కొత్త తరంలో స్వచ్ఛమైన పల్లెటూరి నేపథ్యంలో వచ్చే సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు ఈ ట్రెండ్ ఉధృతంగా సాగేది. ముఖ్యంగా హీరో గ్రామపెద్దగా తీర్పులిస్తూ నలుగురి మంచి చెడ్డలు చూసుకుంటూ తన కుటుంబానికే కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడనే పాయింట్ మీద తెలుగు తమిళంలో లెక్కలేనన్ని చిత్రాలు వచ్చాయి. ‘పెదరాయుడు’ లాంటివి చరిత్ర సృష్టించి ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పితే ‘చినరాయుడు’ లాంటి మూవీస్ వెంకటేష్ రేంజ్ హీరోలకు మంచి సంతృప్తిని మిగిల్చాయి. మన దగ్గర తక్కువ కానీ కోలీవుడ్లో ఈ విలేజ్ హెడ్ సెంటిమెంట్ డ్రామాలు విపరీతంగా వచ్చేవి. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసినవి కూడా ఉన్నాయి.
1992లో విజయ్ కాంత్ తో దర్శకుడు ఉదయ్ కుమార్ తీసిన ‘చినగౌండర్'(తెలుగులో చినరాయుడు)సూపర్ హిట్ అయ్యాక ‘జిల్లా కలెక్టర్’ పేరుతో రజినీకాంత్ తో సినిమా చేయాలనీ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అయితే బడ్జెట్ కారణాలతో పాటు ఇదెందుకో వర్క్ అవుట్ కాదన్న అనుమానం నిర్మాతలైన ఏవిఎం అధినేతలకు కలిగింది. దీంతో అది పక్కనపెట్టి ఉదయ్ కుమార్ కు బాగా పట్టున్న గ్రామీణ నేపథ్యంలోనే ఓ మంచి సబ్జెక్టు సిద్ధం చేయమని చెప్పారు. అప్పుడు పుట్టిందే 1993లో విడుదలైన యజమాన్. హీరోయిన్ గా ముందు మీనాను అనుకున్నప్పుడు రజని తటపటాయించారు. గతంలో తన సినిమాలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మీనాతో ఆడిపాడటం ఎలా అని. ఫోటో షూట్ చేసి చూసుకున్నాక ఫైనల్ గా కన్విన్స్ అయ్యారు.
ఈ కథలో మగతనం అనే కాన్సెప్ట్ ని తీసుకోవడమే వెరైటీ. దాయాది పన్నిన కుట్ర వల్ల ఊరి పెద్ద భార్గవరాయుడు(రజినీకాంత్)కోరి పెళ్లి చేసుకున్న భార్య(మీనా)గర్భసంచి శాశ్వతంగా తొలగిపోతుంది. దీంతో రాయుడుకి మగతనం లేదనే అంశాన్ని తెరమీదకు తీసుకొస్తాడు శత్రువు కార్తవరాయుడు(నెపోలియన్). అది తప్పని రుజువు చేయడం కోసం అదే ఊరికి చెందిన ఓ పేదమ్మాయి(ఐశ్యర్య) భార్గవ రాయుడు మీద మానభంగం నేరం మోపుతుంది. ఆ తర్వాత అనారోగ్యం వల్ల రాయుడు భార్య చనిపోతుంది. ఆపై జరిగే డ్రామానే అసలు కథ. సెంటిమెంట్ పాలు ఎక్కువైనా రజిని యాక్టింగ్, ఇళయరాజా అద్భుతమైన పాటలు యజమాన్ ని బ్లాక్ బస్టర్ చేశాయి. దీన్నే తెలుగులో ‘రౌడీ జమీందార్’గా అనువదించి రిలీజ్ చేస్తే ఇక్కడా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది