iDreamPost
android-app
ios-app

ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ రాజీనామా వెనుక‌..?

ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ రాజీనామా వెనుక‌..?

ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ రాజీనామాకు కార‌ణాలేంటి? విధి నిర్వ‌హ‌ణ‌పై మ‌క్కువ చూపే ఆయ‌న విధుల‌ను వ‌ద‌ల‌డం వెనుక ప్ర‌భుత్వంపై అసంతృప్తి ఉందా? లేదా రాజ‌కీయ కార‌ణాలు ఏమైనా ఉన్నాయా.? 26 ఏళ్ల సుదీర్ఘ‌ ప్ర‌భుత్వ స‌ర్వీస్ లో కేవలం ఒక్క శాతమే పేదలకు సేవ చేయగలిగాన‌న్న ప్ర‌వీణ్ మాట‌ల్లో ఆంత‌ర్యం ఏంటి? ఆయ‌న త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రానున్నారా? వ‌స్తే.. ఏ పార్టీలో చేర‌తారు? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ అంటే.. ఒక‌ప్పుడు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేరు వినిపించేది. మంథని, మహదేవ్ పూర్, కాటారంలో ఆయన చేసిన ఎన్ కౌంటర్లు నాడు సంచ‌ల‌నంగా మారాయి. జనశక్తి సెక్రటరీ రణధీర్, బక్కన్న, తెలంగాణ మావోయిస్టు మహిళా సెక్రటరీ పద్మక్క, పొలిట్ బ్యూరో మెంబర్ సందె రాజమౌళి ఎన్ కౌంటర్ ల‌లో ప్ర‌వీణ్ దే కీల‌క పాత్ర‌. 2013లో గురుకులాల‌ సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేప‌ట్టిన నాటి నుంచీ గురుకుల విద్యార్థుల సంక్షేమంపైనే దృష్టి సారించారు. ద‌ళిత‌, సామాజిక వ‌ర్గాలు అభ్యున్న‌తి చెందాల‌ని మొద‌టి నుంచీ భావించే ఐపీఎస్ అధికారి ప్ర‌వీణ్.. పేదలకు, పీడితులకు అండగా ఉండి భావితరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించేందుకు అంటూ.. స్వ‌చ్ఛంద విర‌మ‌ణ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

విధి నిర్వ‌హ‌ణ‌లో చిత్త‌శుద్ధి గ‌ల పేరు సంపాదించిన ప్ర‌వీణ్‌ గ్రేహౌండ్స్ ఐజీగా కూడా మూడేళ్ల పాటు ప‌ని చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ గురుకుల పాఠశాలల డైరెక్టర్ గా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే అక‌స్మాత్తుగా స్వ‌చ్ఛంద విర‌మ‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రో ఆరేళ్లు స‌ర్వీస్ ఉండ‌గానే.. ప‌ద‌వీ రాజీనామా చేయ‌డంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఆయ‌న ఎందుకిలాంటి సడెన్ డెసిషన్ తీసుకున్నారని సర్వత్రా చర్చ నడుస్తోంది.

సామాజిక స‌మ‌స్య‌లు తొల‌గాల‌ని ప్రవీణ్‌ కుమార్ మొద‌టి నుంచీ త‌ప‌న ప‌డేవారు. భావిభారతాన్ని తీర్చిదిద్దడం అన్నిటికన్నా ముఖ్యమైనదని ఆయన నమ్ముతుంటారు. ఎస్పీగా ప‌ని చేస్తున్న కాలంలో కూడా సంకల్పం, సంజీవని, కాలేకడుపుకు బుక్కెడు అన్నం, మావోల బాధిత సంఘం, టీచర్లూ మా ఊరికి రండి, మా ఊరి గోసలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేప‌థ్యంలోనే ఐపీఎస్ అధికారిగా ఉండ‌గానే 2012లో స్వేరోస్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. ఈ ‘స్వేరోస్’ సంస్థకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్ద నెట్‌వర్క్ ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని అనేక మంది ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను తమ నాయకుడిగా భావిస్తారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటు వివాదాలూ వెంటాడాయి. గురుకులాల కార్యదర్శిగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్వేరోస్‌ పేరిట సైన్యాన్ని తయారు చేశారనే విమర్శలు వచ్చాయి. ఇటీవల పెద్దపల్లిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌ సమక్షంలోనే హిందూ దేవతలకు వ్యతిరేకంగా స్వేరోస్‌ ప్రతిజ్ఞ చేయడం వివాదాస్పదమైంది. ప్రవీణ్‌కుమార్‌ వ్యవహారాన్ని కేంద్రంలోనే తేల్చుకుంటామని తెలంగాణ బీజేపీ నేతలు ప్రకటించారు. మరోవైపు గురుకులాల్లో నియామకాలు, సరుకులు, మెటీరియల్‌ కాంట్రాక్టుల్లో ఇష్టారాజ్యం నడుస్తోందని, ఆడిట్‌ నివేదికలు కూడా బయటపెట్టడం లేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సంబంధిత మంత్రి పేషీకి తెలియకుండా ఇటీవల తొమ్మిది గురుకులాలకు ప్రిన్సిపాళ్ల నియామకం జరిగినట్లు నేరుగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు వెళ్లింది.

ఉద్యోగంలో ఉండ‌గా, పేద‌ల‌కు పూర్తి స్థాయిలో సేవ చేయ‌లేక పోయాన‌న్న బాధకు తోడు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితోనే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఇటీవల గురుకులాలకు సంబంధించిన మెస్‌, ఇతరత్రా బిల్లులను చెల్లించకుండా జాప్యం చేస్తుండటం, స్వయంగా వెళ్లి అడిగినా ప్రయోజనం లేకపోవడం, దాని ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతుండటంపై కొంతకాలంగా ప్రవీణ్‌కుమార్‌ నారాజ్‌గా ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గురుకులాలకు సంబంధించి అధికార ప్రజాప్రతినిధుల సిఫారసులు, ఒత్తిడి ఎక్కువయ్యాయనే అభిప్రాయంతో కూడా ఆయన ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉద్యోగ బాధ్యతల నుంచి బయటికి రావాలనే ఉద్దేశాన్ని గత రెండు, మూడు నెలలుగా సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజీనామాతో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌నున్నార‌న్న వార్త‌లు వెల్లువెత్తాయి. అయితే, త‌న రాజీనామాపై స్పందిస్తూ మీడియా ముందు మాట్లాడిన ప్ర‌వీణ్ కుమార్ మాట‌ల్లోనే ఆయ‌న భ‌విష్య‌త్ క‌నిపిస్తోంది. పేదలకు మరింత మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు చెప్పిన ఆయ‌న ప్రభుత్వంలో ఉంటే పరిధులకు లోబడి పని చేయాల్సి ఉంటుందని, బయట ఉంటే ఎలాంటి పరిధులు ఉండవని అన్నారు. 26 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌లో కేవలం ఒక్క శాతమే పేదలకు సేవ చేయగలిగానని, ఇకపై పూర్తిస్థాయిలో సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్ప‌డం ద్వారా రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై ఊహాగానాల‌ను పెంచారు.

కొంత కాలం విశ్రాంతి తీసుకుంటానని, పిల్లల చదువులు, కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత సామాజికవర్గ ఓట్లు దాదాపు 60 వేల ఉన్నాయి. తెలంగాణలోని దళిత, ఎస్టీ వర్గాల్లో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌కు మంచి ప‌ట్టు ఉంది. ఆ వ‌ర్గాలు ప్ర‌వీణ్ ను త‌మ నాయ‌కుడిగా కూడా భావిస్తాయి. ఈ తరుణంలో ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఖాయ‌మ‌ని, హుజూరాబాద్ నుంచే పోటీ చేస్తార‌న్న వార్త‌లు వెల్లువెత్తాయి. వీటిపై మాత్రం ఆయ‌న క్లారిటీ ఇచ్చేశారు. ఇప్ప‌ట్లో పోటీ చేసే ఆలోచ‌న లేద‌న్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తే.. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకమైనందున.. బీజేపీలోనూ చేరే అవకాశం లేదు. ‘జై భీం’ పేరుతో కొత్త పార్టీ పెడతారని, లేకపోతే రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) బాధ్యతలు చేపట్టి, రాజకీయంగా ముందుకు వెళ్తారని సన్నిహితులు అంచనా వేస్తున్నారు.