iDreamPost
android-app
ios-app

ఆ మాజీ హీరోయిన్ ఎంపీ పదవి ఉంటున్నట్టే

  • Published Jun 22, 2021 | 10:29 AM Updated Updated Jun 22, 2021 | 10:29 AM
ఆ మాజీ హీరోయిన్ ఎంపీ పదవి ఉంటున్నట్టే

టాలీవుడ్ మాజీ హీరోయిన్ నవనీత్ కౌర్ ఎంపీ పదవికి తాత్కాలికంగా గండం తప్పింది. ఆమె కుల సర్టిఫికెట్ వివాదంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో ఆమె ఎస్సీ సర్టిఫికెట్ చెల్లదంటూ బొంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నవనీత్ కౌర్ రాణా సుప్రీంకోర్టు ని ఆశ్రయించడంతో ఊరట దక్కింది. అమరావతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆమె పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. ఆమెపై పోటీ చేసి ఓటమి పాలయిన శివసేన అభ్యర్థి ఫిర్యాదుతో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఆమె సర్టిఫికెట్ చెల్లదంటూనే రూ. 2లక్షల జరిమానా కూడా విధించింది.

సుప్రీంకోర్టులో ద్విసభ్య బెంచ్ ఆమెకు ఉపశమనం కల్పించే తీర్పుని వెలువరించడంతో ఆమె పదవికి ప్రస్తుతానికి ఢోకా లేదని చెప్పవచ్చు. జస్టిస్ వినీత్ శరణ, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడా బెంచ్ నుంచి ఈమేరకు స్టే ఉత్తర్వులు వెలువడ్డాయి. దాంతో జూన్ 8న బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు నిలిచిపోయింది.

నవనీత్ కౌర్ గతంలో పలు తెలుగుసినిమాల్లో నటించారు. బాలకృష్ణ సహా పలువురి హీరోల సరసన ఆమె హీరోయిన్ పాత్రలను పోషించారు. ఆమె బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించడంతో ఆమెకు సినీ అభిమానుల్లో గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె విదర్భ ప్రాంతానికి చెందిన రవి గంగాధర్ రానాని వివాహమాడారు. 2011లో వారి వివాహం జరిగింది. రవి రానా మూడు సార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014, 19 ఎన్నికల్లో ఆయన వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. అమరావతి ప్రాంతంలో గుర్తింపు ఉన్న నాయకుడు.

2014లో అమరావతి ఎంపీ సీటుకి ఎన్సీపీ మద్ధతుతో నవనీత్ బరిలో దిగి ఓటమి పాలయ్యారు. కానీ గత సాధారణ ఎన్నికల్లో ఆయన తన భార్య నవనీత్ కౌర్ ని అమరావతి పార్లమెంట్ బరిలో దింపారు. 35 ఏళ్ల నవనీత్ కౌర్ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్, ఎన్సీపీ మద్ధతుతో శివసేన అభ్యర్థిని ఓడించారు. ఆ తర్వాత పార్లమెంట్ లో కూడా నవనీత్ కౌర్ పలుమార్లు ఆకట్టుకున్నారు. ఆమె ఉపన్యాసాలు పలువురి ప్రశంసలు పొందాయి. ఒక సందర్భంలో పార్లమెంట్ లో జై శ్రీరామ్ అంటూ నినదాలు చేస్తున్న బీజేపీ సభ్యులనుద్దేశించి ఇది రామాలయం కాదు, పార్లమెంట్ అంటూ ఆమె విరుచుకుపడిన తీరు విశేష ప్రచారం పొందింది.

ఆమె కుల సర్టిఫికెట్ వివాదం పలుమలుపులు తిరుగుతున్న తరుణంలో తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ని నవినీత్ రానా వర్గీయులు ఆహ్వానిస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మహిళా నేత నవనీత్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఉత్తరాఖండ్ సీఎంకు పదవీ గండం