iDreamPost
android-app
ios-app

అదే ముప్పును పెంచుతోందా?

  • Published Aug 31, 2020 | 4:44 AM Updated Updated Aug 31, 2020 | 4:44 AM
అదే ముప్పును పెంచుతోందా?

కోవిడ్‌ 19 ఏపీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీగానే కేసులు నమోదువుతున్నాయి. ఇందుకు కారణమేంటి? ప్రస్తుతం ఇదే అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. నిజానికి లాక్డౌన్‌ ఎత్తేసాక అతి తక్కువ కేసులతో అంతా సేఫ్‌ అనే స్థితిలోనే రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. కానీ నేడు నాలుగు లక్షలకుపైగా కేసులతో అంకెలు చూస్తేనే గుండెగుభేల్‌మనే స్థాయికి చేరుకున్నాము. రోజూ దాదాపు పదివేలకుపైగా పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా పాజిటివ్‌లను ట్రేస్‌ చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి రోజు దాదాపు అరవైవేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తూ విస్తృతంగా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసింది.

ఇంత వరకు ప్రభుత్వం తన బాద్యతను సమర్థవంతంగా నెరవేరుస్తోంది. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరగడానికి కారణమేంటన్న ఆలోచనే అందరిలోనూ నెలకొంది. ఇందుకు కొందరు నిపుణుల అభిప్రాయం మేరకు ప్రజల నిర్లక్ష్యమేనని సమాధనమిస్తున్నారు. తెలిసి కొందరు, తెలియక కొందరు ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు అవుతున్నారన్నది వారి వాదన. వారి వాదనలోనూ నిజమేనన్న అభిప్రాయం జనం నుంచి కూడా వ్యక్తమవుతోంది.

ఉదాహరణకు ఒక వ్యక్తికి కోవిడ్‌ 19 పాజిటివ్‌ వచ్చింది. అతను క్వారంటైన్‌లో ఉన్నాడు. అతనికి క్లోజ్‌ కాంటాక్ట్స్‌లో ఉన్నవారు ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి, లక్షణాలు లేకపోతే కనీసం 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి కానీ అది పూర్తిస్థాయిలో పాటించడం లేదు. దాదాపు 90శాతం మంది తమ ఇంట్లో వారికి పాజిటివ్‌ అని తెలిసినప్పటికీ బైట తిరుగుతున్నారు. దీంతో వారు వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు.

క్వారంటైన్‌లో చికిత్స అనంతరం నెగటివ్‌ రిపోర్టు వచ్చినప్పటికీ మరో ఏడు రోజులు ఇంటి పట్టునే ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. కానీ అది కూడా ఎవ్వరూ పాటించడం లేదు. క్వారంటైన్‌ నుంచి వచ్చి నేరుగా తమ రోజువారీ కార్యకలాపాల్లో మునిగిపోతున్నారు.

జన సమూహాల్లోకి వెళ్ళొద్దని సూచిస్తున్నారు. కానీ ఎవ్వరూ దీనిని పాటించడం లేదు. మాస్కు వాడకంలో కూడా తీవ్ర నిర్లక్ష్యమే కన్పిస్తోంది. గడ్డానికిగానీ, జేబులోగానీ, మోటారు సైకిల్‌కు గానీ మాస్కును తగిలించి, విచ్చలవిడిగా బైట తిరుగుతున్నవారు కోకొల్లలుగా కన్పిస్తున్నాయి.

వీరు కాకుండా ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుని, గుట్టు చప్పుడు కాకుండా మందులు వాడేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారు ఇంకొందరు ఉంటున్నారు. వైద్యులు చెబుతున్న దానిని బట్టి వైరస్‌ పాజిటివ్‌గా గుర్తించడానికి ముందే దాదాపు వారం రోజులుగా సదరు వ్యక్తులు ఇతరులకు వైరస్‌ను వ్యాపించగలుగుతారు. మందులు వాడుతున్నప్పటికీ ఇతరులకు అంటుకునే స్థాయిలోనే రోగులలో వైరస్‌ ఉంటుంది. అందువల్లనే 14 రోజుల చికిత్స అనంతరం మరో ఏడు రోజులు ఇంటి పట్టునే ఉండాలని వైద్యులు చెబుతున్నారు కానీ ఇవేమీ పట్టించుకుంటున్న దాఖలాల్లేవు.

ప్రభుత్వం చేస్తున్న ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే పాజిటివ్‌గానే పరిగణించాలి. ఒక వేళ నెగటివ్‌ వస్తే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి, అప్పుడు కూడా ఎటువంటి లక్షణాలు లేకపోతే మాత్రమే నెగటివ్‌గా భావించాలి. కానీ నెగటివ్‌ రిజల్ట్‌ వచ్చిన వెంటనే బైట తిరగడం మొదలు పెడుతున్నారు. అటువంటి వారిలో కొందరికి 7నుంచి 10 రోజులలో లక్షణాలు కన్పిస్తున్నాయి. అప్పటికే వీరి కారణంగా పలువురు వైరస్‌ భారిన పడి ఉంటున్నారు. దీంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా పెడచెవిన పెట్టారు. సెప్టెంబర్‌ 1 నుంచి లాక్డౌన్‌లో మరిన్ని నిబంధనలను సరళతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వారికో, వారికి అత్యంత సన్నిహితులకో ఆరోగ్య ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఇప్పటి వరకు ఎలా ఉండాలో ప్రభుత్వాలు చెప్పాయి. ఇకపై ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది తామేనన్నది ప్రజలు ఒప్పుకోవాల్సిన వాస్తవం.