iDreamPost
android-app
ios-app

1983 World Cup Final, 83 Movie – నేడు చూడండి 83

  • Published Dec 24, 2021 | 5:46 AM Updated Updated Dec 24, 2021 | 5:46 AM
1983 World Cup Final, 83 Movie – నేడు చూడండి 83

సింహాలను చిట్టెలుకలు ఢీ కొట్టి గెలవడం ఊహకందదు. కలలో కూడా సాధ్యం కాని విషయం. కాని 1983లో భారత క్రికెట్‌ జట్టు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రపంచకప్‌ ఆడేందుకు వెళ్లిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్‌ జట్టును ఓడించి ప్రపంచ క్రీడారంగాన్ని సంభ్రమాశ్ఛర్యాలకు గురి చేసింది. 

విశ్వవిఖ్యాత ఆటగాళ్లు ఉన్న వెస్టిండీస్‌ జట్టు మీద నాడు పసికూనగా ఉన్న భారత జట్టు గెలవాలని సగటు అభిమాని దేవుడిని కోరుకుని ఉంటాడు కాని. గెలుస్తుందని నమ్మినవారు మాత్రం ఒక్కడు కూడా లేరు. కాని వారి అంచనాలను తలక్రిందులు చేసి భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. 1983 ప్రపంచ కప్‌ గెలుపు కథాంశంగా 83 సినిమా ఈనెల 24వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో డబింగ్‌ చేసిన ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలవుతుంది. నేపథ్యంలో 1983లో భారత జట్టు ఫైనల్‌ విజయం నాటి క్రీడాభిమానులనే కాదు.. ప్రస్తుత క్రికెట్‌ ప్రేమికులను కూడా అలరిస్తూనే ఉంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో నాటి విజయం మరోసారి కళ్ల ముందు హల్‌చల్‌ చేస్తోంది. 

1983 జూన్‌ 25వ తేదీ. మూడవ ప్రపంచ కప్‌ (ప్రుడెన్షియల్‌ కప్‌) ఫైనల్స్‌. క్రికెట్‌ మక్కాగా పిలిచే ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌ స్టేడియం. అరవీర భయంకరమైన జట్టుగా పేరుగాంచిన వెస్టిండీస్ జట్టు ఒకవైపు… క్రికెట్‌లో పసికూనలుగా ఉన్న భారత్‌జట్టు మరోవైపు. అప్పటికే వరుసగా రెండు ప్రపంచ్‌ కప్‌లు గెలిచిన వెస్టిండీస్‌ను ఓడించడం అంటే మాటలు కాదని ప్రతి క్రీడాకారునికీ తెలిసిందే. పైగా గార్డెన్‌ గ్రీనిజ్‌, డెస్మండ్‌ హేన్స్‌, వివి రిచర్డ్స్‌, క్లైవ్‌ లాయిడ్‌, లారీ గోమ్స్‌, బచూస్‌, డూజాన్‌ వంటి ప్రఖ్యాత బ్యాట్స్‌మెన్‌లు, ఆన్డీ రాబట్స్‌, జోయల్‌ గార్నర్‌, మల్కమ్‌ మార్షల్‌, మైకెల్‌ హోల్డింగ్‌ వంటి ఆరవీర భయంకరమైన బౌలర్లు మరోవైపు.

Also Read : భారత జట్టు మొదటి క్రికెట్ టెస్టు ఆడిన రోజు

వెస్టిండీస్ బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ చూసినవారికి వారి గెలుపు మీద పెద్దగా అనుమానాలు లేవు. మరోవైపు భారత జట్టులో సునీల్‌ గవాస్కర్‌, శ్రీకాంత్‌, మహీంద్ర అమర్నాథ్‌, యెస్‌పాల్‌ శర్మ, సందీప్‌ పాటిల్‌, కపిల్‌ దేవ్‌, కీర్తి ఆజాద్‌ వంటి బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా వీరిలో కపిల్‌దేవ్‌, శ్రీకాంత్‌, సందీప్‌ పాటిల్‌ మాత్రమే కాస్త ధాటిగా బ్యాటింగ్‌ చేసేవారు. బౌలింగ్‌లో కపిల్‌దేవ్‌, బల్విందర్‌లు మాత్రమే ఫాస్ట్‌బౌలర్లు, అమర్నాథ్‌, బెన్నీ, మదన్‌ లాల్‌లు కేవలం మీడియం ఫేసర్లు మాత్రమే.

వెస్టిండీస్ జట్టు అప్పటికే వరుసగా 1975, 1979 వరల్డ్‌కప్‌లు గెలవగా, భారత్‌ జట్టు 1975 ప్రపంచ్‌ కప్‌లో గ్రూప్‌ ఏ లో మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఈస్ట్‌ ఆఫ్రికాపై గెలిచింది. 1979 వరల్డ్‌ కప్‌లో భారత్‌ జట్టు గ్రూప్‌-బి లో మూడు మ్యాచ్‌లు ఆడి మూడుసార్లు ఓటమి చెందింది. ఈ రెండు జట్ల బలాబలాలు తెలిసివారు ఎవరైనా గెలుపు వెస్టిండీస్‌దే అనే నమ్మకం.

భారత బ్యాటింగ్‌ అనుకున్నట్టుగానే చాలా తక్కువ స్కోర్‌కు కుప్పకూలింది. 54.4 ఓవర్లకు కేవలం 183 పరుగులు చేసింది. శ్రీకాంత్‌ 38 టాప్‌ స్కోరర్‌. అమర్నాథ్‌ 26 పరుగులు, పాటిల్‌ 27 పరుగులు చేశారు. తరువాత అత్యధిక స్కోర్‌ ఎక్స్‌స్ట్రాస్‌ 20 పరుగులు కావడం గమనార్హం. 

వెస్టిండీస్ బౌలింగ్‌కు భారత్‌ దాసోహం అయ్యింది. 

అప్పట్లో 60 ఓవర్ల మ్యాచ్‌. వెస్టిండీస్ గెలిచేందుకు 60 ఓవర్లలో 184 పరుగులు చేయాల్సి ఉంది. అంటే ఓవర్‌కు సగటున 3.06 మాత్రమే.వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చూసివారిని ఇది అతి సాధారణమైన టార్గెట్‌. కానీ ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. భారత్‌ మీడియం ఫేసర్ల స్వింగ్‌ బౌలింగ్‌కు వెస్టిండీస్ జట్టు చేతులు ఎత్తేసింది. రిచర్డ్స్‌ ఔటయ్యే వరకు గెలుపు వెస్టిండీస్‌ వాకిట ఉంది. ఎప్పుడైతే రిచర్డ్స్‌ ఔటయ్యాడో అప్పటి నుంచి ఆ జట్టు పతనం ఆరంభమైంది.చివరకు వెస్టిండీస్ జట్టు 52 ఓవర్లలో కేవలం 140 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.

Also Read: 144 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో మూడవ పర్ఫెక్ట్ టెన్

– వీవీ రిచర్డ్స్‌ 33 పరుగులతో వీరవిహారం చేస్తుండగా, అతని లెగ్‌సైడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను 30 మీటర్లు పరుగుతీసి భారత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అందుకున్నాడు. ఇదే భారత్‌ జట్టు విజయానికి కారణమైంది. కపిల్‌ ఈ క్యాచ్‌ పట్టడం ద్వారా కప్‌ అందుకున్నాడు.

-వెస్టిండీస్‌ కెప్టెన్‌ క్లైవ్‌ లాయిడ్‌ తొడకండరాలు పట్టివేయడం కూడా ఇండియా గెలుపునకు దోహదపడింది. అతను ఫైనల్స్‌లో మాత్రం కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.

– ఫైనల్స్‌లో గెలుపునకు మదన్‌లాల్‌, అమర్నాథ్‌ బౌలింగ్‌ కారణమైంది. ఇద్దరికీ చెరో మూడు వికెట్లు సాధించారు.

– భారత జట్టుకు చెందిన రోజర్‌ బిన్నీ ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఆయన 18 వికెట్లు తీశాడు. మరో భారతీయ బౌలర్‌ మదన్‌లాల్‌ 17 వికెట్లు తీయడం విశేషం.

– లీగ్‌ దశలో జింబాబ్వే మీద భారత్‌ జట్టు కేవలం 17 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ విజృంభించి 138 బంతులలో 175 పరుగులు (16×4, 6×6) చేశాడు. చాలా కాలం వరల్డ్‌కప్‌లో ఇదే వ్యక్తిగత అత్యధిక స్కోర్‌గా నిలిచింది. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి ఉండకపోతే సెమీస్‌కు అర్హత సాధించకుండా పోయేది.

– ఈ ప్రపంచ్‌ కప్‌లో కపిల్‌దేవ్‌ 303 పరుగులు చేశాడు. భారత్‌ తరపున అతనే అత్యధిక పరుగులు.

-వెస్టిండీస్‌ జట్టు గెలిచి ఉంటే వరుసగా మూడుసార్లు కప్‌ గెలిచి హ్యాట్రిక్‌ సాధించేది. ప్రపంచకప్‌ను వరుసగా మూడుసార్లు గెలుచుకున్న జట్టుగా ఆస్ట్రేలియా ఆ ఘనత సాధించింది. 1999, 2003, 2007లలో విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకుంది.

-వెస్టిండీస్‌ కెప్టెన్‌ క్లైవ్‌ లాయిడ్‌ సైతం మూడుసార్లు కప్‌ అందుకున్న కెప్టెన్‌గా రికార్డు సృష్టించేవాడు. కాని అవకాశం దక్కలేదు. కేవలం 1975, 1979 వరల్డ్‌కప్‌లను మాత్రమే అందుకున్నాడు. మళ్లీ అటువంటి ఘనత సాధించిన వ్యక్తి ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్‌దే. ఆయన 2003, 2007లో కెప్టెన్‌గా ట్రోపీ అందుకున్నారు.

-వెస్టిండీస్‌ మూడవ వరల్డ్‌ కప్‌ చేజార్చుకోవడమే కాదు… తరువాత జరిగిన వరల్డ్‌ కప్‌లలో ఎప్పుడూ విజేతగా నిలవలేదు.

– ఒక విధంగా భారత్‌లో క్రికెట్‌ ప్రధాన క్రీడగా మారడానికి, అత్యంత ప్రజాదరణ కలిగిన ఆటగా నిలవడానికి 1983 గెలుపే కారణం అంటే అతిశయోక్తి కాదు. టీవీల్లోను, సోషల్‌ మీడియా లోనూ నాటి మ్యాచ్‌ వస్తుందంటే చూడని భారతీయ క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో 83 సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read : టెస్టు క్రికెట్ లో పది లక్షలపరుగు సాధించిన రోజు