iDreamPost
iDreamPost
ఒక బాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా మరో లాంగ్వేజ్ లోనూ అదే స్థాయి విజయం దక్కించుకుంటుందన్న గ్యారెంటీ లేదు . కాకపోతే క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆయా ఆడియన్స్ టేస్ట్ కి సూటవుతుందా లేదా చూసుకోవాలి. అలాంటిదే ఈ ఉదహరణ. 1994లో ఆలి హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తెలిసిందే. స్టార్ హీరోల పోటీని తట్టుకుని మరీ అది సాధించిన రికార్డులు చూసి ట్రేడ్ సైతం నివ్వెరబోయింది. అందులో కామెడీ, పాటల కోసం పదే పదే చూసినవారు ఎందరో. దెబ్బకు కొన్నేళ్ళ పాటు ఆలి హీరో వేషాలు వేస్తూనే ఉన్నాడు. అంతలా దాని ప్రభావం ఉండిపోయింది.
దీన్ని హిందిలో రీమేక్ చేసే ఉద్దేశంతో సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ బ్యానర్ కోసం హక్కులు కొనేశారు. ఇది యమలీల షూటింగ్ కు వెళ్ళడానికి ముందే జరిగిపోయింది. కథలో దమ్ము కృష్ణ గారు ముందే పసిగట్టారు. రిలీజయ్యాక దీని మీద రామానాయుడు గారు మనసు పడ్డారు. వెంకటేష్ హీరోగా హిందిలో తీయాలని హక్కుల కోసం కృష్ణ గారిని కలిస్తే ఎక్కువ ఆలోచించకుండ ఓకే అనేశారు. ఆ టైంలో కృష్ణారెడ్డి యమాబిజీగా ఉండటంతో దర్శకుడిగా కే మురళీమోహనరావుని తీసుకున్నారు. ఈయనకు అప్పటికే సురేష్ సంస్థలో మంచి అనుభవం ఉంది. చంటి రీమేక్ అనారితో ఈయనే హిట్టు ఇచ్చారు. చిరంజీవి కొదమసింహం లాంటి భారీ వెంచర్లను డీల్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది .
హీరొయిన్ గా రవీనాటాండన్, యముడిగా ఖాదర్ ఖాన్, చిత్రగుప్తుడిగా ఆశ్రాని ఫిక్సయ్యారు. సంగీతం ఆనంద్ మిలింద్ సమకూర్చారు. అనుపం ఖేర్, శక్తి కపూర్ ఇలా తారాగణాన్ని భారీగానే తీసుకున్నారు. వెంకటేష్ అప్పటికే చంటి రీమేక్ అనారి ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితుడు కావడంతో మార్కెట్ పరంగా ఇబ్బంది కలగలేదు. కాని అనూహ్యంగా తక్దీర్ వాలా ఆశించిన విజయం సాధించలేదు. వెంకీని ఆ పాత్రలో రిసీవ్ చేసుకోలేకపోయారు. చంటి తరహాలోనే అమాయకత్వం ఉన్న పాత్ర కాబట్టి కనెక్ట్ అవుతుందనుకున్న నాయుడు గారి లెక్క గురి తప్పింది. తెలుగులాగా నార్త్ లో యముడి సినిమాలు అంతగా ఆడవు. ఆయన మీద చేసే కామెడీ వాళ్ళు ఎక్కువ రిసీవ్ చేసుకున్న దాఖలాలు లేవు. అందుకే ఏ సన్నివేశం మార్చకుండా మక్కీకి మక్కీ తీసినా యమలీల హిందీ రీమేక్ యావరేజ్ ముద్రతో బయటపడింది. ఆ తర్వాత వెంకటేష్ మళ్ళీ నేరుగా ఇంకో బాలీవుడ్ మూవీ చేయనేలేదు.