గత మార్చిలో వాయిదా పడిన పురపోరుకు తెర లేచింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక, నగర పంచాయతీలకు వచ్చే నెల 10వ తేదీన పోలింగ్ జరగబోతోంది. 14వ తేదీన లెక్కింపు, ఫలితాల ప్రకటనతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేయడంతో ఆయా పార్టీలు కూడికలు, తీసివేతలల్లో మునిగిపోయాయి. మేయర్, చైర్మన్/చైర్‌పర్సన్ పీఠాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కోర్టు కేసులు, వార్డుల పునర్విభజన పూర్తికాకపోవడం, పంచాయతీల విలీనం అసంపూర్తి వంటి కారణాలతో రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, నెల్లూరు నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగడం లేదు. కాకినాడలో పాలకవర్గం గడువు ఉండడంతో ఎన్నికలు జరగడం లేదు. ఇవే కారణాలతో రాష్ట్ర వ్యాప్తగా 29 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనూ ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు.
ఎన్నికలు ఆగిపోయిన చోట నుంచి తిరిగి ప్రారంభం కానుండడంతో గతంలో నిర్ణయించిన రిజర్వేషన్లే కొనసాగబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం, మొత్తం మీద మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. నగరపాలక సంస్థల్లో మేయర్ పీఠాలు కూడా అందరికి సమ ప్రాధాన్యం దక్కేలా రిజర్వ్ చేశారు. విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్థల మేయర్ స్థానాలు జనరల్ మహిళకు, విశాఖపట్నం బీసీ మహిళకు, గుంటూరు, అనంతపురం జనరల్, తిరుపతి, ఏలూరు జనరల్ మహిళ, విజయనగరం బీసీ మహిళ, ఒంగోలు ఎస్సీ మహిళ, కడప, కర్నూలు బీసీ జనరల్, చిత్తూరు ఎస్పీ జనరల్‌కు కేటాయించారు.
పంచాయతీ పోరు ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. స్వతంత్ర గుర్తులపై పార్టీలకు అతీతంగా సాగిన ఈ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. పల్లె పోరు హోరాహోరీగా సాగుతోంది. అధికార వైఎస్సార్‌సీపీకే పల్లె ప్రజలు పట్టం కడుతున్నారు. గ్రామ పోరు తర్వాత జరగబోతున్న పురపోరులో మాత్రం పార్టీ గుర్తులపైనే ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చేసిన అంకెల గారడీ పురపాలక ఎన్నికల్లో చెల్లబోదు. ఏ పార్టీ ఎన్ని వార్డులు, డివిజన్లు గెలిచింది..? ఏ పురపాలక సంఘం ఏ పార్టీ గెలిచింది..? ఏ కార్పొరేషన్‌లో ఎవరి జెండా ఎగిరింది..? అనే స్పష్టంగా తెలుస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలకు ఈ ఎన్నికలకు అగ్ని పరీక్షలా మారాయి.
టీడీపీ ఉనికి కాపాడుకునేందుకు యత్నిస్తుండగా, అధికార వైఎస్సార్‌సీపీ నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో తమ జెండాను ఎగురవేసేందుకు పావులు కదుపుతోంది. సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో కూడిన పాలన, అర్హతే ఆధారంగా ప్రభుత్వ పథకాలు అందించే విధానంతో.. ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఓటరు నాడి పట్టుకోవడం గతంలో కష్టంగా ఉన్నా.. ఈ సారి అన్ని పార్టీలకు సులువగానే ఓటరు నాడి తెలిసిపోతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ప్రస్ఫుటమైన నేపథ్యంలో.. పట్టణాలల్లోనూ పల్లెలో మాదిరిగా ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయనే విశ్లేషణలు సాగుతున్నాయి.