iDreamPost
iDreamPost
ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావు ఇక లేరు అనే విషయమే కొంత బాధాకరంగా ఉంది. బెజవాడతో ఆయన బంధం అలాంటిది. కర్నాటి లేని బెజవాడను ఊహించుకోవడం కొంచం కష్టమే. సుమారు నాలుగు దశాబ్దాలుగా అనేక వివాదాస్పదమైన అంశాల్లో కర్నాటి రామ్మోహన రావు ప్రమేయం ఉంది. ప్రధానంగా వంగవీటి-దేవినేని ముఠాల మధ్య తగాదాల్లో, కొన్ని హత్యల్లో, రాజీ ప్రయత్నాల్లో కర్నాటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు. ఈ రెండు ముఠాల మధ్య అనేక కీలక సందర్భాల్లో రాజీ కుదర్చడంలో కూడా ఆయన ప్రముఖపాత్ర వహించారు.
ఒకరినొకరు కత్తులతో పొడుచుకునే అంత వైరం ఉన్న వంగవీటి-దేవినేని ముఠాల మధ్య అందరికీ అంగీకారమైన వ్యక్తిగా “పెద్దాయన”గా కర్నాటి చలామణి అయ్యారు. అంతే కాదు అటు వంగవీటి క్యాంపులోనూ, ఇటు దేవినేని క్యాంపు లోనూ అగ్ర నాయకత్వానికే కాదు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వానికి, ఇంకా దిగువస్థాయి కార్యకర్తలకు, అనుచరులకు ఆయన అంటే గౌరవం ఉండేది. అలాగే ఏదైనా వివాదంలో ఆయన జోక్యం చేసుకుంటే రెండు వర్గాల్లో ఏ స్థాయి వారైనా అభ్యంతరం చెప్పేవారు కాదు. బెజవాడ రోడ్లు రక్తం కారుతున్నా రెండు ముఠాల మధ్య చొరవ తీసుకుని మాట్లాడే వెసులుబాటు ఆయనకు ఉండేది.
అయితే ఇప్పుడు ఆ వర్గాలు లేవు. ఆ హత్యలు లేవు.అల్లర్లు లేవు .అయినా ఆ రెండు ముఠాల కార్యకర్తలు, అభిమానులకు కర్నాటి ఇప్పటికీ అభిమాన వ్యక్తే. రెండు ముఠాల్లో కీలకంగా తిరిగిన అనేకమంది అప్పుడప్పుడూ కర్నాటిని కలుస్తూ ఉండేవారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడు కూడా ఒకప్పటి వంగవీటి, దేవినేని వర్గాల నేతలు, కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలోనే ఆయనను సందర్శించి పరామర్శించారు. అదీ ఆయనకు విజయవాడలో ఉన్న గుర్తింపు.
ఈ గొడవల సంగతి ఎలా ఉన్నా విజయవాడ నగరంలో న్యాయవాదిగా చాలా వివాదాస్పద కేసులు ఆయన వాదించారు. ఆయన కోర్టులో వాదనలు వినిపిస్తుంటే చూసేందుకు, వినేందుకు కూడా తోటి న్యాయవాదులు పెద్దసంఖ్యలో హాజరయ్యేవారు. క్రిమినల్ న్యాయవాదిగా అనేక హత్యానేరాల కేసులు ఆయన వాదించారు. చివరిగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీలక్ష్మి హత్యకేసులో ముద్దాయి మనోహర్ తరపున ఆయన వాదించారు. మనోహర్ చేసింది తీవ్రమైన నేరమే అయినప్పటికీ ఉరిశిక్ష విధించే అంతటి నేరం కాదని వాదించారు. ఓ వైపు యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు మనోహర్ ను ఉరితీయాలి అని ఆందోళనలు చేస్తుంటే ఆ ఆందోళనలకు భయపడకుండా ఆందోళనకారుల వత్తిడికి లోనుకాకుండా నిందితుడి తరపున వాదించి న్యాయవాదిగా తన సత్తా చాటుకున్నారు.
ఇక విజయవాడలో హై కోర్టు బెంచి ఏర్పాటు చేయాలనే నినాదంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద ఉద్యమమే కర్నాటి నడిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో అనేక సంవత్సరాల పాటు సాగిన ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు కూడా లభించింది. ఉద్యమం నడుస్తున్న కాలంలో వివిధ వర్గాల ప్రజలను కలిసి విజయవాడలో హై కోర్టు ఏర్పాటు అవసరం వివరించి అందరి మద్దత్తు కూడగట్టడంలో విజయం సాధించారు. ఆయా సందర్భాల్లో అధికార పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలూ కర్నాటి నడుపుతున్న హై కోర్టు ఉద్యమానికి మద్దత్తు ప్రకటించాయి. అయితే 2014లో రాష్ట్ర విభజన కారణంగా ఆయన చిరకాల కోరిక తీరి ఏకంగా హైకోర్టు విజయవాడలో ఏర్పాటయింది. “విజయవాడలో హై కోర్టు ఏర్పాటు స్వాగతించాల్సిందే కానీ అది రాష్ట్ర విభజన వల్ల సాధ్యపడడం కాస్త బాధాకరం” అంటూ హై కోర్టును స్వాగతిస్తూ, విభజనను వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆయన ఓ మీడియా ప్రతినిధితో చేసిన వ్యాఖ్య ఆయన ఆలోచనలకు అద్దం పడుతుంది.