iDreamPost
android-app
ios-app

కుమారస్వామి జోస్యం.. నమ్మకమా.. ఓవర్ కాన్ఫిడెన్సా?

  • Published Jun 26, 2021 | 10:13 AM Updated Updated Jun 26, 2021 | 10:13 AM
కుమారస్వామి జోస్యం.. నమ్మకమా.. ఓవర్ కాన్ఫిడెన్సా?

కర్ణాటకలో తప్ప మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాలే. అక్కడ మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ప్రజ‌లు ప్రాంతీయ పార్టీనే ఎన్నుకుంటార‌ని ఆ రాష్ట్ర మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార స్వామి జోస్యం చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని పరోక్షంగా చెప్పారు. ఢిల్లీలో కూర్చుని పాలన సాగించేవారు వద్దని, రాష్ట్రంలోనే ఉండి పాలన సాగించే వారు ప్రజలకు కావాలని అన్నారు. రెండేళ్లలో జరగనున్న ఎన్నికలకు కుమారస్వామి ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. బలమైన ‘లోకల్’ అస్త్రాన్ని జనంపైకి వదులుతున్నారు.

ఢిల్లీ కీలుబొమ్మ వద్దనుకుంటున్నారు..

కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. ఆ అధికార ‘బలం’తోనే జేడీఎస్, కాంగ్రెస్ కూటమి సర్కారును రెండేళ్ల కిందట కూల్చేసింది. యడ్యూరప్పను సీఎంను చేసింది. ఇప్పుడు ఆయన ఉంటారో, ఊడుతారో తెలియని పరిస్థితి. ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న అన్నిరాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. పై నుంచి వచ్చే ఆదేశాలను బట్టే ఏ నిర్ణయమైనా ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని కుమారస్వామి లేవనెత్తుతున్నారు. ఢిల్లీ కీలుబొమ్మలు వద్దంటున్నారు. దేశ రాజధానిలో కూర్చుని క‌ర్ణాట‌క‌ను పాలించే వాళ్లు కావాలని ప్రజ‌లు కోరుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు. స్థానికులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం కావాలని, రాష్ట్ర సమస్యలు తెలిసిన పార్టీ పాలన రావాలని పిలుపునిస్తున్నారు. అయితే ఇందుకు ప్రజల నమ్మకాన్ని తాము గెలవాల్సి ఉందని అంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేసే పార్టీలు వద్దని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుందనే భరోసాను జనంలో నింపాల్సి ఉందంటున్నారు. రాష్ట్రం నుంచే, రాష్ట్రానికి చెందిన వ్యక్తుల ఆధ్వర్యంలోనే పాలన సాగుతుందని పేర్కొంటున్నారు. అవును మరి.. స్థానికంగా ఉండే నేతలకే స్థానిక సమస్యలు తెలుస్తాయి. కొందరు నేతలు చెప్పిన మాటలు వినడం తప్ప.. ఢిల్లీలో కూర్చునే పెద్దలకు ఇంకేం తెలుస్తాయి.

Also Read : ప్రత్యర్థులపై, వ్యవస్థలపై ఇందిర వేసిన బెత్తం దెబ్బే ఎమెర్జెన్సీ

ప్రధాన ప్రాంతీయ పార్టీ జేడీఎస్సే.. కానీ

కర్ణాటకలో ప్రధాన రీజనల్ పార్టీ జేడీఎస్ నే. కానీ 1999లో జేడీఎస్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడి ప్రజలు ఆ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. అంతకుముందు 1994లో ‘జనతాదళ్’ను దేవెగౌడ 115 సీట్లతో అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత జేడీఎస్ ఎప్పుడూ 60 సీట్లకు మించి గెలవలేదు. కాంగ్రెస్, బీజేపీ అధిక సీట్లు సాధించగా.. జేడీఎస్ మూడో స్థానంలో నిలిచేది. కొన్ని సందర్భాల్లో కీలక పార్టీగా మారేది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 100కు పైగా సీట్లు సాధించినా.. 80 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ సహకారంతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ కు వచ్చిన సీట్లు కేవలం 37. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుండటం, బీజేపీపై ఏడాదిన్నరగా వ్యతిరేకత వస్తుండటం, యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు, పాలనలో ఆయన కొడుకుల పెత్తనంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు… తదితరాలన్నీ కుమారస్వామి తాజా వ్యాఖ్యలకు కారణం కావచ్చు. కానీ రెండు జాతీయ పార్టీలను ఢీకొట్టి అధికారం సాధించడమనేది కుమారస్వామికి మామూలు విషయం కాదు.

ఈ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు దిక్కు లేదు

ఏపీ, తెలంగాణ‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడులో కాంగ్రెస్, బీజేపీల‌ను ప్రజ‌లు తిర‌స్కరించార‌ని కుమారస్వామి చెప్పారు. నిజానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏపీ, కేరళలో ప్రాతినిథ్యం సున్నా. గతంలో అధికారంలో ఉన్న చరిత్ర కూడా లేదు. ఇక కాంగ్రెస్.. 2014 ముందు దాకా ఉమ్మడి ఏపీలో, కేరళలో అధికారంలో ఉండింది. కానీ అడ్డుగోలుగా ఏపీ రాష్ట్ర విభజన చేసి.. తన సమాధి తానే కట్టుకుంది. కేరళలో అవినీతిలో మునిగిపోయి వరుసగా రెండో సారి అధికారానికి దూరంగా ఉంది. ఇక తమిళనాడులో డీఎంకేకి తోకపార్టీగా కొనసాగుతోంది. కానీ కర్ణాటకలో మాత్రమే భిన్నమైన పరిస్థితి. కాంగ్రెస్, బీజేపీలు అక్కడ బలమైన పార్టీలు. జేడీఎస్ ది మాత్రం కింగ్ మేకర్ పాత్ర. ఈ నేపథ్యంలో కుమారస్వామి చేసిన కామెంటు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Also Read : చంద్రబాబు ను మ‌రిచిపోయారా?