న్యాయనిర్ణేత తానే అయినట్లు అనునిత్యం జగన్ జైలు కెళ్తే తర్వాత ముఖ్యమంత్రి ఎవరూ అంటూ స్వీయ ఊహాగానాలే వార్తలుగా నమ్మించే ప్రయత్నం
కుటుంబ సభ్యుల , తల్లీబిడ్డల ఆంతరంగిక చర్చలు కూడా తన దివ్యదూరదృష్టితో చూసినట్టు అసత్య కధనాలు వడ్డన .
గబ్బు పట్టించడానికే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారా అని తల్లి విజయమ్మపై ఆగ్రహం వ్యక్తం చేసారంటూ కొనసాగిన స్వయంపాకం . తల్లా , భార్య తేల్చుకోవాల్సిన పరిస్థితి జగన్ ది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు …
సై సినిమాలో రగ్బీ టీమ్ ప్లేయర్స్ గురించి పోలీస్ ఆఫీసర్ ఒక వ్యాఖ్య చేస్తాడు . ఇంటర్వెల్ లో వాళ్ళేం తాగారో కనుక్కోవయ్యా ఇరగదీస్తున్నారు అంటాడు . ఈ డైలాగ్ రాధాకృష్ణకి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది . వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రతి వారం జగన్ జైలుకు వెళ్తాడు , కేసులు జగన్ పీకకి చుట్టుకొంటున్నాయి . మరో రెండు నెలల్లో భవితవ్యం తేలబోతుంది . తర్వాత ముఖ్యమంత్రి ఎవరూ , సీనియర్లు ఆందోళన చెందుతున్నారు , ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు . కారాగారం ప్రభుత్వ కార్యాలయం కావొచ్చు . తర్వాత పదవి చేపట్టబోయేది భారతి అంటూ కధనాలు రాసుకొస్తూనే ఉన్నారు . పాపం ఆయన ఆశలు ఆడియాసలు అవుతూనే ఉన్నాయి .ఐనా పట్టు వదలని రాజు అర్ధరాత్రి శవాన్ని భుజాన వేసుకొని స్మశానం నుండి బయల్దేరిన చందంగా మరుసటి ఆదివారానికి సమాయాత్తం అవుతూ కొంగ్రొత్త రీతిలో జైలు కధనాలు రాస్తూనే ఉన్నారు . ఈ క్రమంలో ఈ వారం మరో వినూత్న కథనం వండి వార్చి తెల్లార్చి ప్రజల పై వదిలారు .
Also Read:హర్షకుమార్ కలలు నెరవేరేనా?
ఈ నెల 2 వ తారీఖు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు జగన్ , షర్మిల విడివిడిగా హాజరవుతారనుకొంటే కలిసి హాజరయ్యారని అయినా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టు కనిపించిందని అలాగే భారతి కొంచెం దూరంగా కూర్చొన్నారని వ్యక్తులు నుంచున్న స్థానాలను బట్టి , ముఖకవళికలు బట్టి పలుకులు సృష్టించే ప్రయత్నం చేసిన తీరు పాఠకులకు వెగటు పుట్టిస్తుంది .
షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టటాన్ని , అక్కడ రాజకీయంగా తీసుకొంటున్న నిర్ణయాలని , వాటి ప్రభావాన్ని గురించి తనదైన శైలిలో ఊహించుకొని రాసిన కథనాలను పక్కన పెడితే తెలంగాణాలో విజయమ్మ పెట్టిన వైఎస్ సంస్మరణ సభతో నన్ను గబ్బు పట్టించదలుచుకొన్నారా అని జగన్ తల్లి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు అంటూ తల్లీ కొడుకుల సంభాషణ తాను దగ్గరుండి విన్నట్టు రాయడం చూస్తే రాధాకృష్ణ బరితెగింపుకు అడ్డూ అదుపు లేదనిపించక మానదు.
జగన్ కేసుల పై ఈడీ విచారణ వేగవంతం అవుతోందని వీటిని అడ్డుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నాడంటూ ఆ ప్రయత్నంలో ఎంత కాలం విజయవంతమవుతాడో , ఆ తర్వాత విచారణ దశ , ఛార్జ్ షీట్ల సమర్పణ , ప్రత్యేక కోర్టు విచారణ పూర్తయ్యే కాలం , న్యాయమూర్తులు తీర్పు చెప్పబోయే సమయం అంతా తనకు తెలిసినట్టు న్యాయ , చట్ట వ్యవస్థలు తన కనుసన్నల్లో పని చేస్తున్నట్టు తేదీలు , నెలలు గణాంకాలతో తుది తీర్పుల వరకూ లెక్కగట్టి చెప్పటం చూస్తే భూత , వర్తమాన , భవిష్యత్ కాలాలలో రాధాకృష్ణకి తెలియంది లేదని పోతులూరి వీరభ్రహ్మం గారు మళ్లీ ఈ రూపంలో జన్మించాడని కొత్తగా కొత్త పలుకులు చదివిన వారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు .ఈ పరిణామాలు బిజెపి నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారనడం కొసమెరుపు .
Also Read:‘దేశం’ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంట
ఇటీవల కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులు శిక్షకి గురికావడం చర్చనీయాంశం అని కోర్టు తీర్పులని ప్రభుత్వం , అధికారులు నిర్లక్ష్యం చేయడం వలన ఈ దుస్థితి దాపురించింది ఇలా ఏ రాష్ట్రంలో కూడా అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోలేదు అంటూ , రాష్ట్ర ప్రభుత్వం తీరు వలనే ఇలా ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు కోర్టు ముందు దోషుల్లా నిలబడాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేశారు కానీ . అధికారులకు కోర్టు శిక్ష విధించటానికి కారణాలు , ఆ సంఘటన కాలం , అందులో ఏ ప్రభుత్వ పాత్ర ఉందన్న విషయాలు మాత్రం వ్యూహాత్మకంగా విస్మరించారు .
తాళ్ళపాక సుబ్బమ్మ అనే మహిళ తనకు పట్టా ఇచ్చిన భూమిని వేరే కేంద్ర సంస్థకు కేటాయించారు అని 2016 లో నాటి టీడీపీ ప్రభుత్వంలోని అధికారులకు మొర పెట్టుకొని ఫలితం లేక లోకాయుక్త నుండి హై కోర్ట్ వరకూ వెళ్లి 2017 లో పరిహారం పొందే విధంగా తీర్పు తెచ్చుకొన్నా కానీ నాటి టీడీపీ ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో మళ్లీ 2018 లో కోర్టు ధిక్కార పిటిషన్వేశారు.
Also Read:పెద్దిరెడ్డి మీద పోటీకి కొత్త “బాబు”ను సిద్ధం చేసిన చంద్రబాబు…
పిమ్మట ఈ నెల తుది తీర్పు ఇచ్చిన కోర్టు అప్పటికే వైసీపీ ప్రభుత్వం డబ్బు చెల్లించడంతో ప్రస్తుత అధికారులని విచారణ నుండి మినహాయించి టీడీపీ హయాంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బాధ్యులుగా అప్పటినుండి కొనసాగుతున్న అధికారులకి ఇప్పుడు శిక్షలు విధించింది.
ఆ విషయాలు మరుగుపరిచి కేవలం శిక్ష పడిన కాలాన్ని చూపిస్తూ ఆ నేరాన్ని వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించే రాధాకృష్ణ వ్యూహ చతురత మీడియా సంస్థలు పెద్దగా లేని తాము చెప్పిందే వేదంగా జనాల్ని నమ్మించిన రోజుల్లో సాగింది కానీ ప్రపంచంలోని ప్రతి మూలనున్న సమాచారం అరచేతిలోకి చేరుతోన్న ఈ రోజుల్లో కూడా అసత్యాలతో ప్రజల్ని నమ్మించలేం అని రాధాకృష్ణకి అవగతమయ్యే వరకూ ప్రతి ఆదివారం ఈ కొత్త పలుకు పేరిట ఉడకని వక్క పలుకులు , నలగని రాతి పలుకులు తప్పవేమో ప్రేక్షకులకు .
Also Read:కోగంటి సత్యం – ఎందుకిలా?