iDreamPost
android-app
ios-app

టీడీపీని అందుకే వీడుతున్నార‌ట‌..!

టీడీపీని అందుకే వీడుతున్నార‌ట‌..!

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఘోరంగా ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. కేవ‌లం 23 స్థానాల‌కే ప‌రిమితం అయింది. అస‌లే క‌ష్టాల్లో ఉన్న ఆ పార్టీకి ఆ త‌ర్వాత కూడా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు షాక్ ఇస్తూనే ఉన్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ, క‌ర‌ణం బ‌ల‌రాం, మద్ధాళి గిరి, వాసుప‌ల్లి గ‌ణేశ్ వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లికారు. వీరంతా విశ్వ ప్ర‌య‌త్నాలు చేసి వైసీపీ గూటికి చేరారు. అదే జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మ‌రో 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అది నిజ‌మా.. కాదా.. అన్న‌ది ప‌క్క‌న బెడితే అస‌లు వీరంతా టీడీపీని వీడేందుకు కార‌ణాలేంట‌ని ప‌రిశీలిస్తే.. కొన్ని కామ‌న్ గా క‌నిపిస్తున్నాయి.

కార‌ణాలివే…

గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర మ‌న‌స్తాపం పొందిన విష‌యం తెలిసిందే. కానీ ఎలాగైనా పార్టీకి పూర్వ స్థితిని తెచ్చేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. అందుకోసం విప‌రీత‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ జ‌గ‌న్ అనుస‌రిస్తున్న విధానాల‌తో వైసీపీ రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌ని చేయాల‌ని చంద్ర‌బాబు ఎమ్మెల్యేల‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నార‌ట‌. లేని స‌మ‌స్య‌ల‌పై కూడా పోరాటాలు చేయాల‌ని ఆదేశించేవార‌ట‌. అధినేత చెప్పిన‌ట్లు చేయ‌లేక‌.. పార్టీలో ఉండ‌లేక చాలా మంది స‌త‌మ‌తం అవుతున్నారు. వైసీపీకి మ‌ద్ద‌తు తెలిపిన అనంత‌రం ఎమ్మెల్యేల మాట‌ల్లో అది స్ప‌ష్టం అవుతుంది. దీంతో చంద్రబాబు తీరు నచ్చకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారన్న ప్ర‌చారం జోరందుకుంది.

దీనికి తోడు…

చంద్ర‌బాబు తీరుకు తోడు.. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అద్భుత‌మైన పాల‌న అందించ‌డం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డానికి కార‌ణాలుగా తెలుస్తోంది. ప్రతి నెలా తెల్లవారక ముందే ఇంటింటా పింఛన్లు అందిస్తున్నారు. ఇక నాడు-నేడు పేరుతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తోంది. అన్నింటికీ మించి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి త‌గ్గ‌డం లేదు. వీటన్నింటి కార‌ణంగా ప్ర‌జ‌ల్లో వైసీపీ కి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఆ పార్టీలో ఉంటేనే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ అని కూడా టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. అందుకే వైసీపీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.