వికారాబాద్ జిల్లా రోడ్డు నెత్తురోడింది. బస్సు,లారీ,ఆటో ఒకేసారి ఢీకొనడంతో ఏడుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు, లారీ,ఆటో ఢీకొన్నాయి. కూలీలను ఎక్కించుకుని బయల్దేరబోతున్న ఆటోను లారీ, బస్సు ఒకేసారి ఢీకొనడంతో ఈ ఘోరప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఆటోలోని కూలీలంతా ఇజ్రాచిట్టంపల్లికి చెందినవారిగా గుర్తించారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి సంగారెడ్డివైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతులంతా కూలీలేనని సమాచారం.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.