iDreamPost
android-app
ios-app

తెలంగాణ పీసీసీకి చీఫ్ అయినా.. టీడీపీ ముద్ర‌!

తెలంగాణ పీసీసీకి చీఫ్ అయినా.. టీడీపీ ముద్ర‌!

రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీకి అధ్య‌క్షుడు. కానీ, ఆయ‌న మాట‌లు, చేష్ట‌ల‌లో పాత వాస‌న వ‌స్తోంది. అందుకేనేమో రేవంత్ రెడ్డిపై ఇప్ప‌టికీ టీడీపీ ముద్ర వేస్తున్నారు కొంద‌రు నాయ‌కులు. చివ‌ర‌కు కాంగ్రెస్ లోని కొంద‌రు నాయ‌కులు కూడా ఇప్పుడు ఆయ‌న‌ను టీడీపీకి చెందిన మ‌నిషిగానే గుర్తిస్తున్నార‌ట‌. అంతేకాదండోయ్.. సోష‌ల్ మీడియాలో మ‌రో ఆస‌క్తి క‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. టీటీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్‌.ర‌మ‌ణ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. దీంతో తెలంగాణ టీడీపీ ప‌ద‌వి ఖాళీ అయింది. అయితే.. అలా అనుకోవ‌డం పొర‌పాట‌ట‌. కొత్త అధ్య‌క్ష నియామ‌కాన్ని చంద్ర‌బాబు ఎప్పుడో పూర్తి చేశారట‌. ఆయ‌నెవ‌రో కాదు, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి. అని సోష‌ల్ మీడియాలో సెటైరిక‌ల్ ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

తాజాగా తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు కూడా రేవంత్‌రెడ్డిపై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని కొట్టి పారేయొద్ద‌ని నెటిజ‌న్లు సూచిస్తున్నారు. కాంగ్రెస్ ముసుగులో చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ‌లోకి వ‌స్తున్నార‌ని హ‌రీష్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డం కొత్త ఆలోచ‌న‌కు తెర‌లేపింది. అలాగే నగ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా రేవంత్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. రేవంత్‌రెడ్డి కాదు కోవ‌ర్ట్‌రెడ్డి అని ఆమె సెటైర్లు వేశారు. తెలుగుదేశం కోవ‌ర్ట్‌లా కాంగ్రెస్‌లోకి వెళ్లార‌ని రేవంత్‌రెడ్డిపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అంతెందుకు రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించిన వెంట‌నే కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్‌రెడ్డిని చంద్ర‌బాబు మ‌నిషి గానే కాంగ్రెస్ నేత‌లు గుర్తిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలా మాట్లాడ‌ని నేత‌లు మ‌రెంతో మంది ఉన్నారు.

ఏ రకంగా చూసినా రేవంత్‌రెడ్డిలో చంద్ర‌బాబే క‌నిపిస్తున్నాడ‌న్న వ్యాఖ్య‌లు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా ప్ర‌చారం ఇలానే ఉధృత‌మైతే రేవంత్ రెడ్డికే కాదు.. ఇప్ప‌టికే కునుకు పాట్లు ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీకి మ‌రింత న‌ష్టం. ప్ర‌ధానంగా రేవంత్‌రెడ్డి గుర్తించుకోవాల్సిన విష‌యం ఏంటంటే… తాను చంద్ర‌బాబుకు మ‌రో రూప‌మ‌నే అభిప్రాయం నుంచి బ‌య‌ట ప‌డితే త‌ప్ప రాజ‌కీయంగా పుట్ట‌గ‌తులుండ‌వ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. పైగా టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కంపై టీడీపీ శ్రేణుల ఆనందం చూస్తే… మంత్రి హ‌రీష్‌రావు ఆరోపించిన‌ట్టుగా చంద్ర‌బాబు మ‌రోసారి తెలంగాణ‌లో వ‌స్తున్నార‌నే ఎవ‌రైనా న‌మ్ముతారు.