iDreamPost
iDreamPost
యధావిధిగా విక్రమార్కుడు చెట్టు పై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొన్నట్టే ఈ ఆదివారం కూడా కొత్తపలుకు పేరిట తాను తీవ్రంగా వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి పై విషం చిమ్మేయత్నం చేశాడు రాధాకృష్ణ . అయితే పల్లవి మారింది . తానేమీ చెప్పినా కంఠశోషగా మిగులుతుందన్న ఉక్రోశంతో కాబోలు ఈ ప్రజల్లో స్పందన లేదూ , పట్టించుకోవట్లేదూ అంటూ సమాజం పై అసహనం వెళ్లగక్కే ప్రయత్నం చేేశాడు .
సంక్రాంతి సందర్భంగా గుడివాడలో జరిగిన జూదం , ఉద్యోగుల జీతాల పెంపు అంశాల నుండి దృష్టి మళ్లించటానికి కొత్త జిల్లాల ఏర్పాటుని తెరపైకి తెచ్చారని ఓ సరికొత్త వాదన తెర పైకి తెచ్చారు . జిల్లాల ఏర్పాటు విషయంలో కొన్ని చోట్ల ఆందోళనలు జరుగుతున్నా ప్రజల్లో పెద్దగా స్పందనలేదంటూ “అమరావతినే కీళ్లు విరిచేసి మూలన పడేసినా పట్టించుకోని సమాజం ఇది అంటూ అమరావతి పై తనకు , మరికొందరికి ఉన్నంత తపన సమాజానికి లేకుండా పోయిందని అందుకోసం సమాజం ఏ ఆందోళన చేయలేదని తీవ్ర ఆక్రోశం వెలిబుచ్చారు .
నిజానికి రాజధాని ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేదని పలు ప్రజాసంఘాలు , రాజకీయ పార్టీలు విమర్శించినా , అమలులో ఉన్న ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కాదని ప్రయివేటు తరహాలో ల్యాండ్ పూలింగ్ పేరిట రియల్ ఎస్టేట్ మోడల్ లో భూసేకరణకు పూనుకొన్నప్పుడు రైతులకు అన్యాయం జరగొచ్చని , ఇది అక్రమమని పలువురు న్యాయ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా , పలు గ్రామాలు ల్యాండ్ పూలింగ్ పట్ల వ్యతిరేకత వ్యక్తమ్ చేసినా నాటి టీడీపీ ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా తాను అనుకున్నది నెరవేర్చుకొంది .
ఆ రోజు సమాజ వ్యతిరేకత గురించి , ప్రజల నిరసనలు గురించి , రాజధాని ఎంపికలోని , భూసమీకరణలోని లోపభూయిష్ట విధానాల గురించి ఒక్క ముక్క కూడా రాసిన పాపాన పోని రాధాకృష్ణ ఈ రోజు ఉద్యోగుల జీతాల పెంపు ఒక సామాజిక అవసరం అన్నట్టు సమాజం , ప్రజలు ఈ అంశం పట్ల దృష్టి సారించి ప్రభుత్వం పై వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడం తీవ్రమైన నేరం , భయంకరమైన సామాజిక రుగ్మత అన్నట్టు ఎడాపెడా రాసుకోవడం చూస్తే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే సామెత గుర్తుకురాక మానదు .
గుడివాడలో సంక్రాంతి సందర్భంగా క్యాసినో తరహాలో జూదం నిర్వహించారని దీన్ని బట్టి చూస్తే ప్రజల వద్ద పుష్కలంగా డబ్బు ఉందని , కనుక రాష్ట్ర వ్యాప్తంగా జూదశాలలు నిర్వహిస్తే ప్రభుత్వానికి పుష్కలంగా ఆదాయం వస్తుందని చట్టవ్యతిరేకమైన ఉచిత సలహా నొసంగిన రాధాకృష్ణ సంక్రాంతి జూదం లాంటి తీవ్రమైన సమస్యల్ని కూడా పెద్దగా పట్టించుకోని సమాజం కాబట్టి దీనికి సమాజం నుండి వ్యతిరేకత వ్యక్తం కాదు అంటూ తన రాతల్ని పట్టించుకొని టీడీపీకి అనుకూలంగా ఉద్యమించని ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
సంక్రాంతికి కృష్ణా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు , జూదాలు జరగడం ఈ రోజు కొత్త కాదు అనే విషయం రాధాకృష్ణకి తెలియంది కాదు . నిన్నటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పాల్గొన్న చింతమనేని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోడి పందేల్లో పాల్గొన్నానని డబ్బు పోగొట్టుకొన్నానని బహిరంగంగా తనతో చెప్పినా చిద్విలాసంగా నవ్వుతూ మరిన్ని చట్టవ్యతిరేకమైన కార్యకలాపాల గురించి చర్చించాడే కానీ ప్రజా ప్రతినిధి అయ్యుండి మీరిలా నిషేధిత పనులు చేయడం నేరం కదా అని ప్రశ్నించిన పాపాన పోకుండా కేవలం గుడివాడలో జరిగిన జూదాన్ని ఆ సమయంలో హైదరాబాద్లో వైద్యం చేయించుకొంటున్న మంత్రి కొడాలికి అంటగట్టి రభస చేసే ప్రయత్నం అన్నది జనాలకి తెలియదు తాను ఏదిరాస్తే అదేనిజం అని నమ్మాలి అని రాధాకృష్ణ భావిస్తుండవచ్చు . కానీ ప్రజలు , సమాజం అంత అమాయకంగా లేవు మరి .
కాంగ్రెస్ సహా వివిధపార్టీల నుండి 98 మంది ఎమ్మెల్యేలు ,కమ్యూనిస్టు ఉభయపక్షాలు , పలు ప్రజాసంఘాలు , సామాన్య ప్రజానీకం మొత్తం పాల్గొన్న విద్యుత్ బిల్లుల పెంపుకి వ్యతిరేక ఉద్యమాన్ని , చలో బషీర్ బాగ్ పోరాటాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎంత క్రూరంగా అణిచివేసిందో రాధాకృష్ణ వ్యూహాత్మకంగా మరిచిపోయినట్లు ఉన్నాడు కానీ ప్రజలు , సమాజం మర్చిపోలేదు . బషీర్ బాగ్ వస్తే గుణపాఠం నేర్పిస్తా అన్న బాబు ప్రజల్ని గుర్రాలతో తొక్కించి , కాల్పులు జరిపించి ఉక్కుపాదంతో అణిచివేసిన ఘటన ఎప్పటికీ చెరిగిపోని మచ్చ . తాను ఒప్పందం చేసుకొన్న ప్రత్యేక ప్యాకేజీకి వ్యతిరేకంగా ప్రత్యేక హోదాకి అనుకూలంగా విద్యార్థులు ఎవరైనా మాట్లాడితే జైలుకు పంపుతామని హెచ్చరించిన బాబు వ్యాఖ్యలు ఎవరు మర్చిపోతారు .
ఇవన్నీ విస్మరించిన రాధాకృష్ణ నేడు సంక్రాంతి జూదం పట్ల , ఉద్యోగుల జీతం పట్ల , ఎవరికీ పట్టని అంశం అయిన , ఇతర ప్రాంతాల వారు వ్యతిరేకిస్తున్న అమరావతి కేపిటల్ అంశం పట్ల స్పందించలేదని సమాజాన్ని , ప్రజల్ని ఆడిపోసుకోవటం విడ్డూరం . ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా , వ్యతిరేకించినా , ఉద్యమించినా ప్రయోజనం లేకపోగా కష్టాలు తప్పవని తన చర్యల ద్వారా నిరూపించిన చంద్రబాబు నేడు ప్రతిపక్షంలో ఉండేసరికి ఆయనకు మద్దతుగా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించమని రెండున్నరేళ్లుగా ఉద్భోదిస్తున్న రాధాకృష్ణ , బాబు గుణాపాఠాలతో ఉద్యమాల ఊసు మర్చిపోయిన ప్రజలు తమకు అవసరం లేని బాబు అండ్ కో కి అవసరమైన , రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాల పై స్పందించకపోయేసరికి సమాజంలో స్పందన లేదు అంటూ అలవిమాలిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రభుత్వ ఉద్యోగులతో విభేదాలు పెట్టుకొన్న ఎన్టీఆర్ , చంద్రబాబులను ఉద్యోగులు ఓడించారని , ఆ గుణపాఠాలతో 2014 లో బాబు మళ్లీ గెలిచాక ఉద్యోగుల్ని అత్యంత ఆదరంగా చూసి అన్నీ కల్పించినా 2019 లో ఆయన్ని ఓడించారని అలాంటి ఉద్యోగస్తుల తో పెట్టుకొన్న జగన్ కూడా ఓడిపోకతప్పదు అని జోస్యం చెప్పిన రాధాకృష్ణ , ఉద్యోగస్తులు ఉద్యమం చేసినా జగన్ పట్టించుకోడని , పైగా మీ జీతాలు కూడా ఇవ్వకుండా పంచేస్తాడని అందుకని ఇప్పుడు ఉద్యమించకుండా ఇప్పటికి జీతాలు తీసుకొంటూ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్తా చూపాలంటూ అన్యాపదేశంగా బోధించే ప్రయత్నం చేేశాడు .
ఆందోళన వ్యక్తం చేయటం ఉద్యోగస్తుల హక్కు , ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోమని ఉద్యోగస్తులని కోరుతున్నా , ఆందోళన చేస్తున్న ఉద్యోగస్తుల పై ఏ విధమైన కేసులూ పెట్టవద్దు అన్న వ్యాఖ్యల గురించి మాత్రం ప్రస్తావించలేదు . 2019 ఎన్నికల ముందు ఏబీఎన్ చంద్రబాబుతో ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూకి ముందు రాధాకృష్ణ బాబుతో మాట్లాడుతూ ప్రజలు పన్నులు కట్టేది ఆ నా …..కి జీతాలు కట్టడానికా అంటూ చేసిన అసభ్య వ్యాఖ్యల గురించి కూడా నేటి వక్క పలుకుల్లో ప్రస్తావించి ఉంటే సదరు వ్యాసానికి పరిపూర్ణత దక్కేది.