంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారింది. 19వ ఓవర్‌లో అద్భుతమైన బౌలింగ్ వేసిన నవదీప్ సైనీ 12 పరుగులివ్వడంతో చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా ఇషాన్ కిషన్ రెండు భారీ సిక్సర్లు సాధించి ముంబయ్ ని గెలుపు అంచులకు తీసుకువచ్చాడు..మరో భారీ షాట్ కి ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయిన స్థితిలో పొలార్డ్ ఫోర్ కొట్టడంతో స్కోరు 201తో సమమై మ్యాచ్ టై గా మారింది.
నవదీప్ సైనీ అద్భుతంగా వేసిన సూపర్ ఓవర్లో పొలార్డ్, హార్దిక్,రోహిత్ లు ముగ్గురు 7 పరుగులు మాత్రమే సాధించడంతో 8 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు బుమ్రా వేసిన సూపర్ ఓవర్లో చివరి బంతి వరకూ శ్రమించి విజేతగా నిలిచింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ రాణించడంతో బెంగుళూరు సునాయాసంగా పరుగులు సాధించింది. ఫించ్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) ముంబయ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా దేవ్‌దత్ పడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతనికి సహకారాన్ని అందించాడు. ఫించ్ ఇచ్చిన క్యాచ్ లు ఫీల్డర్లు జారవిడవడం కూడా అతనికి కలిసొచ్చింది. అర్ధ సెంచరీ చేసి ఉపుమీదున్న ఫించ్ ను బౌల్ట్ బౌలింగ్ లో పొలార్డ్ చేతికి చిక్కడం వెంటనే కోహ్లీని రాహుల్ చాహర్ ఔట్ చేయడంతో బెంగుళూరు స్కోరువేగం మందగించింది.
ఈ దశలో క్రీజులోకి అడుగు పెట్టిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అనూహ్యంగా చెలరేగిపోయాడు. అప్పటివరకూ నెమ్మదిగా ఆడిన పడిక్కల్ కూడా బ్యాట్ ఝళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పడిక్కల్ ఔట్ అయిన అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన శివమ్ దూబే కూడా మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో బెంగుళూరు స్కోరు 200 దాటింది.