Idream media
Idream media
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటాయి. అయినా జనం ఎక్కడా ఆందోళన చెందకుండా సాధారణ కార్యకలాపాలవైపు నడుస్తున్నారు. అందుకు కారణం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, కరోనా కట్టడికి సంబంధించి దేశంలోనే ఏపీ అత్యున్నత పేరు పొందడం గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53 లక్షల మంది నుంచి నమూనాలు సేకరించారు. ఈ స్థాయిలో పరీక్షలు చేసిన రాష్ట్రమూ ఏదీ లేదు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 71 వేలు మాత్రమే. అలాగే బాధితులకు చికిత్స అందించడంలో చేపడుతున్న చర్యలు కారణంగా మరణాల రేటు కూడా తక్కువే ఉంది. పరీక్షల సంఖ్యలోనే ఆక్సిజన్ ను సమకూర్చుకోవడంలోనూ ఏపీ ముందంజలో ఉంది.
అవసరమైనంత ఆక్సిజన్
కొవిడ్ సోకిన రోగులు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందకపోతే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాలు సరిపడనంత ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మొదటి నుంచీ కరోనా వైద్యానికి సంబంధించిన చర్యలు తీసుకోవడంలో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సిన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో అవసరమైనదాని కంటే రెండు రెట్లు అధికంగా ఆక్సిజన్‌ను నిల్వ చేసి కోవిడ్ బాధితులకు భరోసా కల్పిస్తోంది. ఆస్పత్రులకు వస్తున్న కోవిడ్ రోగుల్లో చాలామంది ఆక్సిజన్ అవసరంతో వస్తున్నవారే. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. రాష్ట్రంలో రోజుకు 150.91 మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా.. దీనికి అదనంగా మరో 302.6 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కలిపి మొత్తం 453.51 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. దీనికి అదనంగా ఆస్పత్రుల్లో మరో 7,270 ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. రోగులకు సకాలంలో ఆక్సిజన్‌ను అందిస్తుండటంతో కోవిడ్ మరణాలను ప్రభుత్వం నామమాత్రానికి పరిమితం చేయగలిగింది.
అన్ని వివరాలూ బహిర్గతమే…
కరోనా పరీక్షలు, కేసులు, మరణాలకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న ఆరోపణలు చాలా రాష్ట్రాలలో గుప్పుమంటున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఎక్కడా ఆ వార్తలు లేవు. జగన్ ఆదేశాలతో అధికారులు ఎప్పటికప్పుడు అన్ని వివరాలనూ బహిర్గతం చేస్తున్నారు. ఆక్సిజన్ నిల్వలకు సంబంధించి కూడా అంతే. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పైప్‌లైన్‌ల లక్ష్యం 31,409 కాగా ఇప్పటివరకు 28,072 లైన్లు పూర్తి చేశారు. ఇందులో ప్రైవేటులో 10,017 లైన్లు, ప్రభుత్వ పరిధిలో 18,055 లైన్లు పూర్తయ్యాయి. మరో 3,337 లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదయ్యే నాటికి రోజుకు కేవలం 93.5 కిలోలీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం మాత్రమే ఉండేది. ఇప్పుడా సామర్థ్యాన్ని రోజుకు 281 కిలోలీటర్లకు పెంచారు. మరో 105 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 18,609 పడకలు ఆక్సిజన్ సౌకర్యంతో ఉన్నాయి. రోగులు ఏ సమయంలో ఆస్పత్రులకు వచ్చినా ఆక్సిజన్ పడకలు లేవనే మాట వినిపించకుండా ఎక్కువ పడకలు ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నీ ఏపీలో మరణాల రేటును తగ్గిస్తున్నాయి.