iDreamPost
iDreamPost
పెళ్లి చూపులుతో సక్సెస్ అందుకుని అర్జున్ రెడ్డితో స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ రేంజ్ గీత గోవిందం తర్వాత ఏకంగా ఆకాశాన్ని తాకింది. ఇటీవలి కాలంలో వరస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ యూత్ హీరో ఇప్పుడు ఆశలన్నీ పూరి జగన్నాధ్ సినిమా మీదే పెట్టుకున్నాడు. రామ్ కు ఇస్మార్ట్ శంకర్ బ్రేక్ ఇచ్చిన తరహాలో తనకూ ఓ మైల్ స్టోన్ లాంటి మూవీ అవుతుందన్న నమ్మకంతో గట్టిగానే ఉన్నాడు. సరే ఎలాగూ తనకు ఇమేజ్ ఉంది కదాని తమ్ముడు ఆనంద్ దేవరకొండని దొరసానితో లాంచ్ చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. యాక్టింగ్ సంగతి ఎలా ఉన్నా కొత్తదనం లేని కథతో తెలంగాణ బ్యాక్ డ్రాప్ సెంటిమెంట్ ను వాడుకోవడం తేడా కొట్టించింది.
రెండో మూవీ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. వర్ష బొల్లమా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ జరిగినట్టు కూడా ఎవరికీ తెలియనంత సైలెంట్ గా కానిచ్చేశారు. ఇక మూడో ప్రాజెక్ట్ గా ఆనంద్ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడట విజయ్ దేవరకొండ. సందీప్ వంగాతో కలిసి ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రూపొందించే ప్లాన్ తో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ లాకయ్యిందని దర్శకుడితో సహా మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే థియేటర్ల పరిస్థితులు ఇప్పుడప్పుడే నార్మల్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ తెరిచినా ఆనంద్ లాంటి హీరోలు నటించిన బడ్జెట్ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కష్టమే.
ఎవరో ఒకరు ధైర్యం చేసి విడుదల చేసినా రిజల్ట్ ఏదైనా తేడా కొడితే శాటిలైట్ తో పాటు డిజిటల్ హక్కుల రేట్ కూడా అమాంతం తగ్గిపోతుంది. ఇది దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ఇలాంటి హీరోలు డిజిటల్ అవకాశాల వైపు చూస్తున్నారు. ఎలాగూ ఓటిటి మార్కెట్ అంతకంతా పెరుగుతోంది కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రేక్షకులు కూడా వీటికి బాగా అలవాటు పడిపోతున్నారు. ఆహా, జీ5 లాంటి లోకల్ యాప్స్ తక్కువ చందాతోనే ఏడాది పొడుగునా కంటెంట్ ఇచ్చేలా ఆఫర్లతో ఊరిస్తున్నాయి. కాబట్టి సినిమాకు సమాంతరంగా ఇప్పుడో కొత్త మార్కెట్ ఏర్పడింది. స్టార్ డైరెక్టర్లు సైతం వీటి వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే నిర్మాణం అవసరమైతే దర్శకత్వం రెండింటికి సిద్ధమవుతున్నారు. కొత్త ట్రెండ్ కి నాంది పలుకుతున్న డిజిటల్ ప్రపంచంలోకి మెల్లగా అందరూ అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.