iDreamPost
android-app
ios-app

మీతో పొత్తా?దండం సార్..అమిత్ షా కు షాక్

  • Published Jan 28, 2022 | 11:28 AM Updated Updated Mar 11, 2022 | 10:21 PM
మీతో పొత్తా?దండం సార్..అమిత్ షా కు షాక్

ఆర్ఎల్డీకి బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. అంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. దానికి ‘మీ ఆహ్వానానికి థాంక్స్.. కానీ మీతో కలిసేది లేదు’ అంటూ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఇచ్చిన సమాధానం ఇపుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో అతి కీలకమైనది ఉత్తరప్రదేశ్. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి రావడం బీజేపీకి చాలా అవసరం. అక్కడి ఫలితాలు భవిష్యత్తులో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి.

దాంతో బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేదు. పైగా ఏడాదికి పైగా సాగిన రైతు ఉద్యమం ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జాట్ వర్గంలో మంచి పట్టున్న రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ ను మచ్చిక చేసుకుని అవసరమైతే ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకునే విధంగా అమిత్ షా ఎత్తులు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మా ద్వారాలు తెరిచే ఉంటాయి

యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాట్లతో సమావేశం నిర్వహించిన అమిత్ షా ఆర్ఎల్డీ అధినేత తప్పుడు మార్గం ఎంచుకున్నారని ఎస్పీతో పొత్తును పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఆ పార్టీకి బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఈ విషయంలో జయంత్ చౌదరికి సలహా ఇవ్వాలని జాట్ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ యూపీలో బీజేపీకి పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఈ ప్రాంతంలో జాట్ల ప్రాబల్యం అధికం. ఈ వర్గంలో మెజారిటీ ప్రజలు వ్యవసాయదారులే. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతు ఉద్యమాన్ని నిరాఘాటంగా నిర్వహించడంలో వీరే ముఖ్యపాత్ర పోషించారు. ఈ ఉద్యమ ప్రభావం, ఎన్డీయేపై వ్యతిరేకత ఇంకా అలాగే ఉన్నాయి. ఎన్నికల్లో అవి ప్రభావం చూపితే బీజేపీ అవకాశాలకు భారీగా గండి పడుతుంది.

యూపీలో మొత్తం 403 స్థానాలు ఉంటే వాటిలో మూడో వంతు అంటే 136 నియోజకవర్గాలు పశ్చిమ యూపీలోనే ఉన్నాయి. జాట్లు వ్యతిరేకంగా ఓటు వేస్తే బీజేపీ కొంప మునుగుతుంది. దాన్ని గుర్తించే.. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు. అందులో భాగంగానే జాట్లలో మంచి పట్టు కలిగిన చౌదరి చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీని వలలో వేసుకోవాలని స్కెచ్ వేశారు.

నన్ను కాదు వారిని పిలవండి

అయితే అమిత్ షా వ్యూహాన్ని జయంత్ చౌదరి తన వ్యాఖ్యలతో తిప్పికొట్టారు. మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు.. కానీ దాన్ని స్వీకరించేందుకు నేను సిద్ధంగా లేను.. అని కౌంటర్ ఇచ్చారు. అలాగే మీరు పిలవాల్సింది నన్ను కాదు.. రైతు ఉద్యమంలో అశువులు బాసిన 700 మందికి పైగా రైతుల కుటుంబాలను అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 13 నెలలు రైతులు ఉద్యమించినప్పుడు.. లఖిమ్ పూర్ ఖేరి ఘటన, హత్రాస్ లో రైతులపై కాల్పులు జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని అమిత్ షాను తీవ్రంగా ప్రశ్నించారు. ప్రలోభాలతో మమ్మల్ని లొంగదీసుకోలేరని, మా నిర్ణయం మారదని జయంత్ స్పష్టం చేశారు. ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని ఆయన అన్నారు.

Also Read : ఒకటి.. రెండు శాతం ఓట్లతో ఫలితం తారుమారేనా?