తరతరాలుగా దగాపడాల్సిందేనా ? మేమెప్పుడూ చేతికి ఐదోవేలుగా ఉండాల్సిందేనా? రాయలసీమ వాసుల నుంచి తరచూ వినిపించే ఆవేదన, ఆక్రన్దన..! ప్రతి ప్రాంతానికి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. దానికి రాయలసీమ కూడా అతీతంకాదు. అయినా సీమ ప్రజల ఆకాంక్షలు రాయలసీమ బిడ్డయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియనివికావు. అందుకేనేమో హైకొర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాయలసీమ వాసుల్లో తమ దీర్ఘకాల డిమాండ్ కి గుర్తింపు దక్కిందనే భావన తొణికిసలాడుతోంది.
అన్నీ త్యాగాలు
మద్రాసు, హైదరాబాద్ , అమరావతి..ఇలా పరిపాలన, అభివృద్ధిలను ఒకేచోట కుప్పగా పోయడంతో రాయలసీమ ప్రజల్లో వివక్షకు గురవుతున్నామనే భావన పెరిగి పెద్దదైంది. ఈ భావన ఈ నాటిదేం కాదు. ఏకంగా 100 ఏళ్లకు పూర్వమే 1913లో మద్రాసు రాజధానిగా ప్రత్యేక విశాల రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. ఐతే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సిద్దంచాలనే లక్ష్యంతో అక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని త్యాగం చేశారు.1937లో ఆంధ్రప్రాంత నాయకులతో శ్రీబాగ్ ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేసేలా ఒడంబడిక చేసుకున్నారు. 1953లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు సదరు పెద్దమనుషుల ఒప్పందాన్ని అనుసరించి కర్నూలు రాజధాని అయ్యింది. కానీ అదీ మూడునాళ్ళ ముచ్చటే అయ్యి 1956, నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
సమైఖ్య రాష్ట్రానికి సమిధగా..
రాయలసీమ ప్రాంతం సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైందందని చెప్పేందుకు ఏమాత్రం సందేహించాల్సిన అవసరం పనిలేదు. అమరావతికి 35వేల ఎకరాలు ఇచ్చిన రైతులు త్యాగధనులు ఐనప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ కు 85 వేల ఎకరాలు ఇచ్చిన సీమ రైతులు ఇంకెంత పూజ్యనీయులు కావలి..! శ్రీశైలం కోసం ఇంత చేస్తే ప్రాజక్టు నీళ్ళేమో ఎక్కడో ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు మూడు పంటలు పండిస్తూ హాయిగా జీవిస్తుంటే సీమలో మాత్రం తాగేందుకు గుక్కుడు నీళ్లు లేక ఇబ్బంది పడుతుండటం గమనార్హం. శ్రీశైలం నుంచి వచ్చేనీళ్లతో తడిసి మాగాణిలుగా మారిన కోస్తా భూముల రేట్లను సీమలోని నీళ్లు లేక నెర్రలు చాచిన భూమి రేట్లుతో పోల్చే సాహసం ఎప్పుడెవరైనా చేయగలరా ? ఒకే రాష్ట్రం ఒకే భూమి.. కానీ దానికి దక్కే నీళ్లు, దక్కే రేటు, లభించే గుర్తింపు…. ఇలా అన్నీ వ్యత్యాసాలే…!
ఆరుగురు ముఖ్యమంత్రులు… అయినా
నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబునాయుడు, వై ఎస్ రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి… ఇవన్నీ సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాయలసీమ ప్రాంత నాయకుల పేర్లు. రాయలసీమ రాష్ట్రానికి నీళ్లిచ్చింది..నాయకులనిచ్చింది..రాజధానిని త్యాగం చేసింది..తిరిగేమి తీసుకుంది..! కరవు, వెనుకబాటుతనం, ద్వితీయప్రాధాన్యత ఇవేగా..! ఐతే రాజశేఖర్ రెడ్డి హయాంలో సీమకు అభివృద్ధి ఫలాలలు కొంత మెరుగ్గా అందాయి. వై ఎస్ ఆర్ పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచి సీమకు సాగునీరందించేందుకు కృషిచేశారు. జలయజ్ఞంలో కింద రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు లకు ప్రాధాన్యం ఇచ్చారు. సీమలోని చాలా పట్టణాలకు రింగురోడ్లు నిర్మించారు. దాంతో సీమలో సర్దుమణిగిన అసంతృప్తి మళ్లీ రాష్ట్ర విభజన అనంతరం పెల్లుబికింది.
52 స్థానాలకు గాను 49
చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో మొత్తం 52 స్థానాలు ఉంటే గతఎన్నికల్లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 49 స్థానాలను కైవసం చేసుకుంది. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి ఆయన బావమరిది బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. దీనికి టీడీపీ రెండు జిల్లాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనేది భావన ఒక కారణమైతే, జగన్ పట్ల ఉన్న నమ్మకాన్ని మరో కారణంగా చెప్పొచ్చు. అయితే జగన్ ఆ నమ్మకాన్ని వమ్ముచేకుండ సీమ ప్రజల అస్తిత్వాన్ని నిలిపేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు.
సీమనాయకుల డిమాండ్ ఏమిటి ?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నాం అనే సంకేతాలు పంపగానే సీమనేతలంతా స్వాగతిచారు. శ్రీభాగ్ ఒడంబడికను గౌరవిచారు అని వ్యాఖ్యానించారు. మైసూరారెడ్డి, శైలజానాధ్, గంగుల ప్రతాప్ రెడ్డి వంటి నేతలు సీమకు న్యాయంచేయాల్సిందిగా సీఎంకు లేఖ రాశారు. తదనంతరం టీజీ వెంకటేష్ వంటి నాయకులు హైకోర్టు వల్ల సీమకేమీ ఒరిగదు. రాజధానిని విశాఖలో కాకుండా సీమలో ఏర్పాటుచేయాలననే పల్లవందుకోవడం గమనార్హం.
జగన్ కు మాత్రం ఉండదూ…
ఒక రాష్ట్ర సీఎంగా కాకుండా ఒక సాధారణ రాయలసీమ వాసిగా ఆలోచిస్తే జగన్ కు మాత్రం రాయలసీమలో రాజధాని ఉండాలనే కోరిక లేకుండా పోతుందా ? టీడీపీ ఎన్నికల ముందే జగన్ గెలిస్తే రాజధాని ఇడుపులపాయకు తరలిపోతుందనే ప్రచారం మొదలుపెట్టింది. ఒకవేళ జగన్ ఇప్పుడు అలాంటి నిర్ణయమే తీసుకొని ఉంటే ప్రతిపక్షాలు మిగిలిన రెండుప్రాంతాల్లోని ప్రజలను రెచ్చగొట్టి అతన్నో ప్రాంతీయ దురాభిమానిగా చిత్రించేవి. కానీ జగన్ ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకుండా మూడు ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించారు. దీంతో పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు మొత్తం రాజధానిని విశాఖలోనో, అమరావతిలోనో, విశాఖలోనో పెట్టండి కానీ మూడు ముక్కలొద్దు అని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కర్నూలులోనే మొత్తం రాజధాని ఏర్పాటు చేస్తే అయన రియాక్షన్ ఎలా ఉండేదో ఊహించడం కష్టం కాదు ..!