iDreamPost
android-app
ios-app

జమ్ము కశ్మీర్‌ ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌

జమ్ము కశ్మీర్‌ ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌

2019లో జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత అక్కడి రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి సమావేశం అయ్యారు. జమ్ము కశ్మీర్‌కు చెందిన 8 రాజకీయ పార్టీల నుంచి 14 మంది నేతలు, నలుగురు ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొని, జమ్ము కశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియను ప్రారంభించడం గురించి చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తితో పాటు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని ఏడు పార్టీలతో కూడిన గుప్కార్‌ అలయెన్స్‌తో పాటు కాంగ్రెస్‌ ఈ సమావేశంలో డిమాండ్‌ చేసింది.

ఇతర పార్టీల అభిప్రాయాలను, స్థానిక మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ అందరం కలిసి జమ్ము కశ్మీర్‌ ప్రజల కోసం, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. జమ్ము కశ్మీర్‌లో నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇదే ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌ అవుతుందని చెప్పారు.

జమ్ము కశ్మీర్‌ను ఒక శాంతి మండలంగా మార్చేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని, సంఘర్షణాయుత వాతావరణం కొనసాగడం తమకూ ఇష్టం లేదని ప్రధాని చెప్పినట్లు పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ చెప్పారు. సమావేశం సంతృప్తికరంగా సాగిందని, జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొలాలన్న విషయాన్ని అంతా ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని తమను కోరారన్నారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జమ్ము కశ్మీర్‌ అప్నీ పార్టీ నేత అల్తఫ్‌ బుఖారీ చెప్పారు.

సమావేశం ఎంతో సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, తాము ఎంతో సానుకూల దృక్పథంతో బయటకు వచ్చామని, జమ్ము కశ్మీర్‌ ప్రజలకు కొంత మేలు జరుగుతుందనే విశ్వాసం కలిగిందని పీపుర్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జాద్‌ లోనే చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో పండిట్‌లకు పునరావాసం కల్పించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, భూ యాజమాన్య హక్కులు పోకుండా స్థానికుల ప్రయోజనాలను కాపాడాలన్న అయిదు డిమాండ్లను తాము సమావేశంలో ప్రస్తావించామని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. పునర్విభజన తర్వాత ఎన్నికలు జరుగుతాయని ప్రధాని చెప్పారని అన్నారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న వారంతా కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు.